Monsoon Rains: Rain Holidays For Educational Institutions - Sakshi
Sakshi News home page

Monsoon Rains: వాన జ్ఞాపకం.. తడిసిన బడిగంట

Published Tue, Jul 12 2022 12:25 AM | Last Updated on Wed, Jul 13 2022 5:17 PM

Monsoon Rains: Rain Holidays for Educational Institutions - Sakshi

ఎండాకాలం సెలవులు ఫిక్స్‌డ్‌.
వానాకాలం సెలవులు అలా కాదు.
వానదేవుడి మూడ్‌ని బట్టి ఉంటాయి.
రెండు రోజులు దంచి కొడితే మూడోరోజు సెలవు.
తెల్లారి కుమ్మరిస్తే మధ్యాహ్నం సెలవు.
రాత్రంతా ఉరుములు మెరుపులు ఉంటే ఉదయానికి సెలవు.
వానదేవుడు నిజంగా పిల్లల ఫ్రెండు.
‘రేయ్‌... ఎంజాయ్‌ చేయండ్రా’ అని అప్పుడప్పుడు స్కూల్‌కు మబ్బులతో తాళాలు వేస్తాడు.  
ఎవరూ అడుగు పెట్టకుండా వాన ధారలను కాపలా పెడతాడు.
ముసురులో స్కూల్‌... బలే జ్ఞాపకం.


చాలా మంది పిల్లల దగ్గర గొడుగులు ఉండవు. కొంచెం చినుకులు పడుతూ ఉంటే గొడుగు ఉన్న ఫ్రెండ్‌ పక్కన చేరడం, కింద ఉన్న నీళ్ల గుంతలను ఫుట్‌బాల్‌గా తన్నడం, స్లిప్పర్లు బురద ఎగరేస్తూ ఉంటే వెనుక షర్ట్‌ మీద, చెడ్డీ మీద డిజైన్లు వేసుకోవడం బాగుంటుంది. గొడుగు ఉన్నా పక్కకు జరిగి తల తడుపుకుంటారు కొందరు. తడిసి లేతగా ఒణకడం, పళ్లు కటకటలాడించడం, చేతులు రెండూ కలిపి పిడికిలి బిగించి గుండెల దగ్గర పెట్టుకోవడం బాగుంటుంది. మనం తడవొచ్చుగాని పుస్తకాలు... సవాలే లేదు. షర్ట్‌ కిందకు తీసుకోవాల్సిందే. మంచి ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి నెత్తి మీద పెట్టుకుంటే అదే గొడుగు.

కొన్ని క్లాస్‌రూమ్‌లు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎంత పెద్ద వాన కురిసినా ఉరవవు. కొన్ని పోనీలే పాపం అనుకుంటాయి. కాస్త జల్లుకే చుక్కలు కార్చి బల్లలన్నీ తడిపేస్తాయి. అప్పుడు ఉరవని క్లాస్‌రూమ్‌లోకి ఉరిసే క్లాస్‌లోని పిల్లలను తోలుతారు. ఈ టీచర్‌ ఆ టీచర్‌ కబుర్లలో పడతారు. ఈ పిల్లలకు ఆ పిల్లలకూ పండగే. ఒక్కో బెంచీలో ఇరుక్కుని కూచుని ఊరికూరికే నవ్వుకుంటూ నెట్టుకుంటూ కిటికీలో నుంచి వానను చూస్తూ లాంగ్‌ బెల్లు కోసం ఎదురు చూస్తూ ఉండటం బాగుంటుంది.

ప్లే గ్రౌండ్‌లో నీళ్లు చేరుతాయి. ఓల్డ్‌ స్టూడెంట్స్‌ నాటిన గుల్‌మొహర్‌ చెట్లు పూర్తిగా తడిసిపోతాయి. ఎప్పుడూ చక్కగా నడుచుకునే సార్లు మోకాళ్లు దాకా ప్యాంట్లు మడుచుకుని గమ్మత్తుగా కనిపిస్తారు. టీచర్లు తలల మీద పవిటను పరుచుకుంటారు. స్కూల్‌ అటెండర్‌ ఫ్లాస్క్‌ పట్టుకుని హెడ్మాస్టర్‌ కోసం టీ తేవడానికి పరిగెడుతూ ఉంటాడు. వాన ఆగుతుందా... ఆగదా... సెలవు ఇవ్వడమా వద్దా... అని హెడ్మాస్టర్‌ రూమ్‌లో ఆయనకు ఇష్టమైన సీనియర్‌ టీచర్లతో చర్చ ఉంటుంది.

మధ్యాహ్నం స్కూల్‌ లేదంటే మేట్నీకి వెళ్లడం గురించి ఆలోచనలు వస్తాయి. ఏ ఫ్రెండ్‌ ఇంట్లో నలుగురూ కూడి ఏ ఆట ఆడవచ్చో ప్లానింగు ఉంటుంది. ఉప్పు సెనగలు, బటానీలకు పెద్దలు వద్దన్నా డబ్బు ఇస్తారు. కలిగిన కుటుంబాలలో ఆ సాయంత్రం వేసే ఉల్లిబజ్జీలు గుర్తుకు వస్తాయి. లేనివారికి బడి బయటి పిడితకింద పప్పే గతి.

ఉండి ఉండి వాన పెరుగుతుంది. క్లాస్‌రూమ్‌లోఎక్కువ గోలో బయట వానది ఎక్కువ గోలో అర్థం కాకుండా ఉంటుంది. హెడ్మాస్టర్‌ గది బయట వేళ్లాడుతున్న గంట తడిసి తడిసి ‘ఇక చాల్లే లాంగ్‌ బెల్‌ కొట్టండి’ అంటుంది. టంగ్‌... టంగ్‌.. టంగ్‌... అని లాంగ్‌బెల్‌ వినపడగానే పిల్లలు బిలబిలమని క్లాస్‌రూమ్‌ బయటకు వస్తారు. గొడుగులు ఉన్నవాళ్లు తెరుస్తారు. కచ్చబోతోళ్లు ఎవరినీ పిలవకనే ఒక్కరే గొడుగులో వెళ్లిపోతారు. సైకిల్‌ మీద వెళ్లాల్సిన వాడు స్పీడ్‌గా తొక్కితే తక్కువ తడుస్తానని భ్రమపడతాడు. ప్లాస్టిక్‌ కవర్‌ని గాంధీ టోపీలా తగిలిస్తాడొకడు. పరీక్షల అట్ట ఒక గట్టి అడ్డం వానకు. తాటాకు పట్టుకుని పింఛం చేసుకుంటాడొకడు. ఆడపిల్లల ముఖాన పౌడరే మిగలదు.

వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. పాలు తాగెళ్లే దొంగపిల్లి ఈసారికి ఊరుకోండి అని వరండాలో ఒక మూల చేరుతుంది. వీధి కుక్క సొంతంత్రంగా గేటు తోసుకుని తడిలేని మట్టిలో వెచ్చగా పడుకుంటుంది.

ఆ రాత్రి రొట్టెలు, పప్పూ రుచిగా ఉంటాయి. కిరోసిన్‌ దీపం రెడీ అవుతుంది. కరెంటు పోయినా వాన పోనంటూ కురుస్తూనే ఉంటుంది. తలుపులేసుకొని వెచ్చగా పడుకుంటే బోలెడు కబుర్లు నడుస్తాయి. మరుసటి ఉదయం బాగా నానిన వాల్‌పోస్టర్‌ ఊడబెరికి అట్టలు వేసుకోవచ్చన్న ఊహ ఉత్సాహాన్ని ఇస్తుంది.
దూరంగా ధడేలున ఎక్కడో పిడుగుపడుతుంది.

రేపు స్కూలు ఏ విధంగానూ ఉండదన్న సంతోషంతో నిద్ర భలేగా పడుతుంది.
వానకు జేజే.
 
వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement