rainfalls
-
ఎల్‌నినో ఉన్నా మంచి వానలే! భారత వాతావరణ శాఖ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత్‌లో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ‘ఎల్ నినో’ దాపురించే అవకాశాలు ఉన్నాసరే ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణస్థాయిలో కొనసాగి వ్యవసా య రంగానికి మేలుచేకూర్చనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం అంచనావేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ సోమవారం ప్రకటించిన మరుసటి రోజే వాతావరణ శాఖ మరోలా అంచనాలు వెల్లడించడం గమనార్హం. భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడింది. మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు 52 శాతం భూభాగం వర్షాధారం. దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం.. ఈ భూభాగంలో పండించే పంట నుంచే వస్తోంది. ఇది దేశ ఆహారభద్రతకు, ఆర్థిక సుస్థిరతకు కీలక భూమికగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనావేసి వ్యవసాయరంగానికి ఐఎండీ తీపికబురు మోసుకొచ్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కితే ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో రుతుపవన గాలులు బలహీనమై పొడిబారి వర్షాభావం తలెత్తుతుంది. సగటు వానలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా నైరుతి సీజన్లో దాదాపుగా సుదీర్ఘకాల సగటు అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్ర భూ శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు. సాధారణం, అంతకు ఎక్కువ వానలు పడేందుకు 67 శాతం ఆస్కారముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర అంచనావేశారు. ‘‘రెండో అర్ధభాగంపై ఏర్పడే ఎల్‌నినో ప్రభావం చూపొచ్చు. అంతమాత్రాన వర్షాభావం ఉంటుందని చెప్పలేం. ఎన్నోసార్లు ఎల్‌నినో వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైంది’’ అని ఆయన వివరించారు. -
ద్రవ్యోల్బణ కట్టడికి ఇవే కీలకమట?
న్యూఢిల్లీ: తగిన వర్షపాతంతో భారీ పంట దిగుబడులు, వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపు ద్వారానే తీవ్ర ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమని ఆర్థికవేత్తలు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై తదుపరి మరింత ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కేంద్రం కసరత్తు చేయాలని కూడా ఆయా వర్గాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 7.79 శాతం (95 నెలల గరిష్ట స్థాయి), 7.04 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో 15.88 శాతంగా నమోదయ్యింది. మే, జూన్ నెలల్లో ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును రెండు దఫాలుగా (0.4 శాతం, 0.5 శాతం) చొప్పున పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. ఈ రేటు మరో 80 బేసిస్ పాయింట్ల మేర ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఎకనమిస్ట్ విశ్రుత్ రాణా అభిప్రాయపడ్డారు. సరఫరాల సమస్య తొలిగితే ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్ రుంకీ మజుందార్ వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఎకానమీకి తీవ్ర సవాళ్లు పొంచిఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సునిల్ సిన్హా పేర్కొన్నారు. యుద్ధం ముగిస్తే, కమోడిటీ ధరల స్థిరత్వంపై కొంతమేర ఒక అభిప్రాయానికి రావచ్చని అన్నారు. చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా! అయితే ఇలా చేయండి! -
ఈసారి సంతృప్తికర వానలే!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలు వెల్లడించింది. రుతుపవనాల వర్షపాతం సాధారణం (96 శాతం నుంచి 104 శాతం మధ్య)గా ఉంటుందని ఐఎండీ తన తొలి దశ దీర్ఘ శ్రేణి అంచనా(ఎల్ఆర్ఎఫ్)లను వెల్లడించింది. తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ, కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం, కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నైరుతి రుతుపవనాల కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పరిమాణాత్మకంగా వర్షపాతం దీర్ఘ కాలిక సగటు (ఎల్పీఏ) 98 శాతంగా ఉంటుందని వివరించారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో తొలుత కేరళ దక్షిణ కొనను తాకి సెప్టెంబర్ నాటికి రాజస్థాన్ నుంచి తిరోగమనం చెందుతాయి. ప్రస్తుతం పసిఫిక్, హిందూ మహాసముద్రంలో పరిస్థితులు తటస్థంగా ఉన్నాయని, వీటి ఉపరితల ఉష్ణోగ్రతలు భారతదేశ వాతావరణ పరిస్థితులపై అధిక ప్రభావాన్ని చూపుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు మరింత సమయం పడుతుందన్నారు. ‘వర్షాకాలంలో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. వర్షాకాలంలో హిందూ మహాసముద్రం డైపోల్ ప్రతికూల పరిస్థితి అభివృద్ధి చెందడానికి తక్కువ సంభావ్యత ఉంది. అందువల్ల పరిస్థితులు ఈ సంవత్సరం సాధారణ వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది’అని ఆయన వివరించారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్రా మాట్లాడుతూ.. సానుకూల ఐవోడీ పరిస్థితులు సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షాన్నిచ్చే రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటాయని తెలిపారు. ఐఎండీ విశ్లేషణ ప్రకారం దేశంలో చాలావరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఐఎండీ 2021 మే చివరి వారంలో రెండో దశ దీర్ఘ శ్రేణి అంచనాలను వెల్లడించనుంది. చదవండి: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా: రాత్రి కరోనా.. తెల్లారే మృతి -
వానకు ముందే విత్తనం..!
సాధారణంగా తొలకరిలో మంచి వర్షం పడిన తర్వాత మెట్ట భూములను దుక్కి చేసి, మళ్లీ వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తుంటారు. అయితే, దుక్కి చేసిన తర్వాత విత్తనాలు వేయడానికి పదునయ్యే అంత వర్షం పడక పోతే..? ఆశతో రైతులు వరుణుడి రాక కోసం రోజులు, వారాలు, నెలలు ఎదురు చూడటం తప్ప చేయగలిగేదేమీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఇటువంటి విపత్కర దుర్భిక్ష పరిస్థితులే ఏర్పడ్డాయి.. అయినా, పొలాలన్నీ, రోజులన్నీ ఒకేలా ఉండవు. అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మక వర్షాధార జీవవైవిధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఒకటికి పది రకాల పచ్చని పంటలతో అలరారుతున్నాయి. తొలకరికి ముందే విత్తనాలు వేయటం వల్ల 70 రోజులుగా పంటలు అలరారుతున్నాయి. ఈ పొలాలు పచ్చని పంటలతో అలరారుతూంటే.. పరిసర పొలాలు మాత్రం ఖరీఫ్ సాగుకు వర్షం కోసం ఎదురుచూస్తూ బావురుమంటున్నాయి..! కరువు పరిస్థితులను అధిగమించాలంటే అనంతపురం తదితర కరువు ప్రాంత రైతులు వేరుశనగ లాంటి ఒకే పంట వేసే అలవాటుకు, రసాయనిక వ్యవసాయానికి పూర్తిగా స్వస్తిపలకడమే ఉత్తమం. ఒక ఎకరా పొలం ఉన్నా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల మిశ్రమ సాగుకు ఉపక్రమించడమే మేలని తాజా అనుభవాలు చాటిచెబుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతువులు, వర్షాలు గతితప్పడంతో పంటల సాగు సమయంలో కూడా మార్పు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ(జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిలో అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ఖరీఫ్ పంటల సాగు (ప్రీ మాన్సూన్ క్రాప్ సోయింగ్) చేపట్టారు. జెడ్బీఎన్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. టి.విజయకుమార్ సారథ్యంలో డీపీఎం వి.లక్ష్మానాయక్, టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా తొలకరికి ముందే సాగు సాగుతోంది. మే నెల లోనే విత్తనం.. అనంతపురం జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సాగు అనగానే జూన్ 15 నుంచి జూలై 31 వరకు పంటల సాగుకు సరైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఒక నెల ముందే మే నెల మూడో వారంలో వర్షాలు పడక ముందే విత్తనాలు వేసే ముందస్తు ముంగారు(ఖరీఫ్) సాగు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన తొమ్మిది క్లస్టర్ల పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక ఎకరా విస్తీర్ణంలో మే మూడో వారంలో 12 నుంచి 15 రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటలు కలిపి విత్తారు. భూమిని రైతుల నుంచి అధికారులు మూడేళ్ల కాలపరిమితితో దత్తత తీసుకుని ముందస్తు పంటలు వేశారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి, కుందుర్పి మండలం బండమీదపల్లి, వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి, రాప్తాడు మండలం మరూరు, అమడగూరు మండలం గాజులవారిపల్లి, సోమందేపల్లి మండలం గుడిపల్లి, మడకశిర మండలం నీలకంఠాపురం, అదే మండలం గుండుమల, కూడేరు మండలం జయపురం గ్రామాల్లో ముందస్తు ఖరీఫ్ పంటల సాగవుతున్నాయి. ఇందుకోసం ఒక్కో క్లస్టర్‌కు వ్యవసాయ/ఉద్యాన విద్యావంతులను నాచురల్ ఫార్మింగ్ ఫెలో(ఎన్ఎఫ్ఎఫ్)గా నియమించారు. ఈ ఫెలో తనకు కేటాయించిన క్లస్టర్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. ఒక ఎకరాలో పంటల వైవిధ్యంతో ముందస్తు ఖరీఫ్ సాగుతోపాటు 36 సెంట్లలో ప్రత్యేకంగా ఫైవ్ లేయర్(ఐదంచెల వ్యవసాయ) పద్ధతిలో ఆకుకూరల నుంచి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయిస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సాధించేలా పంటలు పండించి రైతులకు చూపాలన్నది లక్ష్యం. ఒక ఎకరాకు ఆవుపేడ, మూత్రం, బెల్లం, సున్నం, పప్పుదినుసుల పిండి, పుట్టమన్నుతో తయారు చేసిన 400 కిలోల ఘన జీవామృతం పొడిని పొలంలో వెదజల్లారు. మరుసటి రోజు ఒక ఎకరాకు 12 నుంచి 15 రకాల విత్తనాలు కలిపి 17 నుంచి 20 కిలోల వరకు పొలంలో వెదజల్లారు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలసంద, అనుములు, మినుములు, కంది, రెండు రకాల చిక్కుడు, నువ్వులు, ఆముదం తదితర విత్తనాలు కలిపి వెదజల్లారు. వానల్లేకపోయినా.. విత్తే ముందు గోమూత్రం, బూడిద, ఇంగువతో తయారు చేసిన ‘బీజరక్ష’ ద్రావణంతో విత్తన శుద్ధి చేశారు. విత్తిన తర్వాత వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎకరాకు రెండు ట్రాక్టర్ల వరకు వెదజల్లి.. ఒక అంగుళం ఎత్తున మల్చింగ్(ఆచ్చాదన) చేశారు. ఒట్టి నేలల్లో విత్తనం వేసిన తర్వాత ఒకట్రెండు సార్లు తేలికపాటి తుంపర్లు పడ్డాయి. అనుకున్న విధంగా మొలకలు బాగానే వచ్చాయి. జూన్ మొదటి వారంలో ఒక మోస్తరు వర్షం పడింది. ఆ తర్వాత రెండు నెలల పాటు వాన చినుకే లేదు. అయినా, ముందస్తు ఖరీఫ్ పంటలు పచ్చగా ఏపుగా పెరుగుతున్నాయి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యలో గోమూత్రంతో తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పిచికారీ చేశారు. ఆగస్టు 11 నాటికి ఆముదం గెల వేయగా, జొన్న, మొక్కజొన్న, రాగి, కొర్ర కంకులు ఏర్పడి గింజ పట్టాయి. పెసర, అలసంద కాయలు వచ్చాయి. ఇతర పంటలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. సజ్జ లాంటి పంటలు ఐదారు పక్కకొమ్మలతో గుబురుగా ఆరోగ్యంగా ఉండటం విశేషం. వాటి నుంచి మరో ఐదారు కంకులు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి రూ. పది వేల పెట్టుబడి ఎకరానికి విత్తనాలకు రూ.1,500 వరకు ఖర్చయింది. వేరుశనగ పొట్టు, వరిపొట్టు లాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఆచ్చాదన కోసం ఎకరానికి రూ.4 వేల వరకు ఖర్చయింది. ఎకరానికి ఘన, ద్రవ జీవామృతం తయారీకి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ఖర్చయింది. దుక్కి, కూలీలతో కలిపి ఎకరాకు రూ.10 వేల లోపు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి అన్ని పంటల ద్వారా కనీసం రూ.25 వేలు విలువ చేసే దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. దీనితోపాటు, 36 సెంట్ల భూమిలో ఐదంచెల వ్యవసాయం చేపట్టారు. వివిధ ఎత్తుల్లో పెరిగే పండ్ల చెట్లు, 20–30 రకాల పంటలు కలిపి సాగు చేసేలా ప్రణాళిక తయారు చేశారు. రక్షణ కవచంగా మిత్రపురుగులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడంతోపాటు ఏకదళ, ద్విదళ పంటలు కలిపి సాగు చేస్తుండడంతో ఈ పొలాల్లో మిత్రపురుగులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్షింతల పురుగు, గొల్లబామ, సాలె పురుగులు, చీమలు, కందిరీగలు, తేనెటీగలు, పెంకు పురుగులు కనిపించాయి. ఇవి శత్రుపురుగుల దాడి నుంచి పంటలకు రక్షణ కల్పిస్తున్నాయి. ఘన, ద్రవజీవామృతం వాడటం వల్ల మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయి. గాలిలో ఉండేæ తేమను, నత్రజని సంగ్రహించి భూమికి అందిస్తున్నాయి. మట్టిలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతున్నదని, పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని జెడ్బీఎన్ఎఫ్ అధికారులు విశ్లేషిస్తున్నారు. క్రిమిసంహారక మందులు వాడక పోవడంతో తేనెటీగలు తుట్టెలు కడుతున్నాయి. పక్షల గూళ్లు అల్లుకోవడం కూడా కనిపించింది. ‘ముందస్తు ఖరీఫ్ కు విత్తనాలు వేస్తున్నప్పుడు కొందరు ఎగతాళి చేసినా మేం వెనుకడుగు వేయలేదు. ఇపుడు రైతులు ఆసక్తిగా ఈ పంటలు చూస్తున్నారు..’ అని జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం వి.లక్ష్మానాయక్ (8886614354), టెక్నికల్ ఏవో ఎల్.లక్ష్మానాయక్ సంతోషంగా చెబుతున్నారు. పంటలను పరిశీలిస్తున్న విజయకుమార్ తదితరులు ముందస్తు ఖరీఫ్ పంటల చుట్టూ ఖాళీ పొలాలే – రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ -
మరో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలతోపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ అల్పపీడనం కారణంగా రాయలసీమ మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలో పలు చోట్ల వర్షాలు నగరంలో శనివారం పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. మలక్‌పేట, చంపాపేట, చదర్ఘూట్, భవానీ నగర్ ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. గోల్కొండ ప్రాంతంలో 3 సెం.మీ, జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో 3.7సెం.మీగా వర్షాపాతం నమోదయింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ నగరంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసింది. -
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
హైదరాబాద్: పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అల్పపీడనం వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలను ఆనుకొని సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆవర్తనం మరింత బలపడి మరో 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడవచ్చునని తెలిపింది. -
భూగర్భ జలమట్టాల్లో భారీ పెరుగుదల
సాక్షి, సంగారెడ్డి: పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. రెండు నెలలుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు భారీ వృద్ధిని సాధించినట్లు భూగర్భ జల శాఖ తాజా పరిశీలనలో వెల్లడైంది. గత ఏడాది జూలైలో భూ ఉపరితలానికి 20.37 మీటర్లు దిగువన నమోదైన జిల్లా సగటు భూగర్భ జల మట్టం.. ఈ ఏడాది జూలై నాటికి 5.10 మీటర్ల మేర వృద్ధి సాధించింది. అదే విధంగా గత ఏడాది జూన్‌లో 23.79 మీటర్లు నమోదైన భూగర్భ జల మట్టం ఈ ఏడాది జూన్‌లో 19.53 మీటర్లకు ఎగబాకింది. ఈ సీజన్లో వర్షపాతం 18 మండలాల్లో సాధారణానికి మిం చిపోగా 20 మండలాల్లో సాధారణానికి చేరుకుంది. మిగలిన 13 మండలాల్లో వర్షపాతం ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోయినా.. ఎక్కడా వర్షభావం మాత్రం నెలకొనలేదు. వాగులు, వంకలపై నిర్మించిన చెక్ డ్యాంలు, వాటర్‌షెడ్ ట్యాంకులకు జలకళ వచ్చింది. భూగర్భ జలాల వృద్ధి చెందడంతో వ్యవసాయ బావులు నిండు కుండళ్లా కళకళలాడుతున్నాయి. మరికొన్ని చోట్లలో బావుల నుంచి నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి. ఉబికివస్తున్న జలాలు... మనూరు మండలం పసుపులపాడులో వ్యవసాయ బావి పొంగింది. ఆ గ్రామంలో భూ గర్భ జలాలు భూ ఉపరితలానికి 0.45 మీటర్లు లోతుకే లభ్యమవుతున్నాయి. రేగోడ్ మం డలం టి.లింగంపల్లిలో 0.80 మీటర్లు, వెల్దుర్తి మండలం కుకునూరులో 1.50 మీటర్లు, ఝరాసంఘంలో 4.20 మీటర్లు, పెద్ద శంకరంపేటలో 5.20 మీటర్లు, చిన్న శంకరంపేట మండలం గవ్వపేటలో 5.59 మీటర్లు, పాపన్నపేటలో 6.17 మీటర్లు, శివ్వంపేటలో 6.64 మీటర్లు, వర్గల్ మండలం మజీద్‌పల్లిలో 8.09 మీటర్లు, సిద్దిపేటలో 8.74 మీటర్లు దిగువన భూగర్భజలాల మట్టం నమోదైంది. భూ గర్భ జల మట్టాలు అత్యంత దిగువన నమోదైన ప్రాంతాలను పరిశీలిస్తే..గజ్వేల్‌లో 33.60 మీటర్లు, ములుగులో 32.60 మీటర్లు లోతున భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. విషమం నుంచి ఉపశమనం ఓ ప్రాంతంలో భూగర్భ జలాల లభ్యత, విని యోగం ఆధారంగా భూగర్భ జలాల పరిస్థితిని నిర్ధారిస్తారు. వినియోగం అధికమైతే ఆ ప్రాం తాలను అతి విషమం, విషమ పరిస్థితిలో ఉన్న ట్లు ప్రకటించి అక్కడ కొత్తగా బోరుబావుల తవ్వకాలపై నిషేధాన్ని అమలుచేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వి నీటిని తోడేస్తుండటంతో వేసవికాలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో పడిపోతున్నాయి. కురిసిన వర్షాల వల్ల ఇలాం టి ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాల స్థితి గతులు మెరుగయ్యాయి. మనూరు మండలం పసుపులపాడు, ఝరాసంఘం, పాపన్నపేట, తూప్రాన్ ప్రాంతాలు ఈ కోవకు వస్తాయి.