ఖమ్మం నగరంలోని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు
ఖమ్మంవ్యవసాయం: తొలకరి పలకరించడంతో రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని నేలల స్వభావం, నీటి వనరుల ఆధారంగా పత్తి వైపు మొగ్గు చూపుతుంటారు. పంటల సాగు విస్తీర్ణం 5.50 లక్షల ఎకరాలు కాగా.. ఇందులో 2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తుంటారు. ఖమ్మం, మధిర, పాలేరు, వైరా వ్యవసాయ డివిజన్లలో అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తుంటారు. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్‌లో మాత్రం అతి తక్కువ విస్తీర్ణంలో పంట వేస్తారు. తొలకరిలో అనుకూలమైన వర్షం కురిసిన వెంటనే విత్తనాలు నాటుతారు. నల్ల రేగడి నేలల్లో వర్ష సూచన, రుతుపవనాల కదలికలను చూసి రైతులు పొడి దుక్కుల్లో పత్తి విత్తనాలను విత్తుతారు. ఇదే విధానాన్ని ఎర్ర నేలలు, ఇసుక నేలల్లో కూడా రైతులు పాటిస్తున్నారు. అయితే వర్షాలు ఆశించిన సమయానికి రాకపోతే అన్ని రకాల నేలల్లో విత్తనాలు మొలకెత్తవు. ఇలా రైతులు కొంతమేర నష్టపోతున్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్నప్పటికీ సీజన్‌కు ముందుగా పత్తిని వేయాలనే ఆతృతతో రైతులు విత్తనాలు విత్తుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం పొడి దుక్కుల్లో విత్తనాలు విత్తొద్దని, సరైన పదునులో మాత్రమే విత్తనాలను నాటాలని సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పెడచెవిన పెడుతూ నష్టపోతున్నారు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నం
సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పెద్ద వర్షం పడగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇది వ్యవసాయ పనులకు దోహదపడుతుంది. దాదాపు ప్రతి ఏటా జూన్ ఆరంభం నాటికి ఒకటి, రెండు వర్షాలు పడతాయి. అలాంటిది ఈ ఏడాది జూన్ అర్ధభాగం దాటిన తర్వాత వర్షం పడింది. పత్తి సాగు చేసే రైతులు జూన్ ఆరంభం నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. 17న వర్షం కురవడంతో రైతుల్లో పంటల సాగుకు ఆశలు చిగురించాయి. మంగళవారం జిల్లాలో సగటున 2.64 సెం.మీల వర్షపాతం నమోదైంది. కొణిజర్ల, వైరా, కామేపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దుక్కులు చేయడానికి ఈ వర్షం బాగా అనుకూలిస్తుంది. కొందరు రైతులు ఏకంగా ఈ వర్షానికే విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో పత్తి విత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
విత్తన దుకాణాలు కళకళ
పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు విత్తన దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. నగరంతోపాటు వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు, మధిర, బోనకల్, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో ఉన్న విత్తన దుకాణాల్లో పత్తి విత్తనాలను కొనుగోలు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో పత్తి సాగు చేసే 2.40 లక్షల ఎకరాలకు 5.72 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించి.. విత్తన కంపెనీలకు అనుమతులిచ్చింది. దీంతో వివిధ కంపెనీల యాజమాన్యాలు జిల్లాలో 5.22 లక్షల విత్తనాల ప్యాకెట్లను విక్రయాలకు సిద్ధంగా ఉంచాయి. సాగు విస్తీర్ణం పెరిగితే మరికొంత స్టాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లను రూ.730 చొప్పున విక్రయిస్తున్నారు.
అదునులో పత్తి విత్తేందుకు సమాయత్తం
ఒక వర్షంతో విత్తనాలు వేయకుండా మరోసారి దుక్కి చేసి.. అదునులో పత్తి విత్తనాలు నాటాలని రైతులు ఆలోచిస్తున్నారు. నేల రకాన్నిబట్టి సరైన పదునులో విత్తనాలను విత్తితే అవి మొలకెత్తుతాయి. సోమవారం కురిసిన వర్షంతో రైతులు దుక్కి దున్నించే పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి వచ్చే నైరుతి రుతుపవనాలతో వర్షం కురిస్తే వెంటనే పత్తి విత్తనాలు వేయాలని రైతులు భావిస్తున్నారు.
మరో వర్షం పడితే..
సోమవారం కురిసిన వర్షంతో విత్తనాలు కొనుగోలు చేశా. ఈ వర్షంతో మరోసారి దుక్కి దున్ని అంతా సిద్ధం చేస్తాం. మరో వర్షం పడగానే పాటు చేసి విత్తనాలు నాటుతాం. ఇప్పటికే పత్తి విత్తనాలు పెడితే బాగుండేది. ఈ ఏడాది ఆలస్యమవుతోంది. విత్తనాలు ఆలస్యంగా విత్తితే దిగుబడులు తగ్గుతాయి. – వీరన్న, ఎర్రగడ్డతండా, కారేపల్లి మండలం
అదునులో విత్తుకోవాలి..
రైతులు వర్షం పడింది కదా.. అని వెంటనే వేడి దుక్కుల్లో విత్తనాలు విత్తొద్దు. అలా విత్తడం ద్వారా సరైన పదును లేక విత్తనాలు మొలకెత్తవు. దీంతో రైతులు శ్రమ, ఖర్చుతో నష్టపోతారు. 60 నుంచి 70 మి.మీల వర్షం కురిసిన తర్వాత పత్తిని విత్తాలి. స్థానిక వ్యవసాయాధికారుల సలహాలతో పంటలు వేసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఆయా విత్తనాలకు సంబంధించిన బిల్లులు, రశీదులు డీలర్లు, దుకాణాల యజమానుల నుంచి తీసుకొని భద్రపరుచుకోవాలి. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment