Natural cultivation
-
ప్రకృతి సాగుకు ప్రాధాన్యం
రైతుల్ని నూరు శాతం ప్రకృతి సాగుబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి దశలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రకృతి సాగులో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించే సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. కావాల్సిన ఇన్పుట్స్ తయారీలో రైతులకు శిక్షణ కూడా ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు నేర్పుతూ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారు. దశలవారీగా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. మార్కెటింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సైన్స్, పరివర్తన, యాజమాన్యం, సర్టీఫికేషన్, స్థానిక విలువ జోడింపు, వ్యవస్థాగత పరిశ్రమలు ఇలా అన్ని విభాగాలలో ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారు. ఆదర్శ మండలాల్లో పౌష్టికాహారం అవసరమయ్యే వారందరికీ నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రతి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆహారంలో వాటిని భాగమయ్యేలా చూస్తారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత గ్రామస్తులకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తారు. – సాక్షి, అమరావతి జిల్లాకో మండలం చొప్పున ఎంపిక 100% ప్రకృతి సాగుతో ఆదర్శ మండలంగా అభివృద్ధిఏడాది పొడవునా ఆదాయంవచ్చేలా పంటల ప్రణాళిక పాయింట్ పర్సన్లుగా సెర్ప్ఏపీఎంలు, సీసీలు రైతులే విక్రయించుకునేలా.. దళారుల పాత్ర లేకుండా రైతులే స్వయంగా పంట ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయస్థాయి మార్కెట్లలో నేరుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు పంట ఉత్పత్తుల్ని విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా చూస్తారు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే పలువురు రైతులు ఏడాది పొడవునా పంటల సాగు ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) తరహా మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇదే మోడల్‌ను రాష్ట్రమంతా విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతలు ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం అప్పగించింది. సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సీసీలు ఈ ప్రాజెక్టులో పాయింట్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. వీరి సమన్వయంతో రైతు సాధికార సంస్థ సిబ్బంది ఎంపిక చేసిన మండలాల్లో సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారిని ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన చేయూత ఇస్తారు. పాయింట్ పర్సన్స్‌గా ఎంపికైన ఏపీఎం, సీసీలకు రాష్ట్ర స్థాయిలో రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపికైన మండలాలివీ.. ఈ ప్రాజెక్ట్ కోసం పాతపట్నం (శ్రీకాకుళం), జీఎల్ పురం (పార్వతీపురం మన్యం), వేపాడ (విజయనగరం), పద్మనాభం (విశాఖపట్నం), చీడికాడ (అనకాపల్లి), పాడేరు (అల్లూరి), ప్రత్తిపాడు (కాకినాడ), ఐ.పోలవరం (కోనసీమ), గోకవరం (తూర్పు గోదావరి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), జీలుగుమిల్లి (ఏలూరు), బాపులపాడు (కృష్ణా), రెడ్డిగూడెం (ఎన్టీఆర్ ), కొల్లిపర (గుంటూరు), బెల్లంకొండ (పల్నాడు), మార్టూరు (బాపట్ల), కొత్తపట్నం (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు), రామచంద్రపురం (తిరుపతి), శాంతిపురం (చిత్తూరు), చిన్నమందెం (అన్నమయ్య), పెండ్లిమర్రి (వైఎస్సార్), మడకశిర (శ్రీ సత్యసాయి), రాప్తాడు (అనంతపురం), ఓర్వకల్లు (కర్నూలు), ప్యాపిలి (నంద్యాల) మండలాలను ఎంపిక చేశారు. ప్రకృతి సాగులో ఆదర్శం జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. సెర్ప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. తొలుత సిబ్బందికి, ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తాం. సాగులో అవసరమైన చేయూత అందిస్తాం. – బీవీ రామారావు, సీఈవో, రైతు సాధికార సంస్థ -
వాతావరణ మార్పులపై ప్రజా ఉద్యమం
వాషింగ్టన్: వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ జరగదు. ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్ టేబుళ్ల దాకా వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత, సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక పాత్ర’’ అన్నారు. -
ఇక మరింత వేగంగా ప్రకృతి సాగు
సాక్షి, అమరావతి: ప్రకృతి సాగులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాష్ట్రానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రకృతి సాగు విస్తరణకు కో–ఇంపాక్ట్ అనే సంస్థ శుక్రవారం రూ.120 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 2017లో ఏర్పాటైన కో–ఇంపాక్ట్ సంస్థ నాలుగు ఖండాల్లోని 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాతలు, దాతృత్వ సంస్థలు, ఇతర ప్రైవేట్‌రంగ భాగస్వాములను ఒకే వేదికపైకి చేరుస్తోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ‘జెండర్ ఫండ్’ కాంపొనెంట్ కింద రాబోయే దశాబ్దంలో ఒక బిలియన్ అమెరికన్ డాలర్లను సేకరించి వివిధ కార్యక్రమాలకు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాయం కోసం 2022–27కి అంతర్జాతీయంగా 601 సంస్థల నుంచి ప్రతిపాదనలు రాగా 10 సంస్థలను మాత్రమే కో–ఇంపాక్ట్ ఎంపిక చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన రైతు సాధికార సంస్థ ఒకటి కావడం విశేషం. మహిళా సంఘాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్న రైతు సాధికార సంస్థకు ఈ ఏడాది ఆర్థిక చేయూతనివ్వాలని కో–ఇంపాక్ట్ సంకల్పించింది. ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 3,730 గ్రామాల్లో 6.30 లక్షల మందిని ప్రకృతి సాగువైపు మళ్లించడంలో రైతు సాధికార సంస్థ విజయవంతమైంది. ప్రకృతి వ్యవసాయంపై లోతైన పరిశోధనలు చేసేందుకు వైఎస్సార్ జిల్లా పులివెందులలో పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేఘాలయ, సిక్కిం, అసోం వంటి రాష్ట్రాలు సైతం తమ ప్రాంతాల్లో ప్రకృతి సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నాయి. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో 28 లక్షల మందిని, పొరుగు రాష్ట్రాల్లో మరో 4 లక్షల మందిని ప్రకృతి సాగు వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా కో–ఇంపాక్ట్ సంస్థ మంజూరు చేసిన రూ.120 కోట్ల నిధులతో రానున్న ఐదేళ్లలో ఏపీలో కనీసం 15 లక్షల మంది రైతులను కొత్తగా ప్రకృతి సాగువైపు మళ్లించనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం.. కో–ఇంపాక్ట్ సంస్థ ఇస్తున్న ఆర్థిక చేయూత రాష్ట్రంలో ప్రకృతి సాగును మరింత వేగంగా విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా లక్షలాది మంది సన్న, చిన్నకారు, మహిళా రైతుల జీవనోపాధి మెరుగవుతుంది. ప్రతి రైతు ప్రకృతి సాగుకు చేరువయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ సాయం తోడ్పాటును అందిస్తోంది. –టి.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ -
ప్రకృతి సాగులో ఏపీ భేష్
సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి సాగును ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని గ్రౌండ్స్ వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా ప్రశంసించారు. సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం గురువారం అనంతపురంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలనలో తమ అనుభవాలను విదేశీ ప్రతినిధులు పంచుకున్నారు. స్టీవ్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ విధానం అమలుచేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రత్యేకంగా రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి వ్యవసాయ భూమిని సారవంతం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయిస్తున్న తీరు అమోఘమన్నారు. రైతుల సంక్షేమం, భూ పరిరక్షణకు చేపడుతున్న చర్యలతో ప్రపంచానికే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. సమావేశానికి హాజరైన 15 దేశాల ప్రతినిధులు అందరూ నేర్చుకోవాలి : నేపాల్ నేపాల్ ప్రతినిధి నవరాయ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఇక్కడ రైతులు ఆచరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. నేపాల్‌లో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామన్నారు. ఇక ‘మేం విన్నది ఇక్కడ ప్రత్యక్షంగా చూశాం. పంట వైవిధ్యత, నీటి పొదుపు చర్యలు ఎంతో మెరుగ్గా వున్నాయి. బీజామృతంతో విత్తనశుద్ధి చేసి గుళికలు తయారుచేయడం ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక క్రమపద్ధతిలో చేస్తున్న ప్రకృతి సాగు ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు వాతావరణంలో స్పష్టమైన మార్పులు వస్తున్నట్లుగా గమనించాం. ప్రకృతి సాగులో మహిళల పాత్ర ఎంతో ఉంది’.. అని ఘనా∙దేశ ప్రతినిధి డాన్ బనాకూ అన్నారు. ప్రభుత్వ కృషి బాగుంది హోండూరస్ దేశ ప్రతినిధి ఎడ్విన్ ఎసకొటో మాట్లాడుతూ.. ఇక్కడ పర్యటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుని వెళ్తున్నామన్నారు. మా దేశంలో ఈ విధానాన్ని సులువుగా అమలుచెయ్యగలుగుతామన్న నమ్మకం కలిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు అదనపు ధర చెల్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందన్నారు. అలాగే, ఇక్కడ ఆచరిస్తున్న విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఆచరిస్తామని... ప్రకృతి సాగులో మహిళల భాగస్వామ్యం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని బుర్కినా ఫాసో దేశ ప్రతినిధి ఫాటూ భట్ట అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సేద్యం: మంత్రి కాకాణి ఇక ప్రకృతి వ్యవసాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ప్రస్తుతం నాలుగువేల ఆర్బీకేల పరిధిలో అమలవుతున్న ప్రకృతి సాగును భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి కాకాణి వెల్లడించారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతుసాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు మెక్సికో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా తనకు ఆహా్వనం అందిందని చెప్పారు. -
ప్రకృతి సేద్యంపై యూనివర్సిటీ
ఇంతకు ముందు స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంది.. ఈ రోజు పరిస్థితి ఎలా మారిందో మీరు చూడొచ్చు. (గతంలో స్కూల్ – పునర్ నిర్మాణం తర్వాత ఇప్పటి స్కూల్ ఫోటో చూపిస్తూ) మీరంతా బాగా చదివాలి. పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, మాట్లాడుతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి. గొప్పగా ఇంగ్లిష్ మాట్లాడాలి. ప్రపంచంతో పోటీ పడేలా ఎదగాలి. – వేంపల్లె విద్యార్థులతో సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప/వేంపల్లి : ‘జర్మన్ ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మనం ప్రకృతి వ్యవసాయంలో ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ప్రకృతి సేద్యంలో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలతోపాటు పీహెచ్‌డీలు కూడా అందిస్తాం. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చే విద్యార్థులకు ప్రపంచం మొత్తం ఆహ్వానం పలుకుతుంది. ప్రపంచం మొత్తానికి ప్రకృతి సేద్యం అందుబాటులోకి వస్తుంది. అదే మన స్వప్నం. ఆ లక్ష్యంతోనే ప్రకృతి సేద్యంపై ప్రపంచ స్థాయి పరిశోధనకు ఇండో–జర్మన్ అకాడమి ఏర్పాటు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏపీ కార్ల్ ప్రాంగణంలో ఇండో–జర్మన్ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమి (ఐజీజీఏఏఆర్‌ఎల్ –ఇండో – జర్మన్ గ్లోబల్ అకాడమి ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చి అండ్ లెర్నింగ్.. ఐజీ గార్ల్) ఏర్పాటుకు గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా న్యూటెక్ బయో సైన్సెస్‌కు శంకుస్థాపన చేశారు. ప్రకృతి వ్యవసాయ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో దేశ విదేశాల్లో విస్తరింపజేసే ఆశయంతో రూ.222 కోట్ల ఖర్చుతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇండో–జర్మన్ గ్లోబల్ అకాడమీని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ స్థాయిలో సమగ్ర అవగాహన ముఖ్యం ► ఇవాళ మనం రకరకాల క్యాన్సర్ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటీవల కాలంలో క్యాన్సర్ విస్తరిస్తోంది. ప్రధానంగా మనం ఆహారం రూపంలో తీసుకుంటున్న వివిధ రకాల కెమికల్స్ వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నాం. దీన్ని నివారించేందుకు ఉన్న ఏకైక మార్గం మనం తీసుకుంటున్న ఆహారంలో రసాయనాలు (కెమికల్స్) తగ్గించడమే. ► అది కేవలం గ్రామ స్థాయిలో సమగ్రమైన అవగాహన, విజ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రకృతి వ్యవసాయంపై గ్రామ స్థాయిలో సరైన అవగాహన అవసరం. గ్రామ స్థాయిలో ఇప్పటికే ఆర్బీకేలు పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం సుమారు 10,700 గ్రామాల్లో రైతులకు వాటి ద్వారా సేవలు అందుతున్నాయి. ► ఆర్బీకేలు రైతులను విత్తనం నుంచి విక్రయం వరకు సాగులో చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ నాణ్యతను పరీక్షించి వాటికి గ్యారంటీ ఇస్తూ కల్తీ విత్తనాలు, ఎరువులను నివారించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఆర్బీకేల పాత్ర మరింత కీలకం ► ఇకపై ఆర్బీకేలకు ప్రకృతి సేద్యాన్ని కూడా జత చేస్తున్నాం. ఇందుకు సంబంధించి తొలుత మనం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అన్ని ఆర్బీకేల్లో కచ్చితంగా ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్ ట్రైనర్, సైంటిస్టు ఉండాలి. ► గ్రామంలో ఉన్న కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీస్), అగ్రి సైంటిస్టు ఇద్దరూ కలిస్తే వారికున్న పరిజ్ఞానాన్ని గ్రామంలోని మిగిలిన రైతులకు అందించగలుగుతారు. ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ) ద్వారా అందుబాటులో ఉంచుతారు. తద్వారా గ్రామాలను ప్రకృతి సాగు దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాం. ► రసాయనాల వినియోగం తగ్గించి, ప్రకృతి సాగు వైపు వస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు వస్తాయని చెప్పలేం. ఆదాయాలు తొలుత తగ్గవచ్చు కూడా. అందుకే రైతుకు మూడు ఎకరాలు ఉంటే తొలి ఏడాది మూడవ వంతు మాత్రమే ప్రకృతి సాగు చేపట్టాలి. రెండవ ఏడాది 50 శాతం, మూడవ ఏడాది మొత్తం ప్రకృతి సాగువైపు మళ్లాలి. నాల్గవ సంవత్సరంలో ఫెస్టిసైడ్స్ వాడకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎఫ్‌పీఓ సర్టిఫికేషన్ ► ఐజీజీఏఏఆర్‌ఎల్ ఏర్పాటు ద్వారానే ఇదంతా సాధ్యమవుతుంది. గ్రామ స్థాయిలో ఈ రకమైన శిక్షణ కోసం మనం ఈ అకాడమి ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఆరు లక్షల మంది మాత్రమే ప్రకృతి సాగులో మమేకమై ఉన్నారు. సుమారు కోటిన్నర ఎకరాల్లో కేవలం ఆరు లక్షల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాగులో ఉంది. ► సహజ సాగు ఉత్పత్తులకు ఆర్బీకే స్థాయిలో సర్టిఫికేషన్ చేసే సౌలభ్యం అందుబాటులో ఉన్నప్పుడే మన ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తాయి. ప్రతి ఆర్బీకే పరిధిలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ) కనీసం ఒక్కటి ఉండేలా భవిష్యత్తులో అడుగులు వేస్తాం. ఒక్కసారి ప్రకృతి సాగు ఉత్పత్తులకు అధిక ధరలు లభించడం మొదలైతే అప్పుడు రసాయనాల వాడకానికి రైతులు స్వస్తి చెబుతారు. ఇదీ మన స్వప్నం ► ఇది మనం ఆశిస్తున్న మార్పు, మనం కంటున్న కల. ఇవాళ మనం మొదటి అంకంలో ఉన్నాం. ఏడెనిమిది ఏళ్లలో అసా««ధారణమైన ఫలితాలను చూడవచ్చు. పులివెందులలో ఐజీ కార్ల్(ఏపీ కార్ల్) గా ఉన్న కాలేజీ ఐజీ గార్ల్‌గా ఇవాల్టి నుంచి మారిపోతోంది. త్వరలో ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడి నుంచి సహజ సాగులో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ► జర్మన్ ప్రభుత్వం, కేంద్రంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలను కూడా భాగస్వాములను చేసి గొప్ప వ్యక్తులను తీసుకు రావాలన్న ప్రయత్నం జరుగుతోంది. దేవుడి దయవల్ల అది కచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. పులివెందుల అభివృద్ధి పనులపై సీఎం జగన్ సమీక్ష ► వైఎస్సార్ జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం సీఎం జగన్ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 11.40 గంటలకు పులివెందుల చేరుకున్నారు. నియోజకవర్గ పరిధిలో పాడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్షించారు. ► పాడా అభివృద్ధి పనులను ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మోడల్ టౌన్ పనుల పురోగతిని రాష్ట్ర ప్రణాళిక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌లు వివరించారు. డిసెంబర్ నాటికి దాదాపు అన్ని పనులు పూర్తి అవుతాయని చెప్పారు. పనుల్లో నాణ్యత ముఖ్యం అని సీఎం వారికి సూచించారు. ► పులివెందుల మున్సిపాలిటీ, పలు మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. అందరి సమస్యలు విని, పరిష్కరిస్తామని చెప్పారు. ► వేంపల్లెలో రూ.3.32 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభించారు. ఆ తర్వాత వేంపల్లెలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.7.80 కోట్లతో నిర్మించిన బాలికల పాఠశాల భవనాలను, మరో రూ.7 కోట్లతో నిర్మించిన బాలుర జిల్లా పరిషత్ పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముచ్చటించారు. ► ఈ కార్యక్రమంలో అభివృద్ధి సహకార మంత్రిత్వ శాఖ రాష్ట్ర కార్యదర్శి జోచన్ ప్లాస్బార్ట్, జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియా ఆఫీసు కేఎఫ్ డబ్లు్య డైరెక్టర్ క్రిస్టోఫ్ కెస్లర్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాష, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మా ఊరు మొత్తం ప్రకృతి వ్యవసాయమే నా భర్త మరణించిన తర్వాత రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండే ప్రకృతి వ్యవసాయానికి మళ్లాను. లాభసాటిగా ఉండడంతో డ్వాక్రా సంఘాల మహిళలకు పని కల్పించాను. ఇప్పుడు మా ఊరు ఊరంతా ప్రకృతి వ్యవసాయం చేస్తోంది. పెట్టుబడి సగమైంది. ఆదాయం రెట్టింపు అయింది. – సుశీలమ్మ, మన్యం జిల్లా, కురుపాం మండలం దేశం మొత్తం మీ వెంటే నడవడం ఖాయం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తోంది. కానీ మీరు (ముఖ్యమంత్రి) ప్రతి ఒక్క రైతుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను చేరవేయాలని ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మీ అడుగు జాడల్లో నడుస్తాయి. ఐజీ గార్ల్ న్యూటెక్ బయో సైన్సెస్‌గా నిలిచిపోతుంది. – నీలం పటేల్, నీతి అయోగ్ సీనియర్ అడ్వయిజర్ విశ్వజనానికి ప్రకృతి వ్యవసాయ ఫలాలు ఐజీ గార్ల్ సంస్థ కేవలం ఆంధ్రప్రదేశ్‌కో లేదా దేశంలోని ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్క రైతుకు విజ్ఞానాన్ని అందించి ప్రకృతి వ్యవసాయ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందించే ఆలోచనకు ప్రతి రూపం. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా ఈ సంస్థలో భాగస్వామ్యమైనందుకు సంతోషిస్తున్నాం. – ఎన్ఎన్ సిన్హా, కేంద్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సీఎం కృషి అమోఘం సీఎం వైఎస్ జగన్ రైతాంగం, వ్యవసాయం పట్ల చూపుతున్న ఆసక్తి గతంలో ఏ సీఎం చూపించలేదు. జర్మన్ ప్రభుత్వం, కేంద్రం, నీతి అయోగ్, ఐకార్తోపాటు పలు విశ్వవిద్యాలయాల సహకారంతో రైతాంగానికి అండగా నిలబడేందుకు కృషి చేశారు. – కాకాణి గోవర్దన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి మా స్కూలు చాలా బాగుంది ఇప్పుడు మా స్కూళ్లు చాలా బాగున్నాయి. ఇదంతా మీ (సీఎం) వల్లే. అమ్మ ఒడి పథకం చాలా గొప్పగా ఉంది. గోరుముద్ద వల్ల మంచి భోజనం తింటున్నాం. మీరు లెజండరీ సీఎం. మీలాంటి సీఎం దొరకడం మా అదృష్టం. మీ అండతో మేము గ్లోబల్ స్టూడెంట్స్‌గా మారుతాం. – శశికుమార్, జి.భానుశ్రీ, 10వ తరగతి, జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, వేంపల్లె -
ప్రకృతిసాగు వైపు రైతుల చూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలిస్తోంది. ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రైతులు ప్రకృతిసాగు చేపట్టారు. మోతాదుకు మించి వినియోగిస్తున్న ఎరువులు, పురుగుమందుల వల్ల నిస్సారమవుతున్న నేలతల్లిని పరిరక్షించుకునే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రకృతిసాగుకు శ్రీకారం చుట్టారు. ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడంతో గత రెండేళ్లుగా ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థలు, రైతుల సహకారంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది.వరితో పాటు వేరుశెనగ, కంది, మినుము, పెసర, పప్పు శెనగ, మొక్కజొన్న, రాగి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతోటలను ఈ విధానంలో సాగుచేస్తూ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మెట్ట భూముల్లో ఏడాది పొడవునా పంటలు పండించే దిశగా ప్రకృతిసాగు విస్తరిస్తోంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది.. 2018–19 నాటికి రాష్ట్రంలో 1,76,504 మంది రైతులు 2,32,937ఎకరాల్లో ప్రకృతిసాగు చేసేవారు. కొత్తగా 4.28 లక్షల ఎకరాల్లో 4,03, 979 రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆలోచనతో 2019–20లో 5,80,483 మంది రైతుల ద్వారా 6,50,350 ఎకరాల్లో ప్రకృతిసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కాగా ఆ ఏడాది 2,65,449 మంది రైతులు 2,15,848 ఎకరాల్లో ప్రకృతిసాగు వైపు ఆకర్షితులయ్యారు. దీంతో 2019–20 నాటికి ప్రకృతిసాగు చేస్తున్న రైతుల సంఖ్య 4,41,953 మందికి చేరింది. సాగువిస్తీర్ణం 4,48,785 ఎకరాలకు విస్తరించింది. 2020–21 నాటికి 4.78 లక్షల మంది.. కొత్తగా మరో 4,02,215 ఎకరాల్లో 2,59,547 మంది రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆలోచనతో 2020–21లో 7,00,500 మంది రైతుల ద్వారా 8.51 లక్షల ఎకరాల్లో ప్రకృతిసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కాగా ఆ ఏడాది కొత్తగా 30,059 మంది రైతులు 54,676 ఎకరాల్లో ప్రకృతిసాగు వైపు ఆకర్షితులయ్యారు. దీంతో 2020–21 నాటికి ప్రకృతిసాగు చేస్తున్న రైతుల సంఖ్య 4,78,844 మందికి చేరగా, సాగువిస్తీర్ణం 5,06,629 ఎకరాలకు పెరిగింది. ఈ ఏడాది 7.88 లక్షల ఎకరాల్లో ప్రకృతిసాగు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,58,837 ఎకరాల్లో 2,81,356 మంది రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆలోచనతో 2021–22లో 7,37,781 మంది రైతుల ద్వారా 7,88,085 ఎకరాల్లో ప్రకృతిసాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 4,91,545 ఎకరాల్లో 4,40,477 మంది రైతులు ప్రకృతిసాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాలో ప్రకృతిసాగు చేయాలని, ప్రతి రైతును దీనివైపు మళ్లించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రకృతి వనరుల కేంద్రంగా మార్చిన రైతుభరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అనుబంధంగా ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేకంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీలను) తీసుకొస్తోంది. ఇక్కడ ప్రకృతిసాగులో ఉపయోగించే కషాయాలు, జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య ద్రావణాలు వంటివి తయారుచేసి గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. గులిరాగులతో రూ.42 వేల ఆదాయం నాకు రెండెకరాల భూమి ఉంది. దాంట్లో ఎకరం భూమిలో వరి వేశా. అరెకరంలో గులిరాగి, అరకరంలో జీడిమామిడి సాగుచేస్తున్నా. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గులిరాగి సాగుచేశా. గులిరాగి విత్తనాలు ఉచితంగా ఇచ్చారు. దున్నడానికి, ఊడ్చ డానికి రూ.వెయ్యి ఖర్చయింది. సైకిల్ వీడర్‌తో కలుపు తీశా. సొంతంగా నీమాస్త్రం వేశా. ద్రవ జీవామృతం కోసం రూ.350 ఖర్చు పెట్టా. కోత తీసేందుకు రూ.470 ఖర్చయింది. ఇలా మొత్తం మీద అరెకరాకు రూ.1,740 వరకు ఖర్చయింది. రూ.42 వేల ఆదాయం వస్తోంది. – కె.చిన్నబుల్లి, చికిలింత, తూర్పుగోదావరి జిల్లా అన్నీ ప్రకృతిసాగు పద్ధతిలోనే.. 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 50 సెంట్లలో ఆకుకూరలు, 60 సెంట్లలో తీగజాతి కూరలు, 70 సెంట్లలో కూరగాయలు, 30 సెంట్లలో దుంపజాతి, 4 ఎకరాల్లో జీడిమామిడి, 30 సెంట్లలో మొక్కజొన్న సాగుచేస్తున్నా. యూ ట్యూబ్‌లో చూసి ప్రకృతిసాగు చేసేవాడిని. గడిచిన సీజన్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుచేస్తున్నా. ఘన జీవామృతం, నీమాస్త్రం వంటి ప్రకృతిసాగు ఇన్‌పుట్స్‌తో సహా రూ.90 వేల వరకు ఖర్చయింది. ఆకుకూరల నుంచి రూ.35 వేలు, తీగజాతి మొక్కల నుంచి రూ.లక్ష, దుంపజాతి మొక్కల నుంచి రూ.5 వేలు, కూరగాయల నుంచి రూ.45 వేలు, జీడిమామిడి నుంచి రూ.1.50 లక్షలలతో పాటు ఇంటి ఆవరణలో పెంచుకుంటున్న నాటుకోళ్ల ద్వారా రూ.80 వేలు కలిపి మొత్తం రూ.4 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. – గొల్లి సత్తిబాబు, వేములపూడి, విశాఖ జిల్లా ప్రకృతిసాగు లాభదాయకం ఇంటి ఆవరణలోని 5 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయల పండిస్తున్నా. అలాగే పొలంలో 27 సెంట్లలో కూరగాయలతోపాటు బొప్పాయి, మామిడి, అరటి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు వేశా. రూ.2,300 ఖర్చు చేశా. ఇప్పటికే రూ.10,500 ఆదాయం వచ్చింది. మరో రూ.25 వేల వరకు ఆదాయం రానుంది. ప్రకృతి వ్యవసాయంతో మంచి ఆదాయం వస్తోంది. – పి.యల్లమ్మ, కోడిగానిపల్లి, అనంతపురం జిల్లా లక్ష్యందిశగా ప్రకృతిసాగు రాష్ట్రంలో ప్రకృతిసాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆ దిశగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. 2018–19 నాటితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకృతి సాగు రైతుల సంఖ్య రెండింతలు పెరిగింది. విస్తీర్ణం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. 2021–22లో లక్ష్యం మేరకు సాగువిస్తీర్ణాన్ని పెంచ డంతో పాటు పెద్దఎత్తున రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆశయంతో ముందు కెళ్తున్నాం. – టి.విజయకుమార్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, రైతుసాధికార సంస్థ -
Organic Farming: వాట్సప్ ‘చాట్ బాట్’ ద్వారా ప్రకృతి సేద్యంలో మిరప సాగుపై సూచనలు..
రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మిరప పంటను సాగు చేయటం ఎన్నో సవాళ్లతో కూడిన కష్టతరమైన విషయం. అయితే, అసాధ్యం కాదని నిరూపిస్తున్న అనుభవజ్ఞులైన రైతులు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉన్నారు. అయితే, ఏ రైతైనా వ్యక్తిగతంగా తమకు ఫోన్ చేసే రైతులు కొద్ది మందికి మాత్రమే తమ జ్ఞానాన్ని అందించగలుగుతారే తప్ప.. వేలాది మందికి అందించలేరు. పంట కాలం పొడవునా ఎప్పుడంటే అప్పుడు చప్పున ఆయా రైతులకు సులువుగా అర్థమయ్యే మాటల్లో చెప్పగలగటమూ అసాధ్యమే. అయితే, అత్యాధునిక సాంకేతికత ‘కృత్రిమ మేథ’ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. రైతు తన మొబైల్లోని ‘వాట్సప్’ ఆప్ ద్వారా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని ‘డిజిటల్ గ్రీన్’ సంస్థ రుజువు చేస్తోంది. వాట్సప్‌లో ‘చాట్‌బాట్ టెక్నాలజీ’ని వినియోగించడం ద్వారా ఈ పనిని సంకల్పంతో సుసాధ్యం చేస్తోంది డిజిటల్ గ్రీన్. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరప సాగులో గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామానికి చెందిన రైతు దంపతులు కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు సిద్ధహస్తులు. ఎకరానికి 26 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీస్తున్న వీరి సుసంపన్నమైన అనుభవాలను శాస్త్రీయ పద్ధతుల్లో రికార్డు చేసిన డిజిటల్ గ్రీన్ సంస్థ.. వీరి అనుభవాలను తెలుగు నాట వేలాది మంది మిరప రైతులకు అత్యంత సులువైన రీతిలో, అచ్చమైన తెలగులో, ఉచితంగా వాట్సప్ చాట్‌బాట్ ద్వారా అందిస్తోంది. ఇందుకు రైతు చేయాల్సిందేమిటి? చాలా సులభం.. డిజిటల్ గ్రీన్ వాట్సప్ నంబరు 75419 80276కు వాట్సప్ లో రైతు జిజీ అని మెసేజ్ పంపితే చాలు. డిజిటల్ గ్రీన్ వాట్సప్ చాట్ బాట్ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతూ రైతు వాట్సప్ కు వెంటనే తెలుగులో మెసేజ్ రూపంలో వస్తుంది. అందులో పేర్కొన్న సూచనలతో పాటు రైతు తన మిరప పంట ఎన్ని రోజుల దశలో వుందో ఆయా ఐచ్చికాల (ఆప్షన్స్)ను మెసేజ్ రూపంలో చాట్ బాట్ పంపుతుంది. రైతు తన మిరప పంట ఐచ్చికాన్ని ఎంచుకొని పంపిన వెంటనే, ఆ రైతు మిరప పంట దశను సేవ్ చేసుకుంటుంది. రైతు మొదటిసారి తెలియజేసిన పంట దశ ఆధారంగా రాబోయే పంట దశను చాట్ బాటే స్వయంగా అంచనా వేసి.. ప్రతి దశ లో పాటించవలిసిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను లేదా తీసుకోవలసిన జాగ్రత్తలను వాట్సప్‌లో వీడియో రూపంలో పంపుతుంది. ఒక్క చెంచాడు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా మిరప నారు పోసుకునే దగ్గర నుంచి ఎండు మిరప కాయలు అమ్ముకునే వరకు.. వేలాది మంది రైతులు ఏకకాలంలో, ఎప్పుడంటే అప్పుడు వాట్సప్ ద్వారా మేలైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సేంద్రియ మిరప కాయలకు దేశ విదేశాల్లో గిరాకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ గ్రీన్ చొరవ రైతులకు ఎంతగానో తోడ్పడుతుందనటంలో సందేహం లేదు. ►మిరప రైతులు ప్రకృతి వ్యవసాయ సూచనల కోసం వాట్సప్ ద్వారా సంప్రదించాల్సిన మొబైల్ నంబరు : 75419 80276. అనంతపురం జిల్లాలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో డా. ఖాదర్ సదస్సులు స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి అవగాహన సదస్సులు కరోనా అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ నెల 26 (ఆది), 27 (సోమ) తేదీల్లో సదస్సులు జరగనున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటుతో అనంత ఆదరణ మిల్లెట్స్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ‘ఆదరణ’ రామకృష్ణ, ప్రొఫెసర్ గంగిరెడ్డి తెలిపారు. సిరిధాన్యాల సాగులో మెలకువలు, సిరిధాన్యాలను రోజువారీ ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే మార్గాలపై డా. ఖాదర్ వలి అవగాహన కల్పిస్తారు. ►సెప్టెంబర్ 26న ఉ. 10 గంటకు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ సమగ్ర పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో, 26న మధ్యాహ్నం 3 గంటలకు సింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ఉచిత రైతు అవగాహన సదస్సులు జరుగుతాయి. ►సెప్టెంబర్ 27న ఉ. 10 గంటలకు పర్తిశాల పుట్టపర్తిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి ఆధ్వర్యంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. ►సెప్టెంబర్ 27న సా. 4 గంటలకు లేపాక్షిలోని ఆర్.జి.హెచ్. కల్యాణ మండపంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొండూరు మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. ►ఇతర వివరాలకు.. ఆదరణ రామకృష్ణ – 98663 45715, ప్రొ. వై. గంగిరెడ్డి – 98483 87111. చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్.. ఎక్కడంటే.. -
4 నుంచి ‘చో’ సహజ సాగు పద్ధతిలో కోళ్ల పెంపకంపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు పద్ధతిలో నాటు కోళ్లు, బ్రాయిలర్ కోళ్లను రసాయనాలు వాడకుండా, దుర్వాసన రాకుండా, సొంతంగా తయారు చేసుకునే దాణాతో పెంచే పద్ధతులపై అక్టోబర్ 4 నుంచి 25 రోజుల పాటు యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండే శివశంకర్ తెలిపారు. సహజ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు ప్రాసెసింగ్, మార్కెటింగ్ నైపుణ్యాలపై కూడా ఆచరణాత్మక శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు కనీసం పదో తరగతి చదివి, 18 సంవత్సరాలు నిండాలి. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈనెల 23వ తేదీలోగా 81210 08002, 70133 09949 నంబర్లకు వాట్సప్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలని శివశంకర్ కోరారు. వ్యవసాయ డిప్లొమా చదివిన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. -
దేశీ విత్తనాలు, గోవులను రక్షించుకోవాలి
హైదరాబాద్: దేశీ విత్తనాలు, దేశీ గోవులను రక్షించుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి పిలుపునిచ్చారు. బహుళజాతి సంస్థలు అధిక దిగుబడి ఆశ చూపి సంకర జాతి విత్తన సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల భూసారం నాశనమవుతోందని, ఆ పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల జనం రోగాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూసారాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ఈ వ్యవసాయానికి వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి దేశీ విత్తన సాగును ప్రోత్సహించాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. దోమలగూడలోని రామకృష్ణమఠం ఆడిటోరియంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ దేశీ విత్తనోత్సవం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకం.. దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలని విద్యారణ్య భారతీస్వామి సూచించారు. దేశీ ఆవు మలమూత్రాలతో తయారయ్యే ఎరువు, జీవామృతంతో పెట్టుబడి అవసరంలేని ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమన్నారు. మాతా నిర్మలానంద భారతి మాట్లాడుతూ అమృతంలా ఉండాల్సిన ఆహారం కాస్తా విషంగా మారుతోందని, దీనికి ప్రకృతి సాగే పరిష్కారమని చెప్పారు. మాతా విజయేశ్వరీ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో బీపీ, షుగర్, కాళ్ల, కీళ్ల నోప్పులు అనే మాటలు సర్వసాధారణం అయ్యాయన్నారు. రోగాలు కొనితెచ్చే వ్యవసాయం మాని ఆరోగ్యాన్ని పెంచే ప్రకృతి సాగు చేపట్టాలని కోరారు. దేశీ విత్తనాలకు మంచి స్పందన.. విత్తనోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో దేశీ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది ప్రకృతి సాగు రైతులు ఈ స్టాళ్లను సందర్శించారు. కర్ణాటక, తమిళనాడు, ఒరిశా, ఏపీ, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదతర రాష్ట్రాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన వివిధ రకాల వరితో పాటు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సహజసిద్ధ విత్తనాలను రైతులు ఆసక్తిగా పరిశీలించారు. నాలుగేళ్లుగా ప్రకృతి సాగు మా వారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే. అయితే వ్యవసాయంపై మక్కువ. గ్రామంలో మాకున్న 25 ఎకరాల్లో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరితో పాటు పండ్ల తోటలను పెంచుతున్నాం. దేశీ విత్తనోత్సవంలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ దేశీ విత్తనాలు కొనుగోలు చేశాం. – కృష్ణవేణి, జయలక్ష్మిపురం, ఖమ్మం జిల్లా ప్రకృతి సాగువైపు అడుగులేస్తున్నారు దేశీ విత్తనోత్సవానికి మంచి స్పందన వస్తోంది. ప్రకృతి సాగుపై ఆసక్తితో తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల రైతులు కూడా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలను స్వయంగా చూస్తున్న రైతులు క్రమేణా ఈ విధానంవైపు అడుగులేస్తున్నారు. – విజయ్‌రాం, సేవ్ సంస్థ అధ్యక్షుడు, విత్తనోత్సవ నిర్వాహకుడు -
సహజ సాగుపై 40 రోజుల ఉచిత శిక్షణ
టెన్త్, ఇంటర్, వ్యవసాయ డిప్లొమా పూర్తిచేసిన 18–25 ఏళ్ల మధ్య యువతీయువకులకు డాక్టర్ చోహన్ క్యు (దక్షిణ కొరియా) సహజ సాగు పద్ధతిలో 40 రోజుల పాటు న్యూలైఫ్ ఫౌండేషన్ (హైదరాబాద్) ఉచిత శిక్షణ ఇవ్వనుంది. శిక్షణతోపాటు భోజనం, వసతి కూడా ఉచితమే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ ఇస్తామని ఫౌండేషన్ ప్రతినిధి శివశంకర్ తెలిపారు. చో సహజ సాగుతో పాటు చింతల వెంకటరెడ్డి మట్టి ద్రావణంతో సేద్యంపై కూడా శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా 86868 64152, 98660 73174 నంబర్ల ద్వారా వాట్సాప్‌లో సంప్రదించవచ్చు.