telangana Seeds Corporation
-
‘ఇస్టా’ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు ఎన్నికయ్యారు. భారతదేశానికి, అందునా తెలంగాణకు ప్రపంచ వేదికపై దక్కిన అరుదైన గౌరవంగా వ్యవసాయశాఖ వర్గాలు అభివర్ణించాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా విత్తన చట్టాలను, పాలసీలను, మార్కెట్లో విత్తన నాణ్యత, నియంత్రణ, సరఫరా మొదలగు అంశాలన్నింటిలో తీసుకునే కీలక నిర్ణయాలలో ప్రధానపాత్ర పోషించే ఇస్టా కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. జూన్ 26 నుంచి హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఐసీసీలో అంతర్జాతీయ విత్తన సదస్సు– 2019 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇస్టా అత్యున్నత కమిటీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌తోపాటు 8 మంది సభ్యులు ఉంటారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి వివిధ దేశాల ప్రతినిధుల ద్వారా ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి తెలంగాణకు చెందిన డాక్టర్ కె.కేశవులు వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1924లో ఏర్పాటైన ఈ సంస్థలో భారతదేశానికి ఉపాధ్యక్ష పదవి లభించడం ఇదే మొదటిసారి. ఇస్టా ఉపాధ్యక్షుడిగా కేశవులు ఎన్నికవ్వడం భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ అగర్వాల్, రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి పేర్కొన్నారు. భారతదేశ విత్తనరంగంలో ఈ దశాబ్దకాలంలో వివిధ దేశాలకు దీటుగా, దేశ అవసరాలకు సరిపడా విత్తనోత్పత్తి చేస్తూ, వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న తరుణంలో ఈ స్థానం సంపాదించడం తెలంగాణకు ఎంతో గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఇస్టా సంస్థ ఉపాధ్యక్షుడిగా 2019–22 వరకు కేశవులు కొనసాగుతారు. సంస్థ నిబంధనల ప్రకారం ఇస్టా ఉపాధ్యక్షుడే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అంటే 2022–24 మధ్య ఇస్టా అధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్టా సంస్థ వందేళ్ల కార్యక్రమం కేశవులు నేతృత్వంలోనే జరిగే అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా మన దేశం ముఖ్యంగా తెలంగాణ నుంచి వివిధ దేశాలకు విత్తనాలు ఎగుమతులు చేసుకోవడానికి దోహదపడనుంది. అంతేకాకుండా విత్తన పరీక్షలో పద్ధతులు, నాణ్యత పెరిగి విత్తన చట్టాలను, పాలసీలను రూపొందించడానికి ఉపయోగపడనుంది. తెలంగాణ బిడ్డ... డాక్టర్ కేశవులు ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తెలంగాణకు గర్వకారణం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కేశవులు ఇంటర్మీడియట్ వరకు వరంగల్ జిల్లాలో విద్యను అభ్యసించి, వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీని పొంది, తమిళనాడులోని కోయంబత్తూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్, అమెరికాలో పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేసి విత్తన శాస్త్రంలో అత్యంత అనుభవం గడించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విత్తన శాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలో, విత్తనాభివృద్ధి సంస్థలో సంచాలకులుగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ విత్తన ప్రముఖుడైన ప్రొఫెసర్ కెంట్ బ్రాడ్ఫోర్డ్తో కలిసి పనిచేశారు. యూఎస్ఏఐడీ భాగస్వామ్య సభ్యుడిగా ఉండి ఈస్ట్ ఆఫ్రికన్, సౌత్ ఆసియా దేశాలలో విత్తన పద్ధతుల అభివృద్ధిపై అధ్యయనం చేశారు. విత్తన నిల్వలో ఆహారధాన్యాల నష్టాన్ని తగ్గించి అంతర్జాతీయంగా అంగీకరించిన వినూత్న విత్తన నిల్వ పద్ధతులను కనుగొన్నారు. ఇస్టా, ఓఈసీడీ నేపాల్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఏబీఐ ఆఫ్రికా, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఆఫ్ టాంజానియా, బంగ్లాదేశ్‌లతో కలిసి విత్తన రంగ అభివృద్ధికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో, 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో కేశవులు కీలకపాత్ర పోషించారు. కేశవులు ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడంతో తెలంగాణకు అనేక అవకాశాలు లభిస్తాయంటున్నారు. విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇతర దేశాలతో భాగస్వామ్యం కావడానికి మంచి అవకాశం లభించనుంది. ఇస్టా నూతన కార్యవర్గం అధ్యక్షుడు : స్టీవ్ జోన్స్ (కెనడా) ఉపాధ్యక్షుడు : డాక్టర్ కె.కేశవులు (తెలంగాణ, భారత్) కార్యవర్గ సభ్యులు : క్లెయిడ్ ముజాజు (జింబాబ్వే); వాలేరి కొకరేల్ (యునైటెడ్ కింగ్డమ్); శైల్వీ డ్యూకోర్నో (ఫ్రాన్స్); బెర్టా కిల్లర్మన్ (జర్మనీ); రిటాజెకెనెల్లీ (ఇటలీ); రూయెల్ సి.గెస్ముండో (ఫిలిప్పైన్స్); లీనా పియెట్ల్లా (ఫిన్లాండ్); ఇగ్నోషియో అర్నషియాగ (అర్జెంటీనా) -
రైతులకు నాణ్యమైన సోయా విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు నాణ్యమైన సోయా విత్తనా లు సరఫరా చేస్తున్నామని తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. టెండర్ నిబంధనల ప్రకారమే ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. సోయా విత్తనోత్పత్తిలో కంపెనీలు మోసం చేస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుడైన వెంకట్రావు విత్తన ఉత్పత్తి, సరఫరాదారుల సంఘం లెటర్ హెడ్‌ను దుర్వినియోగపరుస్తూ, దాని అధ్యక్షుడిగా 3 నెలలు గా ఉన్నతాధికారులు, సంస్థల మీద తప్పుడు ఫిర్యా దులు చేస్తున్నారన్నారు. నకిలీ సోయా విత్తనాలను విత్తన ధ్రువీకరణ సంస్థ ఏనాడూ ధ్రువీకరించలేదన్నారు. సరైన ఆధారాలు, రైతుల పూర్తి చిరునామా, మూలవిత్తనం సరఫరా చేసిన విత్తనట్యాగులతో సహా సమర్పించిన తర్వాత ఆన్లైన్లో మాత్రమే విత్తన క్షేత్రాలను నమోదు చేస్తామని వివరిం చారు. కాబట్టి ఎటువంటి అక్రమాలు జరిగే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రైతుల ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్‌లు వారికి తెలియకుండా సేకరించడం జరగని పని అని అన్నారు. విత్తన ధ్రువీకరణను నాలుగైదు అంచెల్లో ఉన్న అధికారులతో కూడిన తనిఖీ బృం దాలతో కలిపి చేస్తారన్నారు. మూడేళ్లుగా 18–20 లక్షల విత్తనాలను మన రాష్ట్రానికే కాకుండా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు. -
ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తనాలపై అమెరికాకు చెందిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఆసక్తి కనబరిచింది. ఇక్కడి విత్తనాలు ఆఫ్రికా దేశాలకు అనుకూలంగా ఉంటాయని ఫౌండేషన్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగ అభివృద్ధికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే సంస్థ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ లారెన్‌గుడ్ సహా ఆఫ్రికన్ దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లారెన్‌గుడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విత్తనాలు ఆఫ్రికా దేశాలకు ఎంతో అనుకూలమైనవని అన్నారు. విత్తనోత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఆఫ్రికా దేశాల్లో విత్తనోత్పత్తి తక్కువగా ఉంటుందని, ఆయా దేశాల అవసరాలకు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ వరి విత్తన పద్ధతులను ఆఫ్రికా దేశాల్లో అమలుపరుస్తామని పేర్కొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ పంటల విత్తనోత్పత్తి తెలంగాణలో చేపడుతున్నామని చెప్పారు. దాదాపు 90 శాతం హైబ్రిడ్ విత్తనోత్పత్తి తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. 400 విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు హైదరాబాద్ చుట్టుపక్కల నెలకొని ఉన్నాయన్నారు. గతేడాది సూడాన్, రష్యా, టాంజానియా తదితర దేశాలకు వరి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు విత్తనాలను ఎగుమతి చేశామన్నారు. ఈ ఏడాది ఆఫ్రికా దేశాలకు విత్తనాల ఎగుమతికి సిద్ధంగా ఉన్నామని, వెయ్యి టన్నుల విత్తనాలను ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
ఈ‘సారీ’ ప్రైవేటు విత్తే!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (తెలంగాణ సీడ్ కార్పొరేషన్) వరుస వైఫల్యాలు చెందుతోంది. జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలను ఉత్పత్తి చేయడంలో ఈ సంస్థ ఈసారి కూడా విఫలమైంది. గత ఏడాది (2017) ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసేందుకు 2016లో చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఫలితాలనివ్వలేదు. దీంతో గత ఖరీఫ్ సోయా విత్తనాలను ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే వైఫల్యం పునరావృతమైంది. ఈసారి సోయా విత్తనోత్పత్తిలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ వరుస వైఫల్యాలు ప్రైవేటు విత్తన సంస్థలకు పరోక్షంగా ప్రయోజనం చేకూర్చుతోందనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది. జిల్లాలో నెరవేరని ఉత్పత్తి లక్ష్యం.. ఈ ఖరీఫ్ సీజనులో జిల్లాకు అవసరమైన సుమా రు 40 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను నిజామాబాద్ జిల్లాలోనే స్వయంగా ఉత్పత్తి చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. అయితే 1,600 క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్ తదితర ప్రాంతాల్లో విత్తనాలు పండించే రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి సోయా విత్తనోత్పత్తి చేయాలని రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. 2017 సెప్టెంబర్ చివరి వారంలో, అక్టోబర్ మొదటి వారంలో కురిసిన వర్షానికి ఈ విత్తనం పనిచేయకుండా పోయిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేతులెత్తేసింది. 40 వేల క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యానికి గాను కేవలం 1,600 క్వింటాళ్లతో సరిపెట్టి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లా విత్తనాల అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈసారి సోయా విత్తనాలు సరఫరా చేసే విత్తన కంపెనీలు ధరను పెంచేశాయి. క్వింటాలుకు సుమారు రూ.400 వరకు అధిక ధరకు సర్కారుకు విక్రయిస్తోంది. కోత దశలో వర్షం కురవడంతో అనుకున్న మేరకు జిల్లాలో విత్తనోత్పత్తి జరగలేదని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ రాజీవ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా.. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేయడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ విత్తనోత్పత్తే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ జిల్లాలో ఈ విత్తనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. ప్రైవేటు.. సోయా పంటను అత్యధికంగా సాగు చేసే జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. 2017 ఖరీఫ్‌లో 99 వేలు ఎకరాలు సాగైంది. ఈ ఖరీఫ్‌లో సుమారు 91వేల ఎకరాల్లో సోయా సాగువుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 73,586 క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సోయా విత్తనాలను ఉత్పత్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందజేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రూ.కోట్లలో నిధులు ప్రైవేటు విత్తన కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఐదు ప్రభుత్వ రంగ సంస్థలకు పంపిణీ బాధ్యతలు ఈ ఖరీఫ్ సీజనుకు అవసరమైన 73 వేల క్వింటాళ్ల సోయా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసే బాధ్యతలను ప్రభుత్వం ఐదు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించింది. తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌కు 49 వేల క్వింటాళ్లు అలాట్మెంట్ ఇచ్చింది. అలాగే హాకా, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్లకు ఈ బాధ్యతలను అప్పగించింది. 102 కేంద్రాల ద్వారా రైతులకు ఈ సబ్సిడీ సోయా విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
సోయా.. ఆయా
♦ విత్తనోత్పత్తికి శ్రీకారం విత్తన భాండాగారంగా ‘ఖేడ్’ ♦ రాష్ట్రంలోనే ప్రథమం ఇక అందుబాటులో విత్తనాలు ♦ సంబురాల్లో రైతులు కల్హేర్: వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం విత్తన భాండాగారంగా వెలుగొందనుంది. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోయాబీన్ విత్తనోత్పత్తి చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోయాబీన్ మూలవిత్తనం సాగు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. కల్హేర్, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో వెయ్యి ఎకరాల చొప్పున సోయాబీన్ ఉత్పత్తి కోసం కార్యాచరణ రూపొందించారు. సోయాబీన్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్ నుంచి మూల విత్తనాలు దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేసేది. ఖేడ్ ప్రాంతంలోనే విత్తనోత్పత్తి చేపట్టడంతో రైతులకు విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి కోసం 3 వేల విత్తన బస్తాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్సిడీపై సరఫరా చేస్తారు. 30 కిలోల బస్తా ధర రూ. 1,410 కాగా అదనంగా అధికారుల తనిఖీ చార్జి రూ. 140, రిజిష్ట్రేషన్ చార్జి రూ. 157.. మొత్తం రూ. 1707కు రైతులకు పంపిణీ చేస్తారు. 30 కిలోల బస్తా వాస్తవ ధర రూ.2250. సబ్సిడీపై రూ.1707కు అందజేస్తారు. కాగా ఒక రైతు నుంచి ఒక బస్తాకే రిజిస్ట్రేషన్ చార్జి వసూలు చేస్తారు. మిగతా బస్తాలకు వసూలు చేయరు. ఈ విషయాలన్నింటిపైనా ఇటీవల సీడ్స్ కార్పొరేషన్ మెదక్-రంగారెడ్డి జిల్లాల డీఎం సురేందర్‌రెడ్డి మండలంలోని మార్డిలో సోయాబీన్ విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కలిపించారు. సాధారణ నేలలు అనుకూలం.. సోయాబీన్ విత్తనోత్పత్తి కోసం సాధారణ భూములు అనుకూలం. ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు కురిస్తే.. జూన్ మొదటి వారం నుంచి నెలాఖరు వరకు సోయ సాగు చేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట సాగు కాలం 95 రోజుల నుంచి 105 రోజులు. ఒక రైతు 25 ఎకరాల వరకు కూడా సోయాను సాగు చేయవచ్చు. సోయ విత్తనోత్పత్తికి సంబంధించి సీడ్స్ కార్పొరేషన్, రైతుల మధ్య రూ. 100 విలువ చేసే స్టాంప్ పేపర్‌పై ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. రైతులు పండించిన సోయ విత్తనం వ్యాపారులకు కాకుండా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు విక్రయించేందుకే ఈ ఒప్పంద ఉద్దేశం. పంట చేతికొచ్చాక మార్కెట్లో ఉన్న ధరకు 15 నుంచి 20 శాతం అధికంగా డబ్బులు చెల్లించి సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతారు. నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు చేసిన సోయాకు 75 శాతం మొదట డబ్బులు చెల్లిస్తారు. తేమ శాతన్ని పరిశీలించేందుకు సోయను ప్రభుత్వ ల్యాబ్‌కు పంపిస్తారు. ల్యాబ్ పరీక్షలో 9 శాతం తేమ ఉంటేనే కోనుగోలు చేస్తారు. రైతులు తేమ శాతం పట్ల జాగ్రత్త పాటించాలి. విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు ఉత్సహం కనబరుస్తున్నారు. సోయ విత్తనోత్పత్తితో రాష్ట్రంలో విత్తనాల కొరత తీరనుంది. -
తెలంగాణలో సోయ విత్తనోత్పత్తి
కల్హేర్: మెదక్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాం నారాయణఖేడ్ నియోజకవర్గం ఇక విత్తన భండగారంగా వెలుగొంనుంది. తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో సోయబీన్ విత్తనోత్పత్తి చేపట్టెందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొదటిసారిగా సోయబీన్ మూలవిత్తనం సాగు కోసం నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. కల్హేర్, కంగ్టీ, మనూర్, నారాయణఖేడ్ మండలాల్లో 1,000 ఎకరాల చొప్పున సోయబీన్ ఉత్పత్తి కోసం కార్యాచరణ రూపొందించారు. సోయబీన్ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. సోయబీన్ సాగు కోసం ప్రభుత్వం గతంలో మద్యప్రదేశ్ నుంచి మూల విత్తనాలు దిగుమతి చేసుకుని రైతులకు సరఫరా చేసేది. ఖేడ్ ప్రాంతాంలో సోయబీన్ విత్తనోత్పత్తి చేపట్టడంతో రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనోత్పత్తి కోసం రైతులకు సరఫరా చేసేందుకు కావాల్సిన 3 వేల బస్తాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. విత్తనోత్పత్తి చేపట్టేందుకు రైతులకు విత్తనాలను సబ్సిడిపై సరఫరా చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవలే సీడ్స్ కార్పోరేషన్ మెదక్-రంగారెడ్డి జిల్లాల డిఏం సురేందర్‌రెడ్డి మండలంలోని మార్డిలో సోయబీన్ విత్తనోత్పత్తిపై రైతన్నలకు అవగాహన కలిపించారు. సాధారణ నేలలు అనుకూలం.. సోయబీన్ విత్తనోత్పత్తి కోసం సాధరణ భూములు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్‌లో తోలకరి వర్షాలు కురిస్తే జూన్ మొదటి వారం నుంచి నెలాఖరి వరకు సోయ సాగు చేపట్టవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట సాగు కాలం 95 రోజుల నుంచి 105 రోజులు ఉంటుంది. సోయ విత్తనోత్పత్తికు సంబందించి సీడ్స్ కార్పోరేషన్, రైతుల మధ్య రూ. 100 విలువ చేసే స్టాంప్ పేపర్‌పై ఓప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఒప్పందం మేరకు రైతులు పండించిన సోయ విత్తనం వ్యాపారులకు కాకుండ తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్‌కు విక్రయించడమే ఒప్పందం ఉద్దేశం. పంట చేతికి వచ్చాక మార్కెట్లో ఉన్న ధరకు 15 నుంచి 20 శాతం అధికంగా చెల్లించి సీడ్స్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేపడుతారు. నారాయణఖేడ్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. విత్తనోత్పత్తి చేసేందుకు రైతులు కూడా ఉత్సహం కనబరుస్తున్నారు. సోయ ఉత్పత్తితో రాష్ట్రంలో విత్తనాల కొరత తీరనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన విత్తనాలు రాష్ట్రంలోని రైతులకు సరఫరా చేసే అవకాశం ఖేడ్ రైతులకు దక్కింది.