కొలంబో: శ్రీలంకలో సంక్షోభం మరింత ముదురుతోంది. చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు.
ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్ కంపెనీలు ఇష్టపడడం లేదు. నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు. చమురు కొరతతో గత నెలలో పట్టణ ప్రాంత స్కూళ్లు రెండు వారాలు మూతపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment