గడ్డు స్థితిలో విద్యారంగం | education system faces crisis with corona in india | Sakshi
Sakshi News home page

గడ్డు స్థితిలో విద్యారంగం

Published Fri, Aug 7 2020 12:30 AM | Last Updated on Fri, Aug 7 2020 12:30 AM

education system faces crisis with corona in india - Sakshi

అందరూ ఊహిస్తున్న ఉత్పాతమే ఇది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా ఇతర రంగాలన్నిటిలాగే విద్యారంగం కూడా కుప్పకూలింది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక దీన్ని ధ్రువీక రిస్తోంది. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా విద్యారంగం అస్తవ్యస్థం అయిందని ఆ నివే దిక చెబుతోంది. అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో బడులన్నీ మూతబడటం వల్ల వంద కోట్లమందికి పైగా విద్యార్థులు చదువులకు పూర్తిగా దూరమయ్యారని, మరో 4 కోట్లమంది పిల్లలకు ప్రీ స్కూల్‌ చదువులు లేనట్టేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో ఊహించుకోవచ్చు. నిరుడు డిసెంబర్‌ చివరిలో చైనాలోని వుహాన్‌లో తొలి సారి కరోనా జాడలు కనబడగా అనంతరం అది అన్నిచోట్లా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ వివిధ దేశాల్లో దాదాపు 2 కోట్లమంది జనం ఈ వైరస్‌ వాతబడ్డారు. మరణాల సంఖ్య 7 లక్షలు దాటిపోయింది. ఒక్క అమెరికాలోనే అరకోటిమంది కరోనా వ్యాధిగ్రస్తులున్నారు. లక్షా 61 వేలమంది అక్కడ మృత్యువాతబడ్డారు. మన దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మరణాలు 41,000పైమాటే. ఈ పరిస్థితుల్లో బడులు తెరవాలంటేనే అన్నిచోట్లా ప్రభుత్వాలు భయపడుతున్నాయి.  తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయాలో పిల్లల వైద్యులు, విద్యావేత్తలు సూచనలు చేస్తూనేవున్నారు.

ఇలా నిరవధికంగా బడులు మూతపడితే పిల్లల మానసిక స్థితిపై, వారి సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. కానీ తెరిస్తే వచ్చే సమస్యల మాటేమిటన్న ప్రశ్న ప్రతిచోటా ఉత్పన్నమవుతోంది. ఈ సందర్భంగా బ్రిటన్‌లోని పిల్లల వైద్యులు చేసిన హెచ్చరిక గమనించదగ్గది. బడులు తెరవడానికి బదులుగా ఆన్‌లైన్‌ విద్యను అందిస్తే సరిపోతుందన్న భావన సరికాదని వారంటున్నారు. విద్యాసంస్థలు యధావిధిగా పనిచేస్తే అల్పా దాయ వర్గాల పిల్లలకు తగిన పౌష్టికాహారం అందుబాటులో వుంటుందని, అవి మూతపడటం వల్ల అవసరమైన పోషకాహారానికి దూరమవుతారని, ఫలితంగా వారిలో అన్ని రకాల సామర్థ్యాలు దెబ్బ తింటాయని చెబుతున్నారు. మరో ప్రమాదం కూడా వుందంటున్నారు. పాఠశాలలు సక్రమంగా నడు స్తుంటే పిల్లలపట్ల ఇళ్లల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా అన్నది కనిపెట్టడం సులభమవు తుందని, లేనట్టయితే అది అసాధ్యమంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను గమనంలోకి తీసుకుని తైవాన్, నికరాగువా, స్వీడన్‌ వంటి 20 దేశాలు పాఠశాలలను తెరిచాయి. అందుకోసం కఠినమైన ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వీటిల్లో చాలా దేశాలు సమస్యలెదు ర్కొన్నాయి. విద్యాలయాలు తెరిచివుంచడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నామా అని ఆందోళనపడ్డాయి. బాగా చిన్న వయసు పిల్లల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా వుండటం, 18 ఆ పైబడి వయసున్న వారిలో ఎక్కువమంది దాని బారినపడటం గమనించామంటున్నారు. 

పాఠశాలలు తెరిస్తే సరిపోదు. అవి ప్రారంభమయ్యాక అడుగడుగునా సమస్యలెదురవుతాయి. తరగతి గదిలో పిల్లల్ని కూర్చోబెట్టడం మొదలుకొని వారు తిరిగి వెళ్లేవరకూ అడుగడుగునా ఆంక్షలు విధించవలసి వస్తుంది. కలిసి ఆడుకోవడం, భోజన విరామ సమయంలో కబుర్లు చెప్పుకుంటూ తినడం వంటివి కూడా ఆ బడుల్లో నిషేధించాల్సివచ్చింది. ఇవన్నీ సహజంగానే ఆ పిల్లల మానసిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. అదే జరిగితే పాఠశాలలు తెరిచిన ప్రయోజనమే దెబ్బతిం టుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకునే పకడ్బందీ చర్యలే పాఠశాలలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయి. పాఠశాలలు సాధ్యమైనంత త్వరగా తెరవాలని అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలుకొని చాలామంది చెబుతున్నారు. అయితే తెరవాలనే కోరిక వుంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా అధినేతలుగా వారేం చేశారో, చేస్తున్నారో గమనించుకోవాల్సిన అవసరం వుంది. కరోనా మహమ్మారిపై తొలినాళ్లలో హెచ్చరించినప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మాట చెప్పింది. దాన్ని అరికట్టడానికి విస్తృతంగా పరీక్షలు జరపడం ఒక్కటే మార్గమని, అందుకు దగ్గరి దారులు లేవని తెలిపింది. కానీ అన్ని దేశాల్లోనూ పాలకులు తేలిగ్గా తీసుకున్నారు. లాక్‌డౌన్‌ ఒక్కటే తారకమంత్రం అన్నట్టు వ్యవహరించారు. దానివల్ల ఫలితం పెద్దగా వుండదని తెలిశాక నిబంధనలు సడలించడం మొదలుపెట్టారు. కానీ అన్నిచోట్లా కేసులు ఉగ్రరూపం దాల్చాయి. అయినా ప్రభుత్వాలు తెలివితెచ్చుకున్న దాఖలా కనబడదు. కరోనా విషయంలో ఇంకా నిర్లక్ష్యంగానే వుంటున్నాయి.

ప్రపంచంలో ఇప్పటికే వున్న అంతరాలను కరోనా మహమ్మారి మరిన్ని రెట్లు పెంచింది. విద్యా రంగంలో అది మరింత ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ 48 శాతం మందికి మాత్రమే అందుబాటులో వున్నదని, ఆఫ్రికా, ఆసియా దేశాలు ఈ విషయంలో బాగా వెనక బడివున్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇంకా లోతుకెళ్లి పరిశీలిస్తే ప్రాంతీయ, ఆర్థిక వ్యత్యా సాలు కూడా బయటపడతాయి. సారాంశంలో ఆన్‌లైన్‌ విద్య అల్పాదాయ వర్గాలను పూర్తిగా విద్యా రంగం నుంచి బయటకు నెడుతుందన్నది నిపుణుల అంచనా. విద్యారంగంపై ఇతోధికంగా ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. కరోనా కారణంగా ఆదాయాలు పడిపోయినా విద్యారంగంపై ఆ ప్రభావం కనబడనీయకుండా చూడటం ప్రభుత్వాల లక్ష్యం కావా లని ఐక్యరాజ్యసమితి నివేదిక హితవు చెబుతోంది. మన దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల కారణంగా 32 కోట్లమందికి పైగా పిల్లలు మార్చి నెలాఖరు మొదలుకొని ఇళ్లకే పరిమితం కావలసివస్తోంది. వీరిని తిరిగి బడిబాట పట్టించేందుకు అనువైన సురక్షితమైన పరిస్థితుల కోసం ప్రభుత్వాలు బహుముఖ కృషి చేయాల్సివుంటుంది. ఒక తరం మొత్తం పెను విపత్తులో పడిందని సమితి నివేదిక హెచ్చరిస్తున్న నేపథ్యంలో తమ విధానాలు మార్చుకోవాల్సివుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement