సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి సాగును ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి అద్భుతమని గ్రౌండ్స్ వెల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవ్ బ్రేసియా ప్రశంసించారు. సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం గురువారం అనంతపురంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిశీలనలో తమ అనుభవాలను విదేశీ ప్రతినిధులు పంచుకున్నారు. స్టీవ్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ విధానం అమలుచేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని కొనియాడారు. ప్రత్యేకంగా రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి వ్యవసాయ భూమిని సారవంతం చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం చేయిస్తున్న తీరు అమోఘమన్నారు.
రైతుల సంక్షేమం, భూ పరిరక్షణకు చేపడుతున్న చర్యలతో ప్రపంచానికే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇందుకు ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
సమావేశానికి హాజరైన 15 దేశాల ప్రతినిధులు
అందరూ నేర్చుకోవాలి : నేపాల్
నేపాల్ ప్రతినిధి నవరాయ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఇక్కడ రైతులు ఆచరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు ఆదర్శనీయమన్నారు. నేపాల్‌లో పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామన్నారు. ఇక ‘మేం విన్నది ఇక్కడ ప్రత్యక్షంగా చూశాం.
పంట వైవిధ్యత, నీటి పొదుపు చర్యలు ఎంతో మెరుగ్గా వున్నాయి. బీజామృతంతో విత్తనశుద్ధి చేసి గుళికలు తయారుచేయడం ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక క్రమపద్ధతిలో చేస్తున్న ప్రకృతి సాగు ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు వాతావరణంలో స్పష్టమైన మార్పులు వస్తున్నట్లుగా గమనించాం. ప్రకృతి సాగులో మహిళల పాత్ర ఎంతో ఉంది’.. అని ఘనా∙దేశ ప్రతినిధి డాన్ బనాకూ అన్నారు.
ప్రభుత్వ కృషి బాగుంది
హోండూరస్ దేశ ప్రతినిధి ఎడ్విన్ ఎసకొటో మాట్లాడుతూ.. ఇక్కడ పర్యటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుని వెళ్తున్నామన్నారు. మా దేశంలో ఈ విధానాన్ని సులువుగా అమలుచెయ్యగలుగుతామన్న నమ్మకం కలిగిందన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు అదనపు ధర చెల్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందన్నారు. అలాగే, ఇక్కడ ఆచరిస్తున్న విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఆచరిస్తామని... ప్రకృతి సాగులో మహిళల భాగస్వామ్యం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని బుర్కినా ఫాసో దేశ ప్రతినిధి ఫాటూ భట్ట అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి సేద్యం: మంత్రి కాకాణి
ఇక ప్రకృతి వ్యవసాయానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ప్రస్తుతం నాలుగువేల ఆర్బీకేల పరిధిలో అమలవుతున్న ప్రకృతి సాగును భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి కాకాణి వెల్లడించారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతుసాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు మెక్సికో ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా తనకు ఆహా్వనం అందిందని చెప్పారు.
ప్రకృతి సాగులో ఏపీ భేష్
Published Fri, Sep 23 2022 3:50 AM | Last Updated on Fri, Sep 23 2022 7:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment