
సాక్షి, హైదరాబాద్: బలమైన విత్తన వ్యవస్థతోనే దేశాల ఆహార భద్రత ఆధారపడి ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి శోభన్ పట్నాయక్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, ఇండో జర్మన్ విత్తన కోఆపరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ‘మేలైన విత్తన నాణ్యతకు.. పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం’అనే అంశంపై మంగళవారం వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో విత్తన కేంద్రంగా తెలంగాణ ఇప్పటికే నిలబడిందన్నారు.
ప్రపంచ విత్తనరంగంలో అభివృద్ధి ఐదు శాతముంటే, దేశంలో 12–15 శాతం ఉందన్నారు. మళ్లీ హరిత విప్లవం సాధించడంలో మేలైన విత్తనానిదే ప్రధాన పాత్రన్నారు. దేశంలో సాగయ్యే అన్ని పంటల విత్తనోత్పత్తి తెలంగాణలోనే సాధ్యమని, అందుకే విత్తన భాండాగారంగా వెలుగొందుతుందన్నారు. దేశంలో మరో 150 విత్తన హబ్‌లను ఏర్పాటు చేస్తామని పట్నాయక్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విత్తన కార్పొరేషన్లు బలంగా ఉంటే, ధ్రువీకరణ బలహీనంగా ఉందన్నారు. రెండు వ్యవస్థలు బలంగా ఉంటేనే విత్తన వ్యవస్థ బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, మేనేజ్ డీజీ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.