రైతుల్ని నూరు శాతం ప్రకృతి సాగుబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి దశలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రకృతి సాగులో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించే సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. కావాల్సిన ఇన్‌పుట్స్ తయారీలో రైతులకు శిక్షణ కూడా ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు నేర్పుతూ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారు. దశలవారీగా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు.
మార్కెటింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సైన్స్, పరివర్తన, యాజమాన్యం, సర్టీఫికేషన్, స్థానిక విలువ జోడింపు, వ్యవస్థాగత పరిశ్రమలు ఇలా అన్ని విభాగాలలో ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారు. ఆదర్శ మండలాల్లో పౌష్టికాహారం అవసరమయ్యే వారందరికీ నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ప్రతి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆహారంలో వాటిని భాగమయ్యేలా చూస్తారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత గ్రామస్తులకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తారు. – సాక్షి, అమరావతి
జిల్లాకో మండలం చొప్పున ఎంపిక
100% ప్రకృతి సాగుతో ఆదర్శ మండలంగా అభివృద్ధిఏడాది పొడవునా ఆదాయంవచ్చేలా పంటల ప్రణాళిక పాయింట్ పర్సన్లుగా సెర్ప్‌ఏపీఎంలు, సీసీలు
రైతులే విక్రయించుకునేలా..
దళారుల పాత్ర లేకుండా రైతులే స్వయంగా పంట ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయస్థాయి మార్కెట్లలో నేరుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు పంట ఉత్పత్తుల్ని విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా చూస్తారు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే పలువురు రైతులు ఏడాది పొడవునా పంటల సాగు ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) తరహా మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇదే మోడల్‌ను రాష్ట్రమంతా విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతలు
ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం అప్పగించింది. సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సీసీలు ఈ ప్రాజెక్టులో పాయింట్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. వీరి సమన్వయంతో రైతు సాధికార సంస్థ సిబ్బంది ఎంపిక చేసిన మండలాల్లో సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారిని ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన చేయూత ఇస్తారు. పాయింట్ పర్సన్స్‌గా ఎంపికైన ఏపీఎం, సీసీలకు రాష్ట్ర స్థాయిలో రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఎంపికైన మండలాలివీ..
ఈ ప్రాజెక్ట్ కోసం పాతపట్నం (శ్రీకాకుళం), జీఎల్ పురం (పార్వతీపురం మన్యం), వేపాడ (విజయనగరం), పద్మనాభం (విశాఖపట్నం), చీడికాడ (అనకాపల్లి), పాడేరు (అల్లూరి), ప్రత్తిపాడు (కాకినాడ), ఐ.పోలవరం (కోనసీమ), గోకవరం (తూర్పు గోదావరి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), జీలుగుమిల్లి (ఏలూరు), బాపులపాడు (కృష్ణా), రెడ్డిగూడెం (ఎన్టీఆర్ ), కొల్లిపర (గుంటూరు), బెల్లంకొండ (పల్నాడు), మార్టూరు (బాపట్ల), కొత్తపట్నం (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు), రామచంద్రపురం (తిరుపతి), శాంతిపురం (చిత్తూరు), చిన్నమందెం (అన్నమయ్య), పెండ్లిమర్రి (వైఎస్సార్), మడకశిర (శ్రీ సత్యసాయి), రాప్తాడు (అనంతపురం), ఓర్వకల్లు (కర్నూలు), ప్యాపిలి (నంద్యాల) మండలాలను ఎంపిక చేశారు.
ప్రకృతి సాగులో ఆదర్శం
జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. సెర్ప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. తొలుత సిబ్బందికి, ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తాం. సాగులో అవసరమైన చేయూత అందిస్తాం. – బీవీ రామారావు, సీఈవో, రైతు సాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment