వైఎస్‌ జగన్‌: బ్రాండింగ్‌తో చేయూత | YS Jagan Review Meeting on Implementing 'YSR Asara and YSR Cheyutha' Schemes - Sakshi
Sakshi News home page

బ్రాండింగ్‌తో చేయూత

Published Thu, Oct 8 2020 3:02 AM | Last Updated on Thu, Oct 8 2020 11:49 AM

CM YS Jagan in review on implementation of YSR Aasara And YSR Cheyutha Schemes - Sakshi

వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి. లేదంటే విశ్వాసం కోల్పోతాం. కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, లేదా ఎవరైనా లంచం అడిగినా వెంటనే ఫోన్‌ చేసేందుకు వారికి ఒక నంబర్‌ ఇవ్వాలి. ఆ నంబర్‌ను షాపుల వద్ద ప్రదర్శించాలి. లబ్ధిదారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత కింద లబ్ధిదారులు కొత్తగా ఏర్పాటు చేస్తున్న షాపులకు ఒక బ్రాండింగ్‌ తీసుకురావడంతో పాటు వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిపుణుల సలహాలు తీసుకుని లబ్ధిదారులకు మేలు జాతి పశువులను పంపిణీ చేయాలని సూచించారు. స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించాలని ఆదేశించారు. చేయూత, ఆసరా పథకాల అమలుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథకాల అమలుపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి పెద్దిరెడ్డి, అధికారులు   

ఏది కొనాలన్నది లబ్ధిదారుల ఇష్టం
► వైఎస్సార్‌ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం కాబట్టి, ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి. స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలి.
► లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకుంటే భవిష్యత్తులో ఏ సమస్యా రాదు. ఏది కొనుగోలు చేయాలనే నిర్ణయం లబ్ధిదారులకే వదిలేయాలి.
► మేలు జాతి ఆవులు, గేదెలు మాత్రమే కొనుగోలు చేయాలి. నాణ్యతతో కూడిన నిర్వహణ ఎంతో ముఖ్యం. ఇందులో వెటర్నరీ నిపుణులను కూడా భాగస్వామ్యం చేయండి.  
 
అవినీతికి తావివ్వొద్దు
► లబ్ధిదారులకు మనం నేరుగా నగదు ఇస్తున్నాం. అందుకే ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు లేదు. ఈ పథకంలో ఆవు లేదా గేదె పొందిన వారికి ఆర్బీకేల ద్వారా పశు గ్రాసం కూడా పంపిణీ చేయాలి.
► పశువుల సేకరణ, దాణా, అవసరమైన మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్‌ సంస్థ కూడా పాలు పంచుకోవాలి. 
► లబ్ధిదారులకు ఇస్తున్న రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి. ఒక మగ మేక పోతు లేక గొర్రె పోతు తప్పనిసరిగా ఇవ్వాలి.
► ఏ మాంసానికి (మేక లేక గొర్రె) డిమాండ్‌ ఉందో తెలుసుకుని, వాటిని ఎక్కువగా సేకరించాలి. మేకలు, గొర్రెల సేకరణలో ఎస్‌ఓపీ పక్కాగా ఉండాలి.

 రెండు పథకాల్లో 13.03 లక్షల మంది మహిళలకు లబ్ధి
► వైఎస్సార్‌ చేయూత పథకంలో 21 లక్షల మంది లబ్ధిదారులకు రూ.3,937 కోట్లు, వైఎస్సార్‌ ఆసరా పథకంలో 87.74 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,792 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.  13.03 లక్షల మంది డ్వాక్రా మహిళలు రెండు పథకాల్లోనూ ప్రయోజనం పొందారని తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి.
► గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 33,486 ఔట్‌లెట్లు (కిరాణా దుకాణాలు) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8,836 ఏర్పాటయ్యాయి. ఈ నెలాఖరులోగా మిగిలినవి ఏర్పాటవుతాయి. ఆ తర్వాత వాటి సంఖ్య ఇంకా పెరుగుతుంది. 
► రాష్ట్రంలో రోజూ 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా ఉంది. 6,510 గ్రామాల్లో పాల సేకరణకు ఆర్బీకేల వద్ద అదనంగా గదులు నిర్మించాలని ప్రతిపాదించాం. తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలు సేకరించవచ్చు. 
► 6,510 గ్రామాల్లో 1,000 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. వచ్చే ఏడాది జూలై 31 నాటికి, బీఎంసీయూల ఏర్పాటు, పాల సేకరణ మొదలవుతుంది. 
► రాష్ట్రంలో 3.43 లక్షల గేదెలు, 2.20 లక్షల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. తొలి ఏడాది 40 వేల ఆవులు, 55 వేల గేదెలు, రెండో ఏడాది 1.80 లక్షల ఆవులు, 2.88 లక్షల గేదెలు కొనుగోలు చేయనున్నాం. 2.97 లక్షల మేకలు, గొర్రెలు సేకరించి పంపిణీ చేయనున్నాం.  
► ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement