ఒక కాలేజీలో ఇలా..
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురిలో ఓ కార్పొరేట్ కాలేజీలో యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రత్యక్ష విద్యాబోధన ఫొటోలు ఇవీ. ఇక్కడ విద్యార్థులను కూర్చోబెట్టిన తీరు చూస్తుంటే భౌతికదూరం పాటిస్తున్నట్లు ఉందా? ఒక్కో విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలన్న నిబంధన అమలు అవుతున్నట్లు అనిపిస్తోందా? బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు, తరగతి గదిలో 20 మంది విద్యార్థులనే కూర్చొబెట్టి విద్యా బోధనను నిర్వహించాలన్న నిబంధనను తుంగలో తొక్కి సదరు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం తరగతులను నిర్వహిస్తోంది.
పట్టించుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇదొక్క కాలేజీనే కాదు రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు అన్నింటిలో ప్రత్యక్ష విద్యా బోధన ఇష్టారాజ్యంగా మారిపోయింది. అంతేకాదు ప్రత్యక్ష బోధన సాకుతో మొత్తం ఫీజుల వసూళ్లకు తల్లిదండ్రులపై ఒత్తిడిని తీవ్రం చేశాయి. దీంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు ఫీజులను చెల్లించక తప్పడం లేదు. మరోవైపు త్వరలోనే హాస్టళ్లను ప్రారంభిస్తున్నామని, ఇప్పుడే ఫీజులు చెల్లించి హాస్టళ్లలో విద్యార్థుల పేర్లు నమోదు చేయించుకోవాలని ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తుండటంతో తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పట్టించుకోని ఇంటర్ బోర్డు అధికారులు
పాఠశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు ఈనెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు వరంగా మారింది. ప్రత్యక్ష బోధన పేరుతో ఫీజుల వసూళ్లకు అవకాశం వచ్చేసింది. అందుకే కరోనా ప్రొటోకాల్‌కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు అసలేమాత్రం పట్టించుకోకుండా విద్యార్థులను పూర్తిస్థాయిలో విద్యాబోధనకు అనుమతిస్తున్నాయి. అదే సాకుతో మొత్తం ఫీజుల వసూళ్లకు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచాయి.
ఒకరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులను మరొక రోజు ద్వితీయ సంవత్సర విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష బోధనకు అనుమతించాలన్న బోర్డు నిబంధనలు తుంగలో తొక్కాయి. తరగతికి 20 మంది చొప్పున, బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. కాలేజీల్లో విద్యాబోధన ఎలా జరుగుతోందన్న దానిపై పర్యవేక్షణే లేదు. ఇలా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఇంటర్ బోర్డు అధికారులకు పట్టడం లేదు. యాజమాన్యాల నుంచి ముడుపులు పుచ్చుకొని ఇంటర్ బోర్డు క్షేత్రస్థాయి అధికారులు నిబంధనల అమలును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బెంచీకి ముగ్గురు.. కరోనా వ్యాపించదా?
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ విద్యా సంస్థల్లో ప్రత్యక్ష విద్యాబోధనను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని తుంగలో తొక్కి కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తరగతి గదుల్లో విద్యార్థులను గుంపులుగా కూర్చోబెట్టాయి. ఒక్కో బెంచీకి ముగ్గురు చొప్పున విద్యార్థులను కూర్చోబెట్టి, కనీస భౌతికదూరం పాటించుకుండా చేస్తున్నాయి. ఐదు క్లాసుల కోసం కనీసం ఐదు గంటల పాటు విద్యార్థులు తరగతి గదుల్లో ఇలా కిక్కిరిసి కూర్చోవాల్సి వస్తోంది. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే మిగతా విద్యార్థులకు వచ్చే ప్రమాదం నెలకొంది. ఇంత సమయం కలిసి ఉండటం మూలంగా వైరస్ వ్యాప్తికి అవకాశాలెక్కువ. అయినా ఈ విషయాన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు.
పరీక్ష ఫీజుతో లింకు...
ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు వార్షిక ఫీజును కట్టడానికి ప్రైవేటు కాలేజీలు అనుమతించడం లేదు. కాలేజీ ట్యూషన్ ఫీజును మొత్తం చెల్లిస్తేనే పరీక్ష ఫీజులు తీసుకుంటామని మెలికపెడుతున్నాయి. పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థుల జాబితాను ఇంటర్ బోర్డుకు పంపాల్సింది కాలేజీ యాజమాన్యాలే కాబట్టి దీన్ని అడ్డంపెట్టుకొని... ట్యూషన్ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి.
కాలేజీ హాస్టళ్లలో ఫీజుల దందా
ఫీజుల దందా ప్రస్తుతం రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా, అందులో కార్పొరేట్ కాలేజీలకు చెందినవే 700 పైగా ఉన్నాయి. వాటిల్లో కోవిడ్ నిబంధనలను పాటించకుండా యాజమాన్యాలు విద్యా బోధనను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆయా కార్పొరేట్ కాలేజీలకు చెందిన హాస్టళ్లే 587 వరకు కొనసాగుతున్నాయి. గతంలో వాటిల్లో 2.5 లక్షల మంది విద్యార్థులు చేరేవారు. గత ఏడాది ప్రథమ సంవత్సరంలో చేరిన వారిలో లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వారంతా ఇపుడు ద్వితీయ సంవత్సరంలో ఉండగా హాస్టళ్ల బాట పట్టేందుకు సిద్ధం అయ్యారు.
ఇదే అదునుగా యాజమాన్యాలు ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించేందుకు రిజిస్టర్ చేసుకోవాలని, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇపుడు రిజిస్టర్ చేసుకొని ఫీజు చెల్లించకపోతే తరువాత చేర్చుకోబోమంటూ ఫీజులు చెల్లించక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లను తెరవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేటు హాస్టళ్లను తెరవడానికి ఇంకా అనుమతించలేదు. అయినా హాస్టల్ వసతి పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment