శ్రీకాకుళం: గ్రామ వికాసంతోనే దేశ వికాసం సాధ్యమన్నది నానుడి. ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యాలను నిర్ధేశించుకొని వాటి ల క్ష్యాలను సాధించేందుకు గ్రామ పంచాయతీలు కృషిచేయాల్సి ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పంచాయతీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. గ్రామీణులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. జిల్లాలో 1101 పంచాయతీలున్నాయి. వీటి ద్వారా పంచాయతీ శాఖ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.9 కోట్లకు పైగా ఆదాయం రావలసి ఉంది. పంచాయతీల జనాభా సుమారు 24 లక్షల వరకు ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వాటి ఖర్చులకు సంబంధించి ముందుగానే నిర్ధేశం చేస్తుండడంతో వేరొక అవసరాలకు నిధులు ఖర్చుచేసే అవకాశం లేకుండా పోతోంది.
రాష్ట్రం ఇచ్చేది తక్కువే...
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేస్తున్న నిధులు రూ.1 లక్ష లోపే ఉంటుంది. ఆ నిధులు పంచాయతీల విద్యుత్ చార్జీలకు కూడా చాలకపోవడంలో అతిశయోక్తి లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ కారణంగా ఆ నిధులు వేరొక అవసరానికి వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. పంచాయతీలకు నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూళ్లపై ల క్ష్యాలను నిర్ధేశించి వాటి వసూళ్లలో పంచాయతీ కార్యదర్శులు కఠినంగా వ్యవహరించేలా చేసింది. జిల్లాకు రూ. 25 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా నిర్ధేశించగా రూ.10 కోట్లు మాత్రమే కార్యదర్శులు వసూలు చేయగలిగారు.
ఈ పన్ను వసూళ్లకు పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచ్, వార్డు సభ్యులతో బృందాలుగా ఏర్పరచి కమిటీని నియమించింది. అయితే వారినుంచి సరైన సహకారం లేకపోగా రాజకీయంగా ప్రజల వద్ద చెడ్డ కాకుండా ఉండేందుకు పరోక్షంగా ప్రజలు పన్ను చెల్లించకుండా ఉండేలా కొందరు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వ్యవహరించారు. ఇది కూడా పన్ను వసూళ్లకు అవరోధం కల్పించింది. ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధికారులు పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్‌డీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో వారంతా మానసికంగా ఆవేదన చెందుతున్నారు. పన్నును మూడింతలు చేయడంతో గ్రామీణులు అవస్థలు పడుతుండగా అసౌకర్యాలు వారిని వేధిస్తున్నాయి.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి
మండు వేసవిలో నీటి ఎద్దడిని గ్రామస్థులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది. విద్యుత్ బకాయిలు పెరిగిపోవడంతో వాటిని చెల్లించాలంటూ అప్పుడప్పుడూ విద్యుత్‌శాఖ సరఫరాను నిలిపివేస్తుండడంతో గ్రామాల్లో అంధకారం రాజ్యమేలుతోంది. ఇలా అన్ని విషయాల్లో పంచాయతీలు సమస్యల్లో ఉండడం వల్ల ఆ ప్రభావం రాష్ట్ర, దేశ ప్రగ తిపై పడేలా కనిపిస్తోంది.
గ్రామాభివృద్ధికి అవరోధంగా నిధుల కొరత
Published Sun, Apr 24 2016 2:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement