
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైను వర్ష భయం వీడటం లేదు. రెండు రోజుల నుంచి నగర వాసులను భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం ఆర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసన వర్షాలు ముంబై, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువులను తలపించింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
కాగా ముంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో ముంబైకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది.
ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు . అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఇదిలా ఉండగా సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. లోకల్ రైలు సేవలు, బస్సు సర్వీసులు, విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు సైతం విడిచింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు ముగిసిన ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.