ఖరీఫ్‌కు సమృద్ధిగా వంగడాలు | AP Government Has Taken Steps To No Shortage Of Seeds For Paddy Cultivation | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు సమృద్ధిగా వంగడాలు

Published Mon, Jun 29 2020 1:09 PM | Last Updated on Mon, Jun 29 2020 1:09 PM

AP Government Has Taken Steps To No Shortage Of Seeds For Paddy Cultivation - Sakshi

ఆకివీడు ప్రాంతంలో సిద్ధమైన ఖరీఫ్‌ నారుమళ్లు

‘సేద్య’మేవ జయతే అంటూ సర్కారు నినదిస్తోంది. కర్షక వీరుల అవసరాలు తీర్చేందుకు నేనున్నానంటూ ఉరకలేస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు ఎన్నో సేవలతోపాటు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే వరి విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నకిలీ విత్తనాల నుంచి అన్నదాతలను కాపాడేందుకు నాణ్య మైన విత్తనాలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది.  

ఆకివీడు: ఖరీఫ్‌ వరి సాగుకు విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే వంగడాలను ఏపీ సీడ్స్‌ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం పెరగనుంది. చెరకు సాగు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో వరి సాగు చేపట్టేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో సాధారణ ఖరీఫ్‌ వరి సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఈ సారి అదనంగా మరో 5 వేల హెక్టార్లలో సేద్యానికి రైతులు సిద్ధమవుతారని వ్యవసాయాధికారుల అంచనా. మొత్తం మీద 2.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు జరగనుంది. దీనికి 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. రైత్వారీగా  85 శాతం విత్తనాలను సమకూరుస్తుండగా, మరో 15 శాతం విత్తనాభివృద్ధి సంస్థలు, ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది.   

936 ఆర్‌బీకేల ద్వారా విత్తనాలు సరఫరా 
రైతులకు విశిష్ట సేవలందించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 936 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో ఇప్పటికే సుమారు 5,215 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు ఇండెంట్లు పెట్టారు. దీనిలో 3,092 క్వింటాళ్లు ఆయా కేంద్రాలకు సరఫరా చేయగా వాటిని రైతులకు రాయితీపై ఇప్పటికే అందించారు. మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభించగా, డెల్టా ప్రాంతంలో నారుమళ్లు సిద్ధమవుతున్నాయి.   

ఖరీఫ్‌ సాగు వంగడాలు ఇవే.. 
ఖరీఫ్‌లో సాగుకు అనుకూలమైన వంగడాలపై ఈ ఏడాది ప్రభుత్వం, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన వెరైటీలు సాగు చేస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు. దీనికనుగుణంగా రైతులు ఖరీఫ్‌లో ఎంటీయూ–1061,  1064, 1121,  7029(స్వర్ణ),  1121, 5204(బీపీటీ), 3291(సోనా మసూరి) వంగడాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ–1010, 1156, 1075, 1001, 20471 రకాలతోపాటు సంపద స్వర్ణ వంగడాన్ని సాగు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.   

సబ్సిడీ వర్తించని రైతులకూ విత్తనాలు.. 
సబ్సిడీ వర్తించని రైతులు కూడా ఆర్‌బీకేల నుంచి వరి విత్తనాలను కొనే అవకాశం ప్రభుత్వం కలి్పంచింది. పూర్తి ధరకు నాణ్యమైన విత్తనాలను కొనవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌బీకేల్లోని కియోస్‌్కల నుంచిగాని, గ్రామ వ్యవసాయ సహాయకుల నుంచిగానీ ఆర్డర్‌ చేసిన 48 గంటల్లో రైతు ఇళ్ల ముంగిటకే విత్తనాలు సరఫరా చేసేలా ఏపీ సీడ్స్‌ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విత్తనాలు ఆర్‌బీకేల నుంచే అందించి నకిలీ విత్తన వ్యాపారులకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

నాణ్యమైన పంట పండించండి 
రైతులకు నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్‌ ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నాం. విత్తనాల దగ్గర నుంచి పంట పండించే వరకూ ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది. నాణ్యమైన పంట పండించి ఇవ్వండి. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.   
 – పీవీఎల్‌ నర్శింహరాజు, వైఎస్సార్‌ సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి

విత్తనాలు బాగున్నాయి 
ప్రభుత్వం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల్ని అందజేసింది. విత్తు నాణ్యమైనదైతేనే దిగుబడి బాగుంటుంది. మంచి పంట పండించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉంది. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 
– సలాది నాగకళ్యాణ్, రైతు, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం 

అధికంగా విత్తనాల సరఫరా 
ఈ ఏడాది ఆర్‌బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం అందజేయడమే కాకుండా గతంలో కంటే అధికంగా విత్తనాలను çసబ్సిడీపై అందిస్తున్నాం.  5,215 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని రైతులు ఆర్బీకేలో రిజి్రస్టేషన్‌ చేయించుకున్నారు. దానిలో 3,092 క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేశాం. గతంలో 1000 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే రైతులు కొనేవారు.  
– ఎండీ గౌసియాబేగం, వ్యవసాయ సంచాలకులు, పశ్చిమగోదావరి    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement