schools bundh
-
Mumbai Rains: ముంబైను వీడని వర్షాలు.. రెడ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైను వర్ష భయం వీడటం లేదు. రెండు రోజుల నుంచి నగర వాసులను భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం ఆర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసన వర్షాలు ముంబై, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువులను తలపించింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.కాగా ముంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో ముంబైకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది.ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు . అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇదిలా ఉండగా సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. లోకల్ రైలు సేవలు, బస్సు సర్వీసులు, విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు సైతం విడిచింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు ముగిసిన ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది. మితిమీరిన కాలుష్యంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. గత నాలుగు రోజులు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో వాయు నాణ్యత సూచీలు క్రమేపీ క్షీణిస్తున్నాయి. సోమవారం వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 437కు చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మరోసారి సరి- బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పర్యావరణవాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. అంతకముందు వెల్లడించిన దాని ప్రకారం BS3 పెట్రోల్, BS4 డీసిల్ కార్లను నిషేధం సైతం కొనసాగుతుందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మంత్రి ఆదేశించారు. పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతులు మినహాయించి మిగతా అన్ని పాఠశాలలు నవంబర్ 10 వరకు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తమ అనుకూలతను బట్టి ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు. చదవండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు? -
ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) నివేదించింది. ► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి. ► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది. ► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి. ► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది. ► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది. -
Monsoon Rains: వాన జ్ఞాపకం.. తడిసిన బడిగంట
ఎండాకాలం సెలవులు ఫిక్స్డ్. వానాకాలం సెలవులు అలా కాదు. వానదేవుడి మూడ్‌ని బట్టి ఉంటాయి. రెండు రోజులు దంచి కొడితే మూడోరోజు సెలవు. తెల్లారి కుమ్మరిస్తే మధ్యాహ్నం సెలవు. రాత్రంతా ఉరుములు మెరుపులు ఉంటే ఉదయానికి సెలవు. వానదేవుడు నిజంగా పిల్లల ఫ్రెండు. ‘రేయ్... ఎంజాయ్ చేయండ్రా’ అని అప్పుడప్పుడు స్కూల్‌కు మబ్బులతో తాళాలు వేస్తాడు. ఎవరూ అడుగు పెట్టకుండా వాన ధారలను కాపలా పెడతాడు. ముసురులో స్కూల్... బలే జ్ఞాపకం. చాలా మంది పిల్లల దగ్గర గొడుగులు ఉండవు. కొంచెం చినుకులు పడుతూ ఉంటే గొడుగు ఉన్న ఫ్రెండ్ పక్కన చేరడం, కింద ఉన్న నీళ్ల గుంతలను ఫుట్‌బాల్‌గా తన్నడం, స్లిప్పర్లు బురద ఎగరేస్తూ ఉంటే వెనుక షర్ట్ మీద, చెడ్డీ మీద డిజైన్లు వేసుకోవడం బాగుంటుంది. గొడుగు ఉన్నా పక్కకు జరిగి తల తడుపుకుంటారు కొందరు. తడిసి లేతగా ఒణకడం, పళ్లు కటకటలాడించడం, చేతులు రెండూ కలిపి పిడికిలి బిగించి గుండెల దగ్గర పెట్టుకోవడం బాగుంటుంది. మనం తడవొచ్చుగాని పుస్తకాలు... సవాలే లేదు. షర్ట్ కిందకు తీసుకోవాల్సిందే. మంచి ప్లాస్టిక్ కవర్లో చుట్టి నెత్తి మీద పెట్టుకుంటే అదే గొడుగు. కొన్ని క్లాస్‌రూమ్‌లు స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఎంత పెద్ద వాన కురిసినా ఉరవవు. కొన్ని పోనీలే పాపం అనుకుంటాయి. కాస్త జల్లుకే చుక్కలు కార్చి బల్లలన్నీ తడిపేస్తాయి. అప్పుడు ఉరవని క్లాస్‌రూమ్‌లోకి ఉరిసే క్లాస్‌లోని పిల్లలను తోలుతారు. ఈ టీచర్ ఆ టీచర్ కబుర్లలో పడతారు. ఈ పిల్లలకు ఆ పిల్లలకూ పండగే. ఒక్కో బెంచీలో ఇరుక్కుని కూచుని ఊరికూరికే నవ్వుకుంటూ నెట్టుకుంటూ కిటికీలో నుంచి వానను చూస్తూ లాంగ్ బెల్లు కోసం ఎదురు చూస్తూ ఉండటం బాగుంటుంది. ప్లే గ్రౌండ్లో నీళ్లు చేరుతాయి. ఓల్డ్ స్టూడెంట్స్ నాటిన గుల్మొహర్ చెట్లు పూర్తిగా తడిసిపోతాయి. ఎప్పుడూ చక్కగా నడుచుకునే సార్లు మోకాళ్లు దాకా ప్యాంట్లు మడుచుకుని గమ్మత్తుగా కనిపిస్తారు. టీచర్లు తలల మీద పవిటను పరుచుకుంటారు. స్కూల్ అటెండర్ ఫ్లాస్క్ పట్టుకుని హెడ్మాస్టర్ కోసం టీ తేవడానికి పరిగెడుతూ ఉంటాడు. వాన ఆగుతుందా... ఆగదా... సెలవు ఇవ్వడమా వద్దా... అని హెడ్మాస్టర్ రూమ్‌లో ఆయనకు ఇష్టమైన సీనియర్ టీచర్లతో చర్చ ఉంటుంది. మధ్యాహ్నం స్కూల్ లేదంటే మేట్నీకి వెళ్లడం గురించి ఆలోచనలు వస్తాయి. ఏ ఫ్రెండ్ ఇంట్లో నలుగురూ కూడి ఏ ఆట ఆడవచ్చో ప్లానింగు ఉంటుంది. ఉప్పు సెనగలు, బటానీలకు పెద్దలు వద్దన్నా డబ్బు ఇస్తారు. కలిగిన కుటుంబాలలో ఆ సాయంత్రం వేసే ఉల్లిబజ్జీలు గుర్తుకు వస్తాయి. లేనివారికి బడి బయటి పిడితకింద పప్పే గతి. ఉండి ఉండి వాన పెరుగుతుంది. క్లాస్రూమ్లోఎక్కువ గోలో బయట వానది ఎక్కువ గోలో అర్థం కాకుండా ఉంటుంది. హెడ్మాస్టర్ గది బయట వేళ్లాడుతున్న గంట తడిసి తడిసి ‘ఇక చాల్లే లాంగ్ బెల్ కొట్టండి’ అంటుంది. టంగ్... టంగ్.. టంగ్... అని లాంగ్‌బెల్ వినపడగానే పిల్లలు బిలబిలమని క్లాస్రూమ్ బయటకు వస్తారు. గొడుగులు ఉన్నవాళ్లు తెరుస్తారు. కచ్చబోతోళ్లు ఎవరినీ పిలవకనే ఒక్కరే గొడుగులో వెళ్లిపోతారు. సైకిల్ మీద వెళ్లాల్సిన వాడు స్పీడ్‌గా తొక్కితే తక్కువ తడుస్తానని భ్రమపడతాడు. ప్లాస్టిక్ కవర్ని గాంధీ టోపీలా తగిలిస్తాడొకడు. పరీక్షల అట్ట ఒక గట్టి అడ్డం వానకు. తాటాకు పట్టుకుని పింఛం చేసుకుంటాడొకడు. ఆడపిల్లల ముఖాన పౌడరే మిగలదు. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. పాలు తాగెళ్లే దొంగపిల్లి ఈసారికి ఊరుకోండి అని వరండాలో ఒక మూల చేరుతుంది. వీధి కుక్క సొంతంత్రంగా గేటు తోసుకుని తడిలేని మట్టిలో వెచ్చగా పడుకుంటుంది. ఆ రాత్రి రొట్టెలు, పప్పూ రుచిగా ఉంటాయి. కిరోసిన్ దీపం రెడీ అవుతుంది. కరెంటు పోయినా వాన పోనంటూ కురుస్తూనే ఉంటుంది. తలుపులేసుకొని వెచ్చగా పడుకుంటే బోలెడు కబుర్లు నడుస్తాయి. మరుసటి ఉదయం బాగా నానిన వాల్‌పోస్టర్ ఊడబెరికి అట్టలు వేసుకోవచ్చన్న ఊహ ఉత్సాహాన్ని ఇస్తుంది. దూరంగా ధడేలున ఎక్కడో పిడుగుపడుతుంది. రేపు స్కూలు ఏ విధంగానూ ఉండదన్న సంతోషంతో నిద్ర భలేగా పడుతుంది. వానకు జేజే. వానకు ఆగే ఉద్దేశం ఉండదు. ఇల్లు చేరేసరికి అంతా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. అమ్మ కరెంటు పోతే ఇబ్బంది అని రాత్రి వంట తొందరగా ముగిద్దామని చూస్తుంది. నాన్న తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది. గాలి ఈలలు భయంగా, ఇష్టంగా అనిపిస్తాయి. ముంగిట్లో ఉన్న మల్లెతీగ అంత ఊగగలదని అస్సలు తెలియదు. పెరట్లో జామ పిందెలన్నీ తడిసి మెరుస్తుంటాయి. -
Sri Lanka economic crisis: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత
కొలంబో: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు. ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్ కంపెనీలు ఇష్టపడడం లేదు. నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు. చమురు కొరతతో గత నెలలో పట్టణ ప్రాంత స్కూళ్లు రెండు వారాలు మూతపడ్డాయి. -
Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత!
న్యూఢిల్లీ: కోవిడ్ పాజిటివ్ కేసులు లెక్కకు మించి పెరుగుతున్న కారణంగా దేశ రాజధానిలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ మంగళవారం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గడచిన ఆరునెలల్లో (జూన్ 9 నుంచి) నమోదైన కేసుల కంటే కేవలం ఒక్క రోజులోనే 331 కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వరుసగా రెండు రోజుల పాటు పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువ నమోదైతే లేదా ఏడు రోజుల వ్యవధిలో వరుసగా పాజిటివ్ కేసులు 1,500 దాటితే ‘ఎల్లో అలర్ట్' విధించే అవకాశం ఉందని తెల్పింది. ‘ఎల్లో అలర్ట్' దృష్ట్యా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. తాజా ఆంక్షలివే.. తాజా మార్గదర్శకాల మేరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు మూతపడనున్నాయి. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు యథాతథంగా కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్ సరి - బేసి ప్రాతిపదికన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి. స్పా, సెలూన్, బార్బర్ షాప్‌లు మామూలుగానే తెరచుకోవచ్చు. మెట్రో, పబ్లిక్ బస్సులు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో (ప్రయాణికులు నిలబడకూడదు) పనిచేస్తాయి. తదుపరి మార్గదర్శకాలు విడుదలయ్యేంతవరకు అన్ని పొలిటికల్, సామాజిక, మత పరమైన సమావేశాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. చదవండి: Pigcasso Artwork: కుంచె పట్టి రంగుల చిత్రాలు గీస్తున్న పంది! -
స్కూళ్లు త్వరగా తెరవండి.. లేదంటే ఈ సమస్యలు తప్పవు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో గత ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. బడికి వెళ్లి విద్యాబద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లే నేస్తాలయ్యాయి. ఆన్లైన్లోనే పాఠాలు వింటున్నారు. అయితే, ఇలాంటి పరిణామం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. విద్యార్థులను నాలుగు గోడలకే పరిమితం చేయొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలని, వారిలో మేధోవికాసానికి బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పి.సహస్రబుద్ధే నేతృత్వంలో విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తన నివేదికను శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే విపరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. కుటుంబాల సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంది. వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించింది. చిన్నారులు ఇళ్లకే పరిమితమై ఉంటే తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న సంబంధాలు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది. రెండు షిఫ్టుల్లో క్లాసులు పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది. స్కూళ్లలో తరచుగా తనిఖీలు విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు తరచుగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్–19 ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020 మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. -
గడ్డు స్థితిలో విద్యారంగం
అందరూ ఊహిస్తున్న ఉత్పాతమే ఇది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా ఇతర రంగాలన్నిటిలాగే విద్యారంగం కూడా కుప్పకూలింది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక దీన్ని ధ్రువీక రిస్తోంది. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా విద్యారంగం అస్తవ్యస్థం అయిందని ఆ నివే దిక చెబుతోంది. అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో బడులన్నీ మూతబడటం వల్ల వంద కోట్లమందికి పైగా విద్యార్థులు చదువులకు పూర్తిగా దూరమయ్యారని, మరో 4 కోట్లమంది పిల్లలకు ప్రీ స్కూల్ చదువులు లేనట్టేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో ఊహించుకోవచ్చు. నిరుడు డిసెంబర్ చివరిలో చైనాలోని వుహాన్‌లో తొలి సారి కరోనా జాడలు కనబడగా అనంతరం అది అన్నిచోట్లా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ వివిధ దేశాల్లో దాదాపు 2 కోట్లమంది జనం ఈ వైరస్ వాతబడ్డారు. మరణాల సంఖ్య 7 లక్షలు దాటిపోయింది. ఒక్క అమెరికాలోనే అరకోటిమంది కరోనా వ్యాధిగ్రస్తులున్నారు. లక్షా 61 వేలమంది అక్కడ మృత్యువాతబడ్డారు. మన దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మరణాలు 41,000పైమాటే. ఈ పరిస్థితుల్లో బడులు తెరవాలంటేనే అన్నిచోట్లా ప్రభుత్వాలు భయపడుతున్నాయి. తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయాలో పిల్లల వైద్యులు, విద్యావేత్తలు సూచనలు చేస్తూనేవున్నారు. ఇలా నిరవధికంగా బడులు మూతపడితే పిల్లల మానసిక స్థితిపై, వారి సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. కానీ తెరిస్తే వచ్చే సమస్యల మాటేమిటన్న ప్రశ్న ప్రతిచోటా ఉత్పన్నమవుతోంది. ఈ సందర్భంగా బ్రిటన్‌లోని పిల్లల వైద్యులు చేసిన హెచ్చరిక గమనించదగ్గది. బడులు తెరవడానికి బదులుగా ఆన్లైన్ విద్యను అందిస్తే సరిపోతుందన్న భావన సరికాదని వారంటున్నారు. విద్యాసంస్థలు యధావిధిగా పనిచేస్తే అల్పా దాయ వర్గాల పిల్లలకు తగిన పౌష్టికాహారం అందుబాటులో వుంటుందని, అవి మూతపడటం వల్ల అవసరమైన పోషకాహారానికి దూరమవుతారని, ఫలితంగా వారిలో అన్ని రకాల సామర్థ్యాలు దెబ్బ తింటాయని చెబుతున్నారు. మరో ప్రమాదం కూడా వుందంటున్నారు. పాఠశాలలు సక్రమంగా నడు స్తుంటే పిల్లలపట్ల ఇళ్లల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా అన్నది కనిపెట్టడం సులభమవు తుందని, లేనట్టయితే అది అసాధ్యమంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను గమనంలోకి తీసుకుని తైవాన్, నికరాగువా, స్వీడన్ వంటి 20 దేశాలు పాఠశాలలను తెరిచాయి. అందుకోసం కఠినమైన ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వీటిల్లో చాలా దేశాలు సమస్యలెదు ర్కొన్నాయి. విద్యాలయాలు తెరిచివుంచడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నామా అని ఆందోళనపడ్డాయి. బాగా చిన్న వయసు పిల్లల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా వుండటం, 18 ఆ పైబడి వయసున్న వారిలో ఎక్కువమంది దాని బారినపడటం గమనించామంటున్నారు. పాఠశాలలు తెరిస్తే సరిపోదు. అవి ప్రారంభమయ్యాక అడుగడుగునా సమస్యలెదురవుతాయి. తరగతి గదిలో పిల్లల్ని కూర్చోబెట్టడం మొదలుకొని వారు తిరిగి వెళ్లేవరకూ అడుగడుగునా ఆంక్షలు విధించవలసి వస్తుంది. కలిసి ఆడుకోవడం, భోజన విరామ సమయంలో కబుర్లు చెప్పుకుంటూ తినడం వంటివి కూడా ఆ బడుల్లో నిషేధించాల్సివచ్చింది. ఇవన్నీ సహజంగానే ఆ పిల్లల మానసిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. అదే జరిగితే పాఠశాలలు తెరిచిన ప్రయోజనమే దెబ్బతిం టుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకునే పకడ్బందీ చర్యలే పాఠశాలలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయి. పాఠశాలలు సాధ్యమైనంత త్వరగా తెరవాలని అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలుకొని చాలామంది చెబుతున్నారు. అయితే తెరవాలనే కోరిక వుంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా అధినేతలుగా వారేం చేశారో, చేస్తున్నారో గమనించుకోవాల్సిన అవసరం వుంది. కరోనా మహమ్మారిపై తొలినాళ్లలో హెచ్చరించినప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మాట చెప్పింది. దాన్ని అరికట్టడానికి విస్తృతంగా పరీక్షలు జరపడం ఒక్కటే మార్గమని, అందుకు దగ్గరి దారులు లేవని తెలిపింది. కానీ అన్ని దేశాల్లోనూ పాలకులు తేలిగ్గా తీసుకున్నారు. లాక్డౌన్ ఒక్కటే తారకమంత్రం అన్నట్టు వ్యవహరించారు. దానివల్ల ఫలితం పెద్దగా వుండదని తెలిశాక నిబంధనలు సడలించడం మొదలుపెట్టారు. కానీ అన్నిచోట్లా కేసులు ఉగ్రరూపం దాల్చాయి. అయినా ప్రభుత్వాలు తెలివితెచ్చుకున్న దాఖలా కనబడదు. కరోనా విషయంలో ఇంకా నిర్లక్ష్యంగానే వుంటున్నాయి. ప్రపంచంలో ఇప్పటికే వున్న అంతరాలను కరోనా మహమ్మారి మరిన్ని రెట్లు పెంచింది. విద్యా రంగంలో అది మరింత ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ 48 శాతం మందికి మాత్రమే అందుబాటులో వున్నదని, ఆఫ్రికా, ఆసియా దేశాలు ఈ విషయంలో బాగా వెనక బడివున్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇంకా లోతుకెళ్లి పరిశీలిస్తే ప్రాంతీయ, ఆర్థిక వ్యత్యా సాలు కూడా బయటపడతాయి. సారాంశంలో ఆన్లైన్ విద్య అల్పాదాయ వర్గాలను పూర్తిగా విద్యా రంగం నుంచి బయటకు నెడుతుందన్నది నిపుణుల అంచనా. విద్యారంగంపై ఇతోధికంగా ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. కరోనా కారణంగా ఆదాయాలు పడిపోయినా విద్యారంగంపై ఆ ప్రభావం కనబడనీయకుండా చూడటం ప్రభుత్వాల లక్ష్యం కావా లని ఐక్యరాజ్యసమితి నివేదిక హితవు చెబుతోంది. మన దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల కారణంగా 32 కోట్లమందికి పైగా పిల్లలు మార్చి నెలాఖరు మొదలుకొని ఇళ్లకే పరిమితం కావలసివస్తోంది. వీరిని తిరిగి బడిబాట పట్టించేందుకు అనువైన సురక్షితమైన పరిస్థితుల కోసం ప్రభుత్వాలు బహుముఖ కృషి చేయాల్సివుంటుంది. ఒక తరం మొత్తం పెను విపత్తులో పడిందని సమితి నివేదిక హెచ్చరిస్తున్న నేపథ్యంలో తమ విధానాలు మార్చుకోవాల్సివుంటుంది. -
తెలంగాణలో విద్యా సంస్థలు, మాల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన) కాగా తెలంగాణలో ఇప్పటికే రెండు కరోనా కేసులు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. గాంధీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య కేంద్రాల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల వద్దనే పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్టాలు సైతం పాఠశాలలు, మాల్స్ మూసివేశారు. ముంబైలో థియేటర్లు, మాల్స్ మూసివేత గోవాలో మార్చి 31వరకు విద్యాసంస్థలకు సెలవులు కర్ణాటకలో వారంపాటు మాల్స్, థియేటర్లు, స్కూల్స్, కాలేజీలు బంద్ బిహార్‌లో మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ ఢిల్లీలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత రాజస్థాన్‌లో ఈనెల 30 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ యూపీలో మార్చి 22 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్ హర్యానాలో మార్చి 31 వరకు విద్యాసంస్థలు మూసివేత కోల్‌కత్తాలో మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్ మూసివేత -
'23న పాఠశాలల బంద్'
చైతన్యపురి (హైదరాబాద్): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఈ నెల 23న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏబీవీపీ భాగ్యనగర్ శాఖ కార్యదర్శి. ఎల్బీనగర్ ఇంచార్జి పి.వెంకట్‌రెడ్డి ఆదివారం కొత్తపేటలోని అరబిందో డిగ్రీ కళాశాల ఆవరణతో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కేజీ టు పీజీ ఉచిత విద్యను వెంటనే అమలులోకి తేవాలని, విద్యార్థుల తల్లిదండ్రులనుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తోన్న కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలని కోరారు.