శైశవగీతి! | Vardhelli Murali Article On Governments Neglect Of School Education | Sakshi
Sakshi News home page

శైశవగీతి!

Published Sun, Aug 8 2021 12:02 AM | Last Updated on Sun, Aug 8 2021 1:39 AM

Vardhelli Murali Article On Governments Neglect Of School Education - Sakshi

ఇదొక మహా చౌర్యం. అతి పెద్ద లూటీ. మనకు తెలిసిన మన చరిత్రలో ఇంత పెద్ద దోపిడీ ఎప్పుడూ జరగలేదు. కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్లమంది బాలలు ఏడాదిపాటు బడి చదువుకు దూరమయ్యారట. మన దేశంలో అయితే పదహారు నెలలు గడిచింది. ఇంకా బడులు తెరుచు కోలేదు. బడి అంటే కేవలం చదువే కాదు. బడి అంటే బాల వికాసం. బడి అంటే చైతన్యం. బడి అంటే బాలమిత్ర. నాగరిక సంఘ జీవనానికి పునాది వేసేది బడి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడైనా సరే, మనిషై పుట్టినప్పుడు బడికి వెళ్లకుండా ఉండలేదు. శ్రీరామావతారం దాల్చినప్పుడు కుల గురువు వశిష్టుని వద్దకు వెళ్లి, సకల విద్యలూ అభ్యసించాడు. శ్రీకృష్ణునిగా అవతరించినప్పుడు సాందీపుని గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. మనిషి నిండు నూరేళ్ల జీవితంలో బడికాలం పదేళ్లు మాత్రమే. విలువైన పదేళ్ల కాలంలోంచి ఒక యేడు జారి పోయింది. ఎనభై కోట్ల సంవత్సరాల అతివిలువైన బాల్యాన్ని ఎవరో మింగేశారు.

కరోనా ఒక మహావిపత్తు, ఒక మహమ్మారి. మన చేతుల్లో ఏమీ లేదు. ఔను. మార్కెట్లూ, మాల్స్‌ మన చేతుల్లో ఉన్నాయి. అవి కిటకిటలాడవచ్చును. పండుగలూ, పబ్బాలూ మన చేతు ల్లోనే ఉన్నాయి. అప్పుడు కోవిడ్‌ రూల్స్‌ను ఉల్లంఘిం చవచ్చును. గుళ్లూ, గోపురాలు, ప్రార్థనాలయాలు మన చేతు ల్లోనే ఉన్నాయి. అవి తెరుచుకోవచ్చు. తొక్కిసలాట కూడా జరుపుకోవచ్చు. రాజకీయ సభలు ‘లక్ష’ణంగా జరుపుకోవ చ్చును. తాను బీఎస్‌పీలో చేరబోయే నల్లగొండ సభ లక్షకు తగ్గేదే లేదని ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించవచ్చును. కాంగ్రెస్‌ పార్టీ పెట్టబోయే ఇంద్రవెల్లి సభకు ‘లెక్క పెరిగినా ఫరవాలేదు కానీ లక్షకు తగ్గకుండా చూసుకో షేర్‌ఖాన్‌’ అంటూ రేవంత్‌రెడ్డి సవాలు చేయవచ్చును. ముఖ్యమంత్రి సభలు జనంతో పోటెత్తవచ్చును. ఎన్నికల ప్రచారాలతో నిత్యం వేలాదిమంది దూలాడావచ్చును. ధూమ్‌ ధామ్‌ చేయవచ్చును. అన్నీ జరిగిపోతున్నాయి. అంతా నార్మల్‌గానే వుంది. సూర్యుడు, చంద్రుడు, బీట్‌ కానిస్టేబుల్‌తో సహా ఎవరి డ్యూటీ వాళ్లు చేస్తూనే ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు మరి బడి ఎందుకు లేక పాయే కరోనా?

ఎందుకంటే... భయం! దేశవ్యాప్తంగా పాలక శ్రేణుల్లో భయం. పాఠశాల విద్యపై మనం వేసిన శీతకన్ను బయట పడుతుందన్న భయం. మనం చూపిన నిర్లక్ష్యం కరోనా అద్దంలో బద్దలౌతుందన్న భయం. టాయిలెట్లు లేని, మంచినీరు దొరకని పరిశుభ్రత లేని బళ్లు తెరిస్తే కరోనా గుళ్లు తెరిచినట్లే అవు తుందన్న భయం. టీచర్లకూ, విద్యార్థులకూ వ్యాక్సినేషన్‌ కార్య క్రమాన్ని అమలుచేయలేమన్న భయం. నిత్యం విద్యార్థులకు పరీక్షలు చేస్తూ ప్రాంగణాలను శానిటైజ్‌ చేస్తూ బడులు నడప లేమన్న భయం. షట్టర్‌ మడిగెల్లో చింతపండు వ్యాపారం మాదిరిగా నడుపుకోవడానికి తాము అనుమతిచ్చిన ప్రైవేట్‌ స్కూళ్లలో కరోనా విస్ఫోటనం కావచ్చునన్న భయం. ఈ భయా లతో ఇంకెంతకాలం బాలల హక్కులను ఉల్లంఘిస్తారు? ఇంకెన్ని కోట్ల సంవత్సరాల బాల్యాన్ని హరిస్తారు?

బడికెళ్లి చదువుకోవడం బాలలకు చట్టబద్ధమైన హక్కు. బాలలకు ఇంకెన్నో సహజమైన హక్కులున్నాయి. ఇప్పటికే అవి అంతరించిపోతున్నాయి. వారిని మనం సూర్యకాంతిలో తిరగ నివ్వడం లేదు. చంద్రుని వెన్నెల్లో ఆడుకోనివ్వడంలేదు. కోతి కొమ్మచ్చి లేదు, బావుల్లో చెరువుల్లో ఈత సాహసం లేదు. చేలల్లో చెలకల్లో చెప్పుల్లేకుండా తిరగడం తెలియదు. అరికాళ్లను పల్లేరుకాయలు గిచ్చడం తెలియదు. బొంతపురుగు గిలిగింత పెట్టడం తెలియదు. నీరెండ వెలుతురులో నీరెండిన ఏటి ఇసుకలో ఆడుకోవడం తెలియదు. కదిలిపోయే మబ్బుల నీడలు ఇసుక మీద బొమ్మలు బొమ్మలుగా మారుతుంటే విప్పార్చి చూసిన అనుభవం ఉండదు. అవి ఆకాశంలో సీతమ్మవారు వేస్తున్న ముగ్గుల ప్రతిబింబాలే సుమా అనుకునే సృజనాత్మక ఆలోచన తట్టదు. ఇవన్నీ లేత వయసు అనుభవించవలసిన సహజ హక్కులు. వీటిని మనం నిషిద్ధ జాబితాలో చేర్పించాము. చట్టబద్ధంగా కల్పించిన హక్కులను కూడా బాలలకు ఇంకెంత కాలం దూరం చేస్తారు?

వర్చువల్‌ పేరుతో, దూరవిద్య పేరుతో, ఆన్‌లైన్‌ పేరుతో ప్రవేశపెట్టిన విద్యాపద్ధతులన్నీ విఫలమయ్యాయి. ఈ విధానా నికి ఉపాధ్యాయులే సన్నద్ధం కాలేదు. అనువైన సాంకేతిక వ్యవస్థ ఏర్పడలేదు. పేద విద్యార్థులు మరొకసారి వంచనకు గురయ్యారు. పేద, గ్రామీణ విద్యార్థులకు–పట్టణ, ధనిక విద్యా ర్థులకు మధ్యన అంతరం మరింత పెరిగింది. ఇంట్లో కంప్యూ టర్లు వై–ఫై సౌకర్యాలున్న విద్యార్థులకు కూడా పాఠాలు అంతంతమాత్రంగానే అర్థమయ్యాయి. పిల్లల చదువులకోసం తపించిపోయే మధ్యతరగతి తల్లిదండ్రులతో అప్పులు చేసి మొబైల్‌ ఫోన్లు కొనిపించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులైతే సిగ్నల్‌కోసం ఫోన్లు పట్టుకొని చెట్లెక్కడం, గుట్ట లెక్కడం వంటి చిత్రాలను పత్రికల్లో చూస్తున్నాము. ఫోన్‌ కూడా దొరకని విద్యార్థుల్లో చాలామంది చదువుకు చాప చుట్టేశారు. వీరిలో ఎందరు డ్రాపౌట్లుగా తేలుతారో చూడవలసి ఉన్నది. ఆన్‌లైన్‌ పాఠాల సంగతేమో గానీ మొబైల్‌ ఫోన్‌ ఒక వ్యసనంగా విద్యార్థుల్లో తయారైందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతు న్నారు. మొబైల్‌ ఫోన్లలో పాఠ్యేతర అంశాలపై పిల్లలు ఆసక్తిని పెంచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ విద్యపై ‘సాక్షి’ నెట్‌వర్క్‌ చేసిన సర్వేలో కూడా ఈ సంగతి వెల్లడైంది.

విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలను ఎలా అర్థం చేసుకుంటు న్నారు? బడులను వెంటనే తెరవాలని కోరుకుంటున్నారా అనే అంశాలను తెలుసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 500 మంది విద్యార్థులతో, వారి తల్లిదండ్రుల్లో ఒక రితో, వారి క్లాస్‌ టీచర్‌తో కూడా ‘సాక్షి’ బృందం మాట్లాడింది. మొత్తంగా 1,500 మంది అభిప్రాయాలను క్రోడీ కరించారు. స్కూళ్ల మూసివేత వలన విద్యార్థులు ఒంటరితనాన్ని ఫీలవుతున్నారని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల్లో 80 శాతం తల్లిదండ్రులు చెప్పారు. ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థుల తల్లిదం డ్రుల్లో కూడా ఈ అభిప్రాయం 70 శాతం మందిలో ఉన్నది. విద్యార్థి మానసిక ధోరణి, ప్రవర్తనలో కూడా మార్పులు కన బడుతున్నాయని దాదాపు ఇదే నిష్పత్తిలో తల్లిదండ్రులు సమా ధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 40 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ పాఠాలను విన్నారు. ప్రైవేట్‌ విద్యార్థులు 70 శాతం మంది హాజరయ్యామని చెప్పారు. రెండు తరగతుల విద్యార్థులు కూడా ఆ పాఠాలు తమకు అర్థం కాలేదనే చెప్పారు. 80 శాతం మంది ప్రభుత్వ విద్యార్థులు, 70 శాతం మంది ప్రైవేట్‌ విద్యార్థులు కూడా పాఠాలు అర్థం కాలేదని చెప్పారు. ఉపాధ్యాయులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పారు. సగానికంటే ఎక్కువమంది విద్యార్థులకు పాఠాలు అర్థమైనట్టే తమకు తోచిందని చెప్పారు. ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థుల్లో 40 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని మిస్సవు తున్నామని చెప్పారు. మొబైల్‌ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం ఒక దుర్వ్యసనంగా తయారైందని 60 శాతం ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు, 50 శాతం మంది ప్రైవేట్‌ విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇద్దరూ ఉద్యోగం చేసే తల్లి దండ్రులపై ఈ పరిణామం బాగానే ప్రభావం చూపింది. ఇంటివద్ద ఉండే పిల్లల్ని కనిపెట్టుకోవడానికి ప్రైవేట్‌ పిల్లల తల్లిదండ్రుల్లో 60 శాతం మంది ఎవరో ఒకరు పనికిపోవడం మానేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇది ఇరవై శాతంగా ఉన్నది. ప్రైవేట్‌ పిల్లల తల్లిదండ్రుల్లో 60 శాతం మంది మొబైల్‌ లేదా కంప్యూటర్‌ కొనడానికి అప్పు చేశారు. ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి ఇది 30 శాతం. స్కూళ్లను వెంటనే తెరవాలా వద్దా అనే కీలకమైన అంశంపై మాత్రం దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇక్కడ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల వ్యత్యాసం కన్పించలేదు. 86 శాతం తల్లిదండ్రులు, 82 శాతం విద్యార్థులు, 80 శాతం టీచర్లు వెంటనే తెరవాలని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వాల నాన్చివేత ధోరణికీ, ప్రజాభిప్రాయానికీ మధ్యన స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి థర్డ్‌వేవ్‌ బూచిని ముందుకు తెస్తున్నారు. ఆ తర్వాత ఫోర్త్‌ వేవ్‌ కూడా రాదన్న గ్యారంటీ ఏమున్నది? వేవ్‌లను ఎదుర్కొంటూనే స్కూళ్లను తెరవడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. దశాబ్దాలపాటు యుద్ధాల్లో మునిగితేలినప్పుడు కూడా వియత్నాం, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో జీవన వ్యాపారాలు ఆగలేదు. బడులు మూసివేయలేదు. ఇప్పుడు మన దేశంలో మాత్రం సమస్త వ్యాపారాలకూ, బార్లకు, షికార్లకు గేట్లెత్తి విద్యా రంగం గేట్లను మాత్రమే మూసివేయడం సమర్థనీయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విద్యాలయాలు తెరుచుకోవచ్చు నని సలహా ఇచ్చింది.

విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన విప్లవా త్మక సంస్కరణలు దేశానికిప్పుడు ఆదర్శం. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. మరో ఐదారు రాష్ట్రాలు కూడా ఈ నెలలో అదే బాటను అనుసరించబోతున్నాయి. విద్యారంగం రూపంలోనూ, సారంలోనూ (form and content) పూర్తి స్థాయి ప్రక్షాళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. శిథిలా వస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల సౌకర్యాలను కల్పించడానికి దాదాపు 16 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మూడో వంతు స్కూళ్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఏ బిడ్డ కూడా పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదని కొన్ని గొప్ప పథకాలను ఆయన అమలు చేస్తున్నారు. ‘అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక’ వంటి వరాల ఫలితంగా ఏ తల్లికీ బిడ్డ చదువు భారం కాని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) అనుగుణంగానే సృజనాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ విద్యావిధానాన్ని రూపొందించారు. ప్రతి తరగతిలో మాతృభాష తెలుగును ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రకటించారు. ప్రపంచస్థాయి పోటీల్లో నిలబడటం కోసం కింది స్థాయి నుంచే ఇంగ్లిష్‌ను బోధనా భాషగా అమలు చేయబో తున్నారు. 16 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం కోసం ఒక అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. అందులో పొందుపరచిన ‘కరిక్యులమ్‌’ ప్లాన్‌ను పరిశీలిస్తే మన పాఠశాల విద్యావ్యవస్థ మీద మళ్లీ విశ్వాసం కలుగుతున్నది. 

ఆటపాటలకు, సృజనాత్మకతకు ఈ సిలబస్‌లో చోటు కల్పించారు. పర్యావరణం ఒక ప్రాధాన్యాంశంగా ఉంటుంది. ఆరోగ్యం, కెరీర్‌లపై పాఠాలుంటాయి. గుమస్తాల తయారీకి బ్రిటిష్‌ వాళ్లు ప్రవేశపెట్టిన మెకాలే విద్యా విధానాన్ని చాలా కాలం అనుసరించాము. తర్వాత కాలంలో కార్పొరేట్‌ సంస్థల అవసరాల కోసమే ఇంజనీరింగ్‌ విద్యను సవరించుకున్నాము. ఫలితంగా సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు పుట్టాల్సిన చోట బీపీఓల్లో పనిచేస్తే ఇంజనీర్లు పుట్టుకొచ్చారు. ఇప్పటికైనా దిద్దు బాటుకు ఉపక్రమిద్దాం. రూపాన్నీ, సారాన్నీ సంస్కరించుకొని ప్రారంభించుకోబోతున్న పాఠశాలలను స్వాగతిద్దాము. పిల్లల గురించి ‘శైశవ గీతి’లో శ్రీశ్రీ చెప్పిన పంక్తుల్ని గుర్తుకు తెచ్చు కుందాము. ‘‘మీదే మీదే సమస్త విశ్వం! మీరే లోకపు భాగ్య విధాతలు! మీ హాసంలో మెరుగులు తీరును... వచ్చేనాళ్ల విభా ప్రభాతములు!’’ ఈ ప్రపంచాన్ని పెద్దలు మనకిచ్చారు. మనం పిల్లలకిచ్చేయాలి. ఇచ్చేద్దాం!


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement