గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో పార్థసారథి సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనాలపై అమెరికాకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరిచింది. ఇక్కడి విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని ఫౌండేషన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్‌గుడ్ సహా ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్‌గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు ఎంతో అనుకూలమైనవని అన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనోత్పత్తి తక్కువగా ఉంటుందని, ఆయా దేశాల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ వరి విత్తన పద్ధతులను ఆఫ్రికా దేశాల్లో అమలుపరుస్తామని పేర్కొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తి తెలంగాణలో చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 90 శాతం హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. 400 విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్నాయన్నారు. గతేడాది సూడాన్, రష్యా, టాంజానియా తదితర దేశాలకు వరి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎగుమతి చేశామన్నారు. ఈ ఏడాది ఆఫ్రికా దేశాలకు విత్తనాల ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని, వెయ్యి టన్నుల విత్తనాలను ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment