సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలిస్తోంది. ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో రైతులు ప్రకృతిసాగు చేపట్టారు. మోతాదుకు మించి వినియోగిస్తున్న ఎరువులు, పురుగుమందుల వల్ల నిస్సారమవుతున్న నేలతల్లిని పరిరక్షించుకునే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రకృతిసాగుకు శ్రీకారం చుట్టారు. ప్రకృతిసాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడంతో గత రెండేళ్లుగా ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థలు, రైతుల సహకారంతో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా సాగుతోంది.వరితో పాటు వేరుశెనగ, కంది, మినుము, పెసర, పప్పు శెనగ, మొక్కజొన్న, రాగి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలతోటలను ఈ విధానంలో సాగుచేస్తూ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మెట్ట భూముల్లో ఏడాది పొడవునా పంటలు పండించే దిశగా ప్రకృతిసాగు విస్తరిస్తోంది.
2018–19 నాటికి 1.76 లక్షల మంది..
2018–19 నాటికి రాష్ట్రంలో 1,76,504 మంది రైతులు 2,32,937ఎకరాల్లో ప్రకృతిసాగు చేసేవారు. కొత్తగా 4.28 లక్షల ఎకరాల్లో 4,03, 979 రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆలోచనతో 2019–20లో 5,80,483 మంది రైతుల ద్వారా 6,50,350 ఎకరాల్లో ప్రకృతిసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కాగా ఆ ఏడాది 2,65,449 మంది రైతులు 2,15,848 ఎకరాల్లో ప్రకృతిసాగు వైపు ఆకర్షితులయ్యారు. దీంతో 2019–20 నాటికి ప్రకృతిసాగు చేస్తున్న రైతుల సంఖ్య 4,41,953 మందికి చేరింది. సాగువిస్తీర్ణం 4,48,785 ఎకరాలకు విస్తరించింది.
2020–21 నాటికి 4.78 లక్షల మంది..
కొత్తగా మరో 4,02,215 ఎకరాల్లో 2,59,547 మంది రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆలోచనతో 2020–21లో 7,00,500 మంది రైతుల ద్వారా 8.51 లక్షల ఎకరాల్లో ప్రకృతిసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కాగా ఆ ఏడాది కొత్తగా 30,059 మంది రైతులు 54,676 ఎకరాల్లో ప్రకృతిసాగు వైపు ఆకర్షితులయ్యారు. దీంతో 2020–21 నాటికి ప్రకృతిసాగు చేస్తున్న రైతుల సంఖ్య 4,78,844 మందికి చేరగా, సాగువిస్తీర్ణం 5,06,629 ఎకరాలకు పెరిగింది.
ఈ ఏడాది 7.88 లక్షల ఎకరాల్లో ప్రకృతిసాగు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,58,837 ఎకరాల్లో 2,81,356 మంది రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆలోచనతో 2021–22లో 7,37,781 మంది రైతుల ద్వారా 7,88,085 ఎకరాల్లో ప్రకృతిసాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 4,91,545 ఎకరాల్లో 4,40,477 మంది రైతులు ప్రకృతిసాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాలో ప్రకృతిసాగు చేయాలని, ప్రతి రైతును దీనివైపు మళ్లించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రకృతి వనరుల కేంద్రంగా మార్చిన రైతుభరోసా కేంద్రాలకు (ఆర్‌బీకేలకు) అనుబంధంగా ప్రకృతి వ్యవసాయం కోసం ప్రత్యేకంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను (సీహెచ్‌సీలను) తీసుకొస్తోంది. ఇక్కడ ప్రకృతిసాగులో ఉపయోగించే కషాయాలు, జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య ద్రావణాలు వంటివి తయారుచేసి గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు.
గులిరాగులతో రూ.42 వేల ఆదాయం
నాకు రెండెకరాల భూమి ఉంది. దాంట్లో ఎకరం భూమిలో వరి వేశా. అరెకరంలో గులిరాగి, అరకరంలో జీడిమామిడి సాగుచేస్తున్నా. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గులిరాగి సాగుచేశా. గులిరాగి విత్తనాలు ఉచితంగా ఇచ్చారు. దున్నడానికి, ఊడ్చ డానికి రూ.వెయ్యి ఖర్చయింది. సైకిల్ వీడర్‌తో కలుపు తీశా. సొంతంగా నీమాస్త్రం వేశా. ద్రవ జీవామృతం కోసం రూ.350 ఖర్చు పెట్టా. కోత తీసేందుకు రూ.470 ఖర్చయింది. ఇలా మొత్తం మీద అరెకరాకు రూ.1,740 వరకు ఖర్చయింది. రూ.42 వేల ఆదాయం వస్తోంది.
– కె.చిన్నబుల్లి, చికిలింత, తూర్పుగోదావరి జిల్లా
అన్నీ ప్రకృతిసాగు పద్ధతిలోనే..
30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. 50 సెంట్లలో ఆకుకూరలు, 60 సెంట్లలో తీగజాతి కూరలు, 70 సెంట్లలో కూరగాయలు, 30 సెంట్లలో దుంపజాతి, 4 ఎకరాల్లో జీడిమామిడి, 30 సెంట్లలో మొక్కజొన్న సాగుచేస్తున్నా. యూ ట్యూబ్‌లో చూసి ప్రకృతిసాగు చేసేవాడిని. గడిచిన సీజన్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుచేస్తున్నా. ఘన జీవామృతం, నీమాస్త్రం వంటి ప్రకృతిసాగు ఇన్‌పుట్స్‌తో సహా రూ.90 వేల వరకు ఖర్చయింది. ఆకుకూరల నుంచి రూ.35 వేలు, తీగజాతి మొక్కల నుంచి రూ.లక్ష, దుంపజాతి మొక్కల నుంచి రూ.5 వేలు, కూరగాయల నుంచి రూ.45 వేలు, జీడిమామిడి నుంచి రూ.1.50 లక్షలలతో పాటు ఇంటి ఆవరణలో పెంచుకుంటున్న నాటుకోళ్ల ద్వారా రూ.80 వేలు కలిపి మొత్తం రూ.4 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది.
– గొల్లి సత్తిబాబు, వేములపూడి, విశాఖ జిల్లా
ప్రకృతిసాగు లాభదాయకం
ఇంటి ఆవరణలోని 5 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయల పండిస్తున్నా. అలాగే పొలంలో 27 సెంట్లలో కూరగాయలతోపాటు బొప్పాయి, మామిడి, అరటి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు వేశా. రూ.2,300 ఖర్చు చేశా. ఇప్పటికే రూ.10,500 ఆదాయం వచ్చింది. మరో రూ.25 వేల వరకు ఆదాయం రానుంది. ప్రకృతి వ్యవసాయంతో మంచి ఆదాయం వస్తోంది.
– పి.యల్లమ్మ, కోడిగానిపల్లి, అనంతపురం జిల్లా
లక్ష్యందిశగా ప్రకృతిసాగు
రాష్ట్రంలో ప్రకృతిసాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆ దిశగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. 2018–19 నాటితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకృతి సాగు రైతుల సంఖ్య రెండింతలు పెరిగింది. విస్తీర్ణం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. 2021–22లో లక్ష్యం మేరకు సాగువిస్తీర్ణాన్ని పెంచ డంతో పాటు పెద్దఎత్తున రైతులను ప్రకృతిసాగు వైపు మళ్లించాలన్న ఆశయంతో ముందు కెళ్తున్నాం.
– టి.విజయకుమార్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, రైతుసాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment