సాక్షి, అమరావతి: ప్రకృతి సాగులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాష్ట్రానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రకృతి సాగు విస్తరణకు కో–ఇంపాక్ట్ అనే సంస్థ శుక్రవారం రూ.120 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 2017లో ఏర్పాటైన కో–ఇంపాక్ట్ సంస్థ నాలుగు ఖండాల్లోని 8 దేశాల్లో విస్తరించి ఉంది.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాతలు, దాతృత్వ సంస్థలు, ఇతర ప్రైవేట్‌రంగ భాగస్వాములను ఒకే వేదికపైకి చేరుస్తోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ‘జెండర్ ఫండ్’ కాంపొనెంట్ కింద రాబోయే దశాబ్దంలో ఒక బిలియన్ అమెరికన్ డాలర్లను సేకరించి వివిధ కార్యక్రమాలకు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సాయం కోసం 2022–27కి అంతర్జాతీయంగా 601 సంస్థల నుంచి ప్రతిపాదనలు రాగా 10 సంస్థలను మాత్రమే కో–ఇంపాక్ట్ ఎంపిక చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన రైతు సాధికార సంస్థ ఒకటి కావడం విశేషం. మహిళా సంఘాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్న రైతు సాధికార సంస్థకు ఈ ఏడాది ఆర్థిక చేయూతనివ్వాలని కో–ఇంపాక్ట్ సంకల్పించింది.
ప్రస్తుతం ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 3,730 గ్రామాల్లో 6.30 లక్షల మందిని ప్రకృతి సాగువైపు మళ్లించడంలో రైతు సాధికార సంస్థ విజయవంతమైంది. ప్రకృతి వ్యవసాయంపై లోతైన పరిశోధనలు చేసేందుకు వైఎస్సార్ జిల్లా పులివెందులలో పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మన రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేఘాలయ, సిక్కిం, అసోం వంటి రాష్ట్రాలు సైతం తమ ప్రాంతాల్లో ప్రకృతి సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నాయి. వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో 28 లక్షల మందిని, పొరుగు రాష్ట్రాల్లో మరో 4 లక్షల మందిని ప్రకృతి సాగు వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా కో–ఇంపాక్ట్ సంస్థ మంజూరు చేసిన రూ.120 కోట్ల నిధులతో రానున్న ఐదేళ్లలో ఏపీలో కనీసం 15 లక్షల మంది రైతులను కొత్తగా ప్రకృతి సాగువైపు మళ్లించనున్నారు.
చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం..
కో–ఇంపాక్ట్ సంస్థ ఇస్తున్న ఆర్థిక చేయూత రాష్ట్రంలో ప్రకృతి సాగును మరింత వేగంగా విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా లక్షలాది మంది సన్న, చిన్నకారు, మహిళా రైతుల జీవనోపాధి మెరుగవుతుంది. ప్రతి రైతు ప్రకృతి సాగుకు చేరువయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ సాయం తోడ్పాటును అందిస్తోంది.
–టి.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment