ఏపీకి ‘స్కోచ్‌’ అవార్డుల పంట | National Skoch Award for AP State Seeds Development Corporation | Sakshi
Sakshi News home page

ఏపీకి ‘స్కోచ్‌’ అవార్డుల పంట

Published Thu, Jan 6 2022 7:39 PM | Last Updated on Fri, Jan 7 2022 9:34 AM

National Skoch Award for AP State Seeds Development Corporation - Sakshi

గ్రామీణాభివృద్ధికి లభించిన అవార్డు

సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌కు స్కోచ్‌ అవార్డుల పంట పండింది. స్కోచ్‌ గ్రూప్‌ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో గురువారం ప్రకటించిన అవార్డుల్లో అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్‌ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్‌ స్కోచ్‌ మెడల్స్‌ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్‌ గ్రూప్‌ ఎండీ గురుషరన్‌దంజల్‌ ఈ అవార్డులను ప్రకటించారు. 

సంక్షేమ పథకాలకు బంగారు స్కోచ్‌లు 
ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్‌ స్కోచ్‌లు వరించాయి. అదే విధంగా మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్‌ ఆంధ్రా’కు డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ కేటగిరిలో గోల్డ్‌ స్కోచ్‌ దక్కింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలనాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్‌ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది.

మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 70 ఆక్వా హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ను తీసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా పులివెందులలో ఆక్వాహబ్‌తో పాటు 100కు పైగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందిస్తోంది.

ఈ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్‌ స్కోచ్‌ అవార్డు దక్కింది. ఇక గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్‌ ఫోర్టిఫికేషన్‌) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్‌ స్కోచ్‌ వరించింది. 

ఐదు విభాగాల్లో సిల్వర్‌ మెడల్స్‌ 
డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్‌ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్‌ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్‌ యాప్‌తో పాటు పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్‌ యాప్‌కు సిల్వర్‌ స్కోచ్‌ అవార్డులు వరించాయి.

ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌)కు సిల్వర్‌ స్కోచ్‌ దక్కింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్‌ స్కోచ్‌ వరించింది. ఇక.. బయోవిలేజ్, నేచురల్‌ ఫార్మింగ్‌ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్‌ స్కోచ్‌ దక్కింది.

ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్‌ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఆర్‌ అమరేంద్రకుమార్, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. 

చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్‌ తీసుకో')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement