పీహెచ్సీ నిధుల్లో కోత
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కోఆస్పత్రికి అభివృద్ధి కింద ఎన్హెచ్ఎం నిధులు రూ.1.75 లక్షల చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.1.27 కోట్లు రావాల్సి ఉండగా గతేడాది కేవలం రూ.27.74 లక్షలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఏడాది ఒక్కో పీహెచ్సీ కి రూ.75లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇలా ఏడాదికేడాది ఈ నిధులను తగ్గిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)లు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి. ఆస్పత్రి అభివృద్ధి కోసం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా ప్రతీ సంవత్సరం వచ్చే నిధుల్లో కోత పెట్టడమే దీనికి కారణమైంది. దీంతో అరకొర నిధులతో ఆరోగ్య కేంద్రాలను నెట్టుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ నిధిని వినియోగించుకునే పరిస్థితి ఉండగా నిధుల కోత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాలకులతో పాటు అధికారులు ఈ నిధుల విషయంలో పట్టించుకుంటేనే ఏదైనా ప్రయోజనం దక్కే పరిస్థితి ఉంది.
అభివృద్ధి ఆ నిధులతోనే..
జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి ప్రతీ ఏడాది ఆసుపత్రి అభివృద్ధి నిధులు మంజూరవుతాయి. ఒక్కో ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లకు రూ.5లక్షల చొప్పున, ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కి రూ.1.75లక్షల చొప్పున ప్రతీ ఏడాది నిధులు రావడం జరుగుతోంది. ఏహెచ్, సీహెచ్‌సీలకు నిర్ధారిత ఎన్హెచ్ఎం నిధులు వస్తుండగా పీహెచ్‌సీలకే పూర్తిస్థాయిలో రావడంలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, బోథ్, సిర్పూర్, ఆసిఫాబాద్, జైనూర్‌లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మంచిర్యాల, భైంసా, ఖానాపూర్, నిర్మల్(ఎంసీహెచ్)లలో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధి నిధులకు సంబంధించిన ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులకు ఆయా ఎమ్మెల్యేలు చైర్మన్‌గా, సూపరింటెండెంట్లు మెంబర్ కన్వీనర్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
పీహెచ్‌సీలకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్షుడు చైర్మన్‌గా, మెడికల్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా, స్థాని క జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభ్యులు గా ఉంటారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు సమావేశమై నిధుల వినియోగానికి సంబంధించిన తీ ర్మాణం చేసి వినియోగిస్తారు. ప్రధాన ఆస్పత్రుల్లో భవన మరమ్మతులు, రంగులు వేయడం, ల్యాబ్ పనిముట్ల కొనుగోలు, రోగికి సౌకర్యంగా ఉండే విధంగా ఈ నిధులను వెచ్చించాలి. ఆస్పత్రుల్లో మందులు లేనిపక్షంలో, సెంట్రల్ డ్రగ్‌స్టోర్ (సీడీసీ)లో కూడా ఆ మందులు అందుబాటులో లేకుంటే ఈ నిధుల నుంచి వాటిని బయట కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిధులలేమి కారణంగా ఒకవేళ సీడీసీలో కూడా ఆ మందులు అందుబాటులో లేకపోతే ఏంచేయలేని పరిస్థితుల్లో చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పేదలకు మందులు అందని పరిస్థితి.
వరుసగా కోత..
ఎన్హెచ్ఎం నిధుల విషయంలో గత రెండేళ్లుగా నిర్ధారిత కోటా రావడం లేదు. దీంతో పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. ప్రతీ సంవత్సరం రెండు విడతల్లో రూ.1.75 లక్షలు విడుదల చేసేవారు. అయితే గత మార్చిలో కేవలం రూ.38వేలు, అంతకుముందు ఏడాది రూ.75వేలు మాత్రమే విడుదల చేశారు. వరుసగా ఈ నిధుల్లో భారీగా కోత విధిస్తుండడంతో ఆస్పత్రుల్లో చిన్నచిన్న మరమ్మతులకు కూడా నిధులు లేని పరిస్థితి కనిపిస్తోంది.
కారణాలేమిటి?
ఎన్హెచ్ఎం నిధులు పీహెచ్‌సీలకు కోత విధించడం పట్ల కారణం ఏమై ఉంటుందన్న అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిధుల వినియోగం అంచనా ప్రకారం కేంద్రం నుంచి ఆ నిధులను విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్ (యూసీ) అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇది ప్రతీ సంవత్సరం నిరంతరంగా జరిగే ప్రక్రియ. అయితే నిధుల వినియోగంలో అసమర్థత కారణంగా ఈ కోత జరిగిందా?..లేనిపక్షంలో యూసీలు సమర్పించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్రం నిధులకు అనుగుణంగా..
కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఎన్హెచ్ఎం నిధులకు అనుగుణంగా జిల్లాలకు ఈ నిధులు విడుదల చేస్తారు. గతం కంటే ఇప్పుడు నిధులు తక్కువగా వచ్చాయి. రాష్ట్రం నుంచి నేరుగా ఈ ఎన్హెచ్ఎం నిధులు ఆస్పత్రులకు వస్తాయి. ఒకవేళ ఈ నిధులు సరిపోని పక్షంలో కలెక్టర్‌కు నోట్ పెట్టి ఏదైనా పనులు చేపడతారు. దానికి సంబంధించి కలెక్టర్ నుంచి నిధులు ప్రత్యామ్నాయంగా ఇస్తారు. – డాక్టర్ రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్