సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలు వెల్లడించింది. రుతుపవనాల వర్షపాతం సాధారణం (96 శాతం నుంచి 104 శాతం మధ్య)గా ఉంటుందని ఐఎండీ తన తొలి దశ దీర్ఘ శ్రేణి అంచనా(ఎల్‌ఆర్‌ఎఫ్)లను వెల్లడించింది. తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ, కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం, కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నైరుతి రుతుపవనాల కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పరిమాణాత్మకంగా వర్షపాతం దీర్ఘ కాలిక సగటు (ఎల్పీఏ) 98 శాతంగా ఉంటుందని వివరించారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో తొలుత కేరళ దక్షిణ కొనను తాకి సెప్టెంబర్ నాటికి రాజస్థాన్ నుంచి తిరోగమనం చెందుతాయి. ప్రస్తుతం పసిఫిక్, హిందూ మహాసముద్రంలో పరిస్థితులు తటస్థంగా ఉన్నాయని, వీటి ఉపరితల ఉష్ణోగ్రతలు భారతదేశ వాతావరణ పరిస్థితులపై అధిక ప్రభావాన్ని చూపుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు మరింత సమయం పడుతుందన్నారు.
‘వర్షాకాలంలో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. వర్షాకాలంలో హిందూ మహాసముద్రం డైపోల్ ప్రతికూల పరిస్థితి అభివృద్ధి చెందడానికి తక్కువ సంభావ్యత ఉంది. అందువల్ల పరిస్థితులు ఈ సంవత్సరం సాధారణ వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది’అని ఆయన వివరించారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్రా మాట్లాడుతూ.. సానుకూల ఐవోడీ పరిస్థితులు సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షాన్నిచ్చే రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటాయని తెలిపారు. ఐఎండీ విశ్లేషణ ప్రకారం దేశంలో చాలావరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఐఎండీ 2021 మే చివరి వారంలో రెండో దశ దీర్ఘ శ్రేణి అంచనాలను వెల్లడించనుంది.
చదవండి: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా: రాత్రి కరోనా.. తెల్లారే మృతి
Comments
Please login to add a commentAdd a comment