అండమాన్‌కు తొలకరి
► మూడ్రోజుల ముందుగానే రుతుపవనాలు
► జూన్ 1న లేదా అంతకన్నా ముందే కేరళను తాకే అవకాశం
► అదేనెల 5వ తేదీకల్లా తెలంగాణలోకి..
సాక్షి, హైదరాబాద్:
నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్‌ను తాకాయి. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసినదాని కన్నా మూడ్రోజుల ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా అండమాన్‌కు మే 20–21 తేదీల్లో రుతుపవనాలు వస్తుంటాయి. గతేడాది మే 18న తాకాయి. ఈసారి మే 17న రావొచ్చని ఐఎండీ అంచనా వేసినా 14నే రావడం గమనార్హం. రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన రోజు నుంచి సీజన్ ప్రారంభమైనట్లు భావిస్తారు. అండమాన్‌కు ముందుగా వచ్చినంత మాత్రాన కేరళకు కూడా అలాగే వస్తాయని చెప్పలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి ముందుగానే..?
సాధారణంగా రాష్ట్రంలోకి జూన్ 10న రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి కేరళకు ఒకవేళ ముందస్తుగానే వస్తే.. జూన్ నాలుగైదు తేదీల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే ఎలాంటి స్పష్టత ఇవ్వలేమని, వారం అయ్యాక సరిగ్గా అంచనా వేయొచ్చని పేర్కొంటున్నారు. తాజాగా రుతుపవనాలు తాకడంతో వాయువ్య దిశ నుంచి అండమాన్ వైపు గాలులు వీస్తాయి. దీని ప్రభావం వల్ల మన రాష్ట్రంలోకి వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది. దీంతో నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. అలాగే అక్కడక్కడ జల్లులు కురిసే కూడా అవకాశముంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత అంతగా లేదని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు కురిసిన అకాల వర్షాలు ఉష్ణోగ్రతల ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల పడ్డాయి. ఇక నుంచి కురిసే వర్షాలను రుతుపవనాల కారణంగా కురిసే ముందస్తు వర్షాలుగా పరిగణిస్తారు.
ఈసారి ఆశాజనకమే..
గతేడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నా కీలకమైన జూలై, ఆగస్టులో పెద్దగా వర్షాలు కురవలేదు. జూన్, సెప్టెంబర్ నెలల్లో భారీగా కురిశాయి. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలే గత రబీని నిలబెట్టింది. ఈసారి గతేడాది కంటే కాస్తంత తక్కువగానే వర్షాలు కురవొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నా.. రైతుకు ఆశాజనకంగానే ఉంటాయన్న అంచనా ఉంది.
మండిన రామగుండం.. 45 డిగ్రీలు
రాష్ట్రంలో ఆదివారం ఎండలు మండిపోయాయి. రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండల్లో 44.5 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 44, మెదక్, హన్మకొండల్లో 43, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేటలో 40 డిగ్రీలు నమోదైంది.