Monsoon rains
-
రెండురోజుల్లో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: మయన్మార్ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు వాయవ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీర ప్రాంతాల వరకు, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ అంతర్భాగంగా తూర్పు–పడమర ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ఫలితంగా రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ఇది కూడా చదవండి: టమాటా రైతుకు బాసట.. -
Viral Video: వర్షంలో ఆదమరచి డాన్స్ చేసిన ప్రేమజంట
భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది. A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C — Aisha Bhat (@aishabhat02) July 29, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
హైదరాబాద్‌లో ఈ ఏరియాలకు అలర్ట్
హైదరాబాద్: రెడ్ అలర్ట్‌కు కొనసాగింపుగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే.. ఆఫీసులు, కంపెనీలు సైతం నిర్ణీత సమయాల్లో బంద్ కావడం మంచిదని.. రైతులూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది Hyderabad Rains వాతావరణ శాఖ. ఈ క్రమంలో జోన్ల వారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. నగరంలో.. చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్పల్లి జోన్‌కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిచోట్ల 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో నాలల కెపాసిటీ 2 నుంచి 3 సెం.మీ. వర్షాన్ని తట్టుకునేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో.. అంచనాకి తగట్లు గనుక వాన పడితే.. రోడ్లపైకి భారీగా వరద చేరుకునే ఛాన్స్ ఉంది. మోస్తరు వాన పడింది.. సోమవారంతో పోలిస్తే.. మంగళవారం వరుణుడు కాస్త శాంతించాడు. నగరంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. ఒక చోట మోస్తరు వాన పడగా, మరోచోట భారీగా కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ., టోలిచౌకిలో 19.8 మి.మీ. వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్) వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 10 మి.మీ.లోపే పడింది. ఇలా జరగొచ్చు.. జాగ్రత్త! భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. రేపు ఇలా.. ఐదు జోన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. ఇక.. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని వెల్లడించింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వర్షాలపై నగర పౌరులకు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా అలర్ట్ సందేశాలు అధికారులు పంపుతున్న సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణ: అంతటా కుండపోత.. అతిభారీ వర్షాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో కుండపోత వాన కురుస్తోంది. చెరువులు, వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీ నుంచి అతిభారీవర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రాత్రి వీచిన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో చెట్టు, కరెంట్‌పోల్ పడిపోయాయి. అయితే ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. Rains lash Telangana #Hyderabadrains!! Get ready hyderabad city for some intense spell of rains rains wrst north zone of city for next 1 hour☔ pic.twitter.com/HeQgACIrys — Telangana state Weatherman (@ts_weather) July 20, 2023 ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌లో భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరస్థాయిలో వాగులు ప్రవహిస్తున్నాయి. కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యాయి. మెదక్ వెల్దుర్తిలో 15 సెం.మీలు, దామరంచలో 13 సెం.మీ. రాజపల్లిలో 12 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరి రాజాపేట మండలం పరిధిలో ఏకంగా 17 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. నిలిచిపోయిన రాకపోకలు జయశంకర్ భూపాలపల్లి సహా భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో 16వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వెలుతుర్లపల్లి వద్ద ఉధృతంగా మొరంచవాగు ప్రవహిస్తోంది. ధర్మారావుపేట, అప్పయ్యపల్లి, కొండాపురం, గనపురంల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద తాత్కాలిక మట్టిరోడ్డు తెగిపోయింది. దీంతో పెద్దపల్లి-భూపాలపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ వెంకటాపురంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గోదావరికి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో.. భద్రాచలం వద్ద 39 అడుగులకు చేరింది నీరు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. -
హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన!
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాగల 24 గంటల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం ఉదయం నుంచి నగరంపై ముసురు అలుముకుంది. క్రమంగా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది. మరికొన్ని గంటల్లో ఇది భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు సూచన చేస్తోంది జీహెచ్ఎంసీ. ☁️ మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని.. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తోంది. ☁️ ఇక తెలంగాణ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది. 18వ తేదీన వాయువ్య బంగాళాఖాతం లో తుఫాను సర్కులేషన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ☁️ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉత్తర ఒడిశా గంగా పశ్చిమ బెంగాల్ తీరాలలో దాని ఆనుకొని ఉన్నఒడిశా గంగాపశ్చిమ బెంగాల్ ,జార్ఖండ్ లపై అల్ప పీడనం ప్రభావం కనిపిస్తోంది. అసోసియేటెడ్ సైక్లోనిక్ సర్కులేషన్ నైరుతి వైపు వంగి ట్రోపోస్పిరికల్ విస్తరించి ఉంది. ☁️ రానున్న మూడు(నాలుగు) రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ అయ్యింది. ☁️ కొమరం భీమ్ ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ,వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోనీ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: వందేభారత్‌కు మంటలు.. తప్పిన ప్రమాదం -
Monsoon Rains: వాన జ్ఞాపకం.. తడిసిన బడిగంట
ఎండాకాలం సెలవులు ఫిక్స్డ్. వానాకాలం సెలవులు అలా కాదు. వానదేవుడి మూడ్‌ని బట్టి ఉంటాయి. రెండు రోజులు దంచి కొడితే మూడోరోజు సెలవు. తెల్లారి కుమ్మరిస్తే మధ్యాహ్నం సెలవు. రాత్రంతా ఉరుములు మెరుపులు ఉంటే ఉదయానికి సెలవు. వానదేవుడు నిజంగా పిల్లల ఫ్రెండు. ‘రేయ్... ఎంజాయ్ చేయండ్రా’ అని అప్పుడప్పుడు స్కూల్‌కు మబ్బులతో తాళాలు వేస్తాడు. ఎవరూ అడుగు పెట్టకుండా వాన ధారలను కాపలా పెడతాడు. ముసురులో స్కూల్... బలే జ్ఞాపకం. చాలా మంది పిల్లల దగ్గర గొడుగులు ఉండవు. కొంచెం చినుకులు పడుతూ ఉంటే గొడుగు ఉన్న ఫ్రెండ్ పక్కన చేరడం, కింద ఉన్న నీళ్ల గుంతలను ఫుట్‌బాల్‌గా తన్నడం, స్లిప్పర్లు బురద ఎగరేస్తూ ఉంటే వెనుక షర్ట్ మీద, చెడ్డీ మీద డిజైన్లు వేసుకోవడం బాగుంటుంది. గొడుగు ఉన్నా పక్కకు జరిగి తల తడుపుకుంటారు కొందరు. తడిసి లేతగా ఒణకడం, పళ్లు కటకటలాడించడం, చేతులు రెండూ కలిపి పిడికిలి బిగించి గుండెల దగ్గర పెట్టుకోవడం బాగుంటుంది. మనం తడవొచ్చుగాని పుస్తకాలు... సవాలే లేదు. షర్ట్ కిందకు తీసుకోవాల్సిందే. మంచి ప్లాస్టిక్ కవర్లో చుట్టి నెత్తి మీద పెట్టుకుంటే అదే గొడుగు. కొన్ని క్లాస్‌రూమ్‌లు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎంత పెద్ద వాన కురిసినా ఉరవవు. కొన్ని పోనీలే పాపం అనుకుంటాయి. కాస్త జల్లుకే చుక్కలు కార్చి బల్లలన్నీ తడిపేస్తాయి. అప్పుడు ఉరవని క్లాస్‌రూమ్‌లోకి ఉరిసే క్లాస్‌లోని పిల్లలను తోలుతారు. ఈ టీచర్ ఆ టీచర్ కబుర్లలో పడతారు. ఈ పిల్లలకు ఆ పిల్లలకూ పండగే. ఒక్కో బెంచీలో ఇరుక్కుని కూచుని ఊరికూరికే నవ్వుకుంటూ నెట్టుకుంటూ కిటికీలో నుంచి వానను చూస్తూ లాంగ్ బెల్లు కోసం ఎదురు చూస్తూ ఉండటం బాగుంటుంది. ప్లే గ్రౌండ్లో నీళ్లు చేరుతాయి. ఓల్డ్ స్టూడెంట్స్ నాటిన గుల్మొహర్ చెట్లు పూర్తిగా తడిసిపోతాయి. ఎప్పుడూ చక్కగా నడుచుకునే సార్లు మోకాళ్లు దాకా ప్యాంట్లు మడుచుకుని గమ్మత్తుగా కనిపిస్తారు. టీచర్లు తలల మీద పవిటను పరుచుకుంటారు. స్కూల్ అటెండర్ ఫ్లాస్క్ పట్టుకుని హెడ్మాస్టర్ కోసం టీ తేవడానికి పరిగెడుతూ ఉంటాడు. వాన ఆగుతుందా... ఆగదా... సెలవు ఇవ్వడమా వద్దా... అని హెడ్మాస్టర్ రూమ్‌లో ఆయనకు ఇష్టమైన సీనియర్ టీచర్లతో చర్చ ఉంటుంది. మధ్యాహ్నం స్కూల్ లేదంటే మేట్నీకి వెళ్లడం గురించి ఆలోచనలు వస్తాయి. ఏ ఫ్రెండ్ ఇంట్లో నలుగురూ కూడి ఏ ఆట ఆడవచ్చో ప్లానింగు ఉంటుంది. ఉప్పు సెనగలు, బటానీలకు పెద్దలు వద్దన్నా డబ్బు ఇస్తారు. కలిగిన కుటుంబాలలో ఆ సాయంత్రం వేసే ఉల్లిబజ్జీలు గుర్తుకు వస్తాయి. లేనివారికి బడి బయటి పిడితకింద పప్పే గతి. ఉండి ఉండి వాన పెరుగుతుంది. క్లాస్రూమ్లోఎక్కువ గోలో బయట వానది ఎక్కువ గోలో అర్థం కాకుండా ఉంటుంది. హెడ్మాస్టర్ గది బయట వేళ్లాడుతున్న గంట తడిసి తడిసి ‘ఇక చాల్లే లాంగ్ బెల్ కొట్టండి’ అంటుంది. టంగ్... టంగ్.. టంగ్... అని లాంగ్‌బెల్ వినపడగానే పిల్లలు బిలబిలమని క్లాస్రూమ్ బయటకు వస్తారు. గొడుగులు ఉన్నవాళ్లు తెరుస్తారు. కచ్చబోతోళ్లు ఎవరినీ పిలవకనే ఒక్కరే గొడుగులో వెళ్లిపోతారు. సైకిల్ మీద వెళ్లాల్సిన వాడు స్పీడ్‌గా తొక్కితే తక్కువ తడుస్తానని భ్రమపడతాడు. ప్లాస్టిక్ కవర్ని గాంధీ టోపీలా తగిలిస్తాడొకడు. పరీక్షల అట్ట ఒక గట్టి అడ్డం వానకు. తాటాకు పట్టుకుని పింఛం చేసుకుంటాడొకడు. ఆడపిల్లల ముఖాన పౌడరే మిగలదు. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. పాలు తాగెళ్లే దొంగపిల్లి ఈసారికి ఊరుకోండి అని వరండాలో ఒక మూల చేరుతుంది. వీధి కుక్క సొంతంత్రంగా గేటు తోసుకుని తడిలేని మట్టిలో వెచ్చగా పడుకుంటుంది. ఆ రాత్రి రొట్టెలు, పప్పూ రుచిగా ఉంటాయి. కిరోసిన్ దీపం రెడీ అవుతుంది. కరెంటు పోయినా వాన పోనంటూ కురుస్తూనే ఉంటుంది. తలుపులేసుకొని వెచ్చగా పడుకుంటే బోలెడు కబుర్లు నడుస్తాయి. మరుసటి ఉదయం బాగా నానిన వాల్‌పోస్టర్ ఊడబెరికి అట్టలు వేసుకోవచ్చన్న ఊహ ఉత్సాహాన్ని ఇస్తుంది. దూరంగా ధడేలున ఎక్కడో పిడుగుపడుతుంది. రేపు స్కూలు ఏ విధంగానూ ఉండదన్న సంతోషంతో నిద్ర భలేగా పడుతుంది. వానకు జేజే. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. -
కురిస్తే కుండపోతే..మారుతున్న రుతుపవన సరళి
సాక్షి, విశాఖపట్నం: కొన్నేళ్లుగా వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతోంది. దాని ప్రభావం రుతు పవనాలపై చూపుతోంది. అంతేకాదు.. వర్షపాతం, తేమ, గాలి దిశలపైనా ప్రభావం చూపిస్తోంది. వాయుగుండాలు, తుపానుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తక్కువ రోజుల్లోనే కుండపోత వర్షాలు కురవడం, గాలుల తీవ్రత పెరగడం వంటి అనూహ్య.. అసాధారణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది మే 14న పాకిస్తాన్‌లోని జకోబాబాద్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. భారత్ సహా పలు దేశాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు వీచాయి. మేఘాలయలోని చిరపుంజిలో ఈ నెల 17న 97 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. ఇది 122 ఏళ్ల చరిత్రలో మూడో అతి పెద్ద వర్షపాతంగా నమోదైంది. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క అధిక వర్షాలు కురుస్తూ వాతావరణంలో భారీ మార్పులను స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం మన దేశంలో రుతు పవనాలపైనా చూపుతూ వాటి సరళిలోను, గాలి దిశ మార్పునకు దోహదం చేస్తున్నాయి. భవిష్యత్‌లో భారీ వర్షాలే సాధారణంగా రుతు పవనాల సీజన్ మొత్తమ్మీద గాలుల దిశ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు నైరుతి రుతుపవనాల సీజన్లో నైరుతి నుంచి, ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయి. కానీ.. వీటి గమనంలోనూ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం నుంచి అనూహ్యంగా రుతు పవన గాలులు ఉధృతం కావడంతో అలలు ఎగసిపడుతూ తేమను సరఫరా చేయడం వల్ల భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలతో రుతు పవన వర్షపాతం 5 శాతం వరకు పెరుగుతోందని, ఫలితంగా రానున్న సంవత్సరాల్లో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న వాయుగుండాలు, అల్పపీడనాలు గతంలో నైరుతి రుతు పవనాల సీజన్లో (జూన్–సెప్టెంబర్) బంగాళాఖాతంలో 10నుంచి 12 వరకు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ.. అవి 3–4కి తగ్గిపోతున్నాయి. అయితే ఆకస్మికంగా ఏర్పడుతున్న