న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది. మితిమీరిన కాలుష్యంతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. గత నాలుగు రోజులు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో వాయు నాణ్యత సూచీలు క్రమేపీ క్షీణిస్తున్నాయి. సోమవారం వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 437కు చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.
ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మరోసారి సరి- బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివర సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది.
ఈ మేరకు దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పర్యావరణవాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. అంతకముందు వెల్లడించిన దాని ప్రకారం BS3 పెట్రోల్, BS4 డీసిల్ కార్లను నిషేధం సైతం కొనసాగుతుందని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మంత్రి ఆదేశించారు. పాఠశాలలను కూడా మూసివేయాలని నిర్ణయించారు. 10, 12వ తరగతులు మినహాయించి మిగతా అన్ని పాఠశాలలు నవంబర్ 10 వరకు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తమ అనుకూలతను బట్టి ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు.
చదవండి: వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు?
Comments
Please login to add a commentAdd a comment