అల్పపీడన/ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం అరుదైన పరిణామంగా చెబుతున్నారు. ఇక ఈశాన్య రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానుల సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ.. వాటి తీవ్రత మాత్రం పెరుగుతూ అధిక వర్షపాతం కురుస్తున్నట్టు, తుపాను గాలుల తీవ్రత పెరిగినట్టు నిపుణులు గుర్తించారు. ఇది ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతోంది. మరోవైపు ప్రీ–మాన్సూన్ సీజన్‌గా పిలిచే నైరుతి రుతు పవనాలకు ముందు కాలం (ఏప్రిల్–మే)లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో (థండర్ స్ట్రోమ్స్) అకాల వర్షాలు కురుస్తాయి. కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గినా వర్షం, గాలుల తీవ్రత మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించారు. వర్షం రోజులు తగ్గి.. ఉధృతి పెరిగి వాతావరణ మార్పుల ప్రభావం రుతు పవనాల సీజన్‌పై పడుతోందని ఇప్పటికే పలు క్లైమేట్ మోడల్స్ నిర్ధారించాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025, 2030, 2035 సంవత్సరాలకు రుతు పవనాల సీజన్లో వర్షం కురిసే రోజులు తగ్గుతాయి. కానీ.. వర్షాల ఉధృతి మాత్రం పెరుగుతుంది. తేమ, గాలుల వేగం కూడా పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్‌లో భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) లోతుగా అధ్యయనం చేస్తోంది. – ఓఎస్ఆర్యూ భానుకుమార్, పూర్వ అధిపతి, సముద్ర అధ్యయన విభాగం, ఆంధ్రా యూనివర్సిటీ -
కేరళలో ఆగని వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సైన్యం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్వాసితుల్ని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఆ శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు. మాసు్కలు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం 11 బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలను కొనసాగిస్తోంది. అన్ని విధాలా అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు కేరళ ఏ సాయం అడిగినా కేంద్రం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మేము కేరళలో పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి ఏ సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేరళలో సోమవారం నుంచి ప్రారంభించాలి్సన పాఠశాలల్ని 20వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయ సందర్శనకు రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. కేరళలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్‌లన్నీ పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
ముంబైని ముంచెత్తిన వర్షాలు
సాక్షి, ముంబై: భారీ వర్షాల ధాటికి ముంబై, ముంబై సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలిరోజే భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ముంబైలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షానికి ముంబైలో జనజీవనం స్తంభించింది. ముంబైలోని కుర్లా, బాంద్రా, తదితర ప్రాంతాలతోపాటు థానె, పాల్ఘర్, నవీముంబైసహా అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక ప్రాంతాలు జలాశయాలను తలపించాయి. రోడ్డు, రైలు మార్గాలు నదుల రూపందాల్చాయి. శాంటాక్రూజ్‌లో 164.8 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానె, పాల్ఘర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబై లైఫ్లైన్లుగా గుర్తింపుపొందిన ముంబై లోకల్ రైళ్లపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. 4 రోజులపాటు ఆరెంజ్ అలెర్ట్ ముంబై, పాల్ఘర్, థానె, రాయిగఢ్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ బుధవారం ఉదయం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ తర్వాత ముంబై సహా కొంకణ్ ప్రాంతంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ నాలుగురోజులపాటు అమల్లో ఉండేలా ఆరెండ్ అలర్ట్ సైతం ప్రకటించింది. (చదవండి: వరికి మద్దతు ధర రూ. 72 పెంపు) (చదవండి: BJP MP: మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమే!) -
ఈసారి సంతృప్తికర వానలే!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ద్వారా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలు వెల్లడించింది. రుతుపవనాల వర్షపాతం సాధారణం (96 శాతం నుంచి 104 శాతం మధ్య)గా ఉంటుందని ఐఎండీ తన తొలి దశ దీర్ఘ శ్రేణి అంచనా(ఎల్ఆర్ఎఫ్)లను వెల్లడించింది. తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ, కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్ని చోట్ల సాధారణ వర్షపాతం, కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఈ మేరకు భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నైరుతి రుతుపవనాల కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పరిమాణాత్మకంగా వర్షపాతం దీర్ఘ కాలిక సగటు (ఎల్పీఏ) 98 శాతంగా ఉంటుందని వివరించారు. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో తొలుత కేరళ దక్షిణ కొనను తాకి సెప్టెంబర్ నాటికి రాజస్థాన్ నుంచి తిరోగమనం చెందుతాయి. ప్రస్తుతం పసిఫిక్, హిందూ మహాసముద్రంలో పరిస్థితులు తటస్థంగా ఉన్నాయని, వీటి ఉపరితల ఉష్ణోగ్రతలు భారతదేశ వాతావరణ పరిస్థితులపై అధిక ప్రభావాన్ని చూపుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు మరింత సమయం పడుతుందన్నారు. ‘వర్షాకాలంలో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. వర్షాకాలంలో హిందూ మహాసముద్రం డైపోల్ ప్రతికూల పరిస్థితి అభివృద్ధి చెందడానికి తక్కువ సంభావ్యత ఉంది. అందువల్ల పరిస్థితులు ఈ సంవత్సరం సాధారణ వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది’అని ఆయన వివరించారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్రా మాట్లాడుతూ.. సానుకూల ఐవోడీ పరిస్థితులు సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షాన్నిచ్చే రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటాయని తెలిపారు. ఐఎండీ విశ్లేషణ ప్రకారం దేశంలో చాలావరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఐఎండీ 2021 మే చివరి వారంలో రెండో దశ దీర్ఘ శ్రేణి అంచనాలను వెల్లడించనుంది. చదవండి: సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా: రాత్రి కరోనా.. తెల్లారే మృతి -
ఎప్పుడు వచ్చాయని కాదు..
107 శాతం.. అవును.. నేలమ్మ పులకరించేలా, రైతుల్లో హర్షం నింపేలా, కరువు తీరిపోయేలా ఈ సీజన్లో వానలు కురిశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించాక మొదట్లో మొరాయించాయి. ఉత్తరాదిన కుంభవృష్టి కురిస్తే, దక్షిణాదిపై వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఆఖర్లో యావత్ భారతావనిపై వరుణుడు కరుణ చూపించాడు. సెప్టెంబర్ వచ్చాక దక్షిణాదిన కూడా వానలు దంచి కొట్టాయి. ‘‘సెప్టెంబర్ 26 నాటికి దేశవ్యాప్తంగా 107శాతం వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే చాలా ఎక్కువ‘అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేఎస్ హోసైకర్ ట్వీట్ చేశారు. 110శాతం కంటే ఎక్కువగా వర్షాలు కురిస్తే అప్పుడు అధిక వర్షపాతంగా చెబుతామని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో సగటు వర్షపాతం కంటే ఈ ఏడాది ఎక్కువగా వానలు కురిశాయి. సర్వసాధారణంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 30కల్లా దేశం విడిచి వెళ్లిపోతాయి. కానీ ఈసారి రుతుపవనాల తిరోగమనం అక్టోబర్ 6 తర్వాత ప్రారంభమై పదిహేను రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాఉండగా, అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో మూడు, నాలుగు రోజుల్లో గుజరాత్, బిహార్, బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
దేవుడు వరమిచ్చాడు..
సాక్షి, హైదరాబాద్: ఎగువన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగుతోంది. అంతకంతకూ వరద ఉధృతి పెరగడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2నెలలుగా నీటి రాకకై ఎదురుచూసిన శ్రీశైలం ప్రాజెక్టులోకి కరువుదీరా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఒక్కరోజే శ్రీశైలంలోకి 12టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా, శుక్రవారం అది మరింత పెరిగి 24గంటల్లో ప్రాజెక్టులోకి కొత్తగా 17 టీఎంసీల నీరొచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 60 టీఎంసీలను చేరగా, 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు)మేర ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలంలో పెరుగుతున్న నిల్వ: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద 2లక్షల క్యూసెక్కులకు ఏమాత్రం తగ్గడం లేదు. వర్షాలు కొనసాగుతుండటంతో ప్రవాహాలు ఉధృతంగా ఉన్నాయి. శుక్రవారం సైతం ఆల్మట్టిలోకి 2లక్షల క్యూసెక్కుల (18.18 టీఎంసీలు) మేర వరద రావడంతో.. 2.30లక్షల క్యూసెక్కుల (20.9టీఎంసీలు) మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆల్మట్టిలోకే 172టీఎంసీల మేర కొత్తనీరు వచ్చింది. ఆల్మటినుంచి భారీగా నీరు వస్తుండటంతో నారాయణపూర్ నుంచి దిగువకు 2.10లక్షల క్యూసెక్కుల (19టీఎంసీలు) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాలకు వరద ఉధృతి స్థిరంగా ఉంటోంది. శుక్రవారం సాయంత్రానికి జూరాలలోకి 2.05లక్షల క్యూసెక్కుల (18.62 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో 24 గేట్ల ద్వారా 2.08లక్షల క్యూసెక్కుల (18.63టీఎంసీలు) నీటిని నదిలోకి వదిలారు. మరో 5,800 క్యూసెక్కుల మేర నీటిని నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు జూరాల కుడి, ఎడమ కాల్వలకు వదులుతున్నారు. నదిలోకి వదిలిన నీరంతా శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1.98లక్షల క్యూసెక్కులు (18 టీఎంసీలు) మేర ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వలు అమాంతం పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ప్రాజెక్టులోకి 17టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. దీంతో నిల్వ 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 60 టీఎంసీలుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటం, స్థానిక పరివాహకంలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రవాహాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ విధమైన ప్రవాహాలే కొనసాగితే మరో మరో 10 రోజుల్లోనే శ్రీశైలం పూర్తిగా నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగనుంది. 10 టీఎంసీలకు ఎల్లంపల్లి ఇక గోదావరిలోనూ రోజురోజుకీ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం మేడిగడ్డ వద్ద 3.70లక్షల క్యూసెక్కుల (33.63టీఎంసీలు) మేర ప్రవాహాలు నమోదయ్యాయి. ఇక ఎల్లంపల్లికి సైతం స్థానిక పరివాహకం నుంచి 4,800 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 20టీఎంసీలకు గానూ 10టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలో సరిపడినంత నీటి నిల్వలు చేరడంతో కాళేశ్వరంలోని ప్యాకేజీలు–6,7,8ల ద్వారా నీటిని తరలించే ప్రక్రియకు ఇంజనీర్లు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ప్యాకేజీ–6,8 పంప్‌హౌస్‌ల్లో 7 మోటార్లకు 5 మోటార్లు సిధ్దంగా ఉండగా ప్యాకేజీ–7లో రెండు, మూడ్రోజుల్లో పూర్తి కానున్నాయి. 5వ తేదీ నాటికి ఎత్తిపోతలు మొదలు పెట్టాలని భావించినా.. ఒకట్రెండు రోజులు అటుఇటుగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు ఆరంభం కానుంది. -
ముసురేసింది..
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దయింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని చోట్ల పూర్తిగా ముసురు నెలకొని ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం దినమంతా కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో వర్షపునీరు భూమిలో ఇంకి భూగర్భ జలాలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ వర్గాలు అంటున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖా తం, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్త నం కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల కుండపోత నుంచి భారీ వర్షా లు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్‌లో 22సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే జిల్లా వెంకటాపురంలో 18సెంటీమీటర్లు, గోవిందరావుపేట, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలలో 14సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పరకాల, భద్రాచలంలో 12 సెంటీమీటర్లు, సత్తుపల్లి, బూర్గంపాడు, ఏటూరు నాగారం, మొగుళ్లపల్లిలలో 11సెంటీమీటర్లు, పినపాక, శాయంపేట, భూపాలపల్లిలలో 10సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పగటి రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. శుక్రవారం దినమంతా హైదరాబాద్‌లో వర్షం కురుస్తూనే ఉంది. సగటున 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో మాదాపూర్‌లో 3.9సెంటీమీటర్లు, మోండా మార్కెట్లో 2.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండ్రోజుల్లో 223% అధికం రుతుపవనాలు ఊపందుకోవడంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో సాధారణం కంటే ఏకంగా 223% వర్షం కురిసినట్లు అర్థగణాంకశాఖ వెల్లడించింది. ఈ రెండ్రోజుల్లో సాధారణంగా 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 40.4 మిల్లీమీటర్లు కురిసింది. గతేడాది ఇదే రెండ్రోజుల్లో 5.3 మిల్లీమీటర్లు కురిసింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా ఇది 662% అధికం. జూలై 24 నాటికి రాష్ట్రంలోని 589 మండలాలకుగాను 448 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో 83 మండలాల్లో కరువు ఛాయ లు నెలకొన్నాయ ని సర్కారు నివేదిక వెల్లడించిన పది రోజుల్లోపే పరిస్థితి మారడం గమనార్హం. . భద్రాచలం హై అలర్ట్ భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 42 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్ట్ 25 గేట్లను ఎత్తి 1,92,500 క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేస్తుండగా.. ఆ వరద నీరంతా గోదావరిలోనే కలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులు దాటే అవకాశం ఉంది. ఈ మార్క్ దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 4 మండలాల్లో భారీ వర్షం కురవగా.. 6 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. సత్తుపల్లి మండలంలో అత్యధికంగా 111.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుబల్లి 84.8, ఎర్రుపాలెం 77.8, సింగరేణి మండలంలో 68.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాలమూరులో వర్షానందం ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం రాత్రి నుంచి ముసురు వర్షం కురుస్తోంది. అత్యధికంగా దేవరకద్రలో 56.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉండవెల్లిలో 29మిల్లీమీటర్లు, గద్వాలలో 28.7మిల్లీమీటర్లు, అలంపూర్‌లో 27.7మిల్లీమీటర్లు, రాజోళిలో 24.5మిల్లీమీటర్లు, గట్టులో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. స్తంభించిన జనజీవనం కొమురం భీం జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. జిల్లాలో సిర్పూర్(టీ), కౌటాల, పెం చికల్ పేట, దహేగాం, బెజ్జూరులో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్–టీలో చింతకుం ట వాగు ఉధృతికి సమీపంలోని 8 గ్రామాల ప్రజల రవాణాకు అసౌకర్యం తలెత్తింది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దహే గాం మండలంలో పలు గ్రామాలు, బెజ్జూరు లో ప్రాణహిత సరిహద్దు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అత్యధికంగా దహేగాం మండలంలో 83.04 మిల్లీమీటర్ల వర్షం పడింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో స్వర్ణ ప్రాజెక్ట్ నిండిపోయింది. కరీంనగర్లోనూ ముసురే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షంకురిసింది. ఇల్లంతకుంట మండలంలో 117.3 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 26 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి కూడా కొంత నీరు చేరడంతో.. రైతులు ఖరీఫ్ పనుల వేగం పెంచారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలోనూ దినమంతా తుంపరవాన పడుతూనే ఉంది. మూడేళ్ల తరువాత మూలవాగు, నక్కవాగు ప్రవహిస్తున్నాయి. జగిత్యాల జిల్లా్ల లో శుక్రవారం 731.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా రాయికల్ మండలంలో 79.2మి.మీ, అత్యల్పంగా కొడిమ్యాలలో 21.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌లో పొంగి పొర్లుతున్న వాగులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం(కె) మండ ల పరిధి గంగారం గ్రామ సమీప పాలెం ప్రాజెక్టు ప్రధాన కాల్వకు రెండోసారి గండి పడింది. బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జగ్గన్నగూడెం–అంకన్నగూడెం మధ్య ఒర్రె ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిచి పోయా యి. ఏటూరు నాగారం మండలంలో పలు వాగులు పొంగి పొర్లాయి. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం వెంగ్లాపూర్–ప్రాజెక్టు నగర్ మధ్య కల్వర్టుపై నుంచి వరద వెళ్తుండడంతో వెంగ్లాపూర్, గొనేపల్లి, నార్లాపూర్, ఎల్బాక, పడిగాపూర్, మేడారం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్నదాతలో ఆనందం ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో పంటలకు ప్రాణం పోసినట్లయిందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడ చూసినా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కనిపించారు. మెదక్ జిల్లా కొల్చారం, టేక్మాల్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, అక్కన్నపేట, హుస్నాబాద్, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, రామచంద్రాపురం, సంగారెడ్డి పట్టణాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లానూ ముసురు పట్టుకుంది. రెండ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. నాలుగున అల్పపీడనం రుతుపవనాలు ఊపందుకోవడంతో శని, ఆదివారాల్లోనూ చాలాచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో ఈ నెల నాలుగో తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఐదారు తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
రెండు నెలలు సాధారణ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ సీజన్లో మిగిలిన రెండు నెలలు ఆగస్టు, సెప్టెంబర్లలో రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. జూలై చివరి నాటికి బిహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా సమాన స్థాయిలో వర్షపాతం నమోదైందని పేర్కొంది. వచ్చే రెండు నెలలు ఇదే విధమైన ఆశాజనక పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. ‘ఆగస్టులో దీర్ఘకాల సగటు(ఎల్పీఏ) 9 శాతం అటుఇటుగా 96 శాతంగా నమోదుకావచ్చు. జూన్‌లో వేసిన అంచనాల కన్నా అధికంగానే ఉండొచ్చు. రుతుపవనాల రెండో అర్ధభాగంలో దేశవ్యాప్తంగా 95 శాతం ఎల్పీఏ(అటుఇటుగా 8 శాతం)తో వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ ప్రకటించింది. వర్షపాతం 96–104 శాతం ఎల్పీఏ మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ రుతుపవనాలుగా భావిస్తారు. ఎల్పీఏ 90–96 శాతం మధ్య ఉంటే, దాన్ని సాధారణం కన్నా తక్కువ వర్షపాతంగా పరిగణిస్తారు. -
శ్రీలంకను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
-
అండమాన్‌కు తొలకరి
-
అండమాన్‌కు తొలకరి
► మూడ్రోజుల ముందుగానే రుతుపవనాలు ► జూన్ 1న లేదా అంతకన్నా ముందే కేరళను తాకే అవకాశం ► అదేనెల 5వ తేదీకల్లా తెలంగాణలోకి.. సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్‌ను తాకాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసినదాని కన్నా మూడ్రోజుల ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా అండమాన్‌కు మే 20–21 తేదీల్లో రుతుపవనాలు వస్తుంటాయి. గతేడాది మే 18న తాకాయి. ఈసారి మే 17న రావొచ్చని ఐఎండీ అంచనా వేసినా 14నే రావడం గమనార్హం. రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన రోజు నుంచి సీజన్ ప్రారంభమైనట్లు భావిస్తారు. అండమాన్‌కు ముందుగా వచ్చినంత మాత్రాన కేరళకు కూడా అలాగే వస్తాయని చెప్పలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ముందుగానే..? సాధారణంగా రాష్ట్రంలోకి జూన్ 10న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కేరళకు ఒకవేళ ముందస్తుగానే వస్తే.. జూన్ నాలుగైదు తేదీల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని, వారం అయ్యాక సరిగ్గా అంచనా వేయొచ్చని పేర్కొంటున్నారు. తాజాగా రుతుపవనాలు తాకడంతో వాయువ్య దిశ నుంచి అండమాన్ వైపు గాలులు వీస్తాయి. దీని ప్రభావం వల్ల మన రాష్ట్రంలోకి వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. అలాగే అక్కడక్కడ జల్లులు కురిసే కూడా అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత అంతగా లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు కురిసిన అకాల వర్షాలు ఉష్ణోగ్రతల ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పడ్డాయి. ఇక నుంచి కురిసే వర్షాలను రుతుపవనాల కారణంగా కురిసే ముందస్తు వర్షాలుగా పరిగణిస్తారు. ఈసారి ఆశాజనకమే.. గతేడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నా కీలకమైన జూలై, ఆగస్టులో పెద్దగా వర్షాలు కురవలేదు. జూన్, సెప్టెంబర్ నెలల్లో భారీగా కురిశాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలే గత రబీని నిలబెట్టింది. ఈసారి గతేడాది కంటే కాస్తంత తక్కువగానే వర్షాలు కురవొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నా.. రైతుకు ఆశాజనకంగానే ఉంటాయన్న అంచనా ఉంది. మండిన రామగుండం.. 45 డిగ్రీలు రాష్ట్రంలో ఆదివారం ఎండలు మండిపోయాయి. రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండల్లో 44.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 44, మెదక్, హన్మకొండల్లో 43, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేటలో 40 డిగ్రీలు నమోదైంది.