కొలంబో: శ్రీలంక సంక్షోభానికి ఇతర అంశాలతో పాటు కోవిడ్ మహమ్మారి కూడా ఒక‡ కారణమని మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. కోవిడ్ వల్ల దేశం చాలా నష్టపోయిందని తాను పంపిన రాజీనామా లేఖలో నిందించారు. కోవిడ్ కారణంగా లాక్‌డౌన్‌లు విధించడంతో దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. సంక్షోభం నుంచి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తన శాయశక్తులా కృషిచేశానన్నారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశానని తెలిపారు. రాజపక్స రాసిన ఆ లేఖను శనివారం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో సెక్రటరీ జనరల్ ధామ్మిక దస్సనాయకే చదివి వినిపించారు. పార్టీ నాయకుల ఆకాంక్ష మేరకే తాను రాజీనామా చేశానని, భవిష్యత్‌లో దేశానికి ఉత్తమ సేవలు అందించాలని అనుకుంటున్నానని రాజపక్స ఆ లేఖలో రాశారు.
తదుపరి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ షురూ
నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పార్లమెంటు ప్రారంభించింది. జూలై 20న జరగబోయే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రక్రియను ప్రారంభించడానికి పార్లమెంట్ శనివారం సమావేశమైంది. సమావేశంలో పార్లమెంటు అధ్యక్ష పదవికి ఎన్నికలు 20న జరుగుతాయని, 19న నామినేషన్లు తనకు సమర్పించాలని దస్సనాయకే అన్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే 20న సభలో ఓటింగ్ ఉంటుంది.
అధికార పార్టీ తరఫున తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘె, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత ప్రేమదాస, జేవీపీ నాయకుడు అనుర కుమార దిస్సనాయకె, అధికార ఎస్‌ఎల్‌పీపీ చీలికపక్షం నాయకుడు దల్లాస్ అలహప్పెరుమ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. శ్రీలంక జనాభాలో 28శాతం అంటే 60 లక్షల మందికిపైగా ఆహార కొరతని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారనున్నాయని హెచ్చరించింది. ఆహారం, మందులు, వంట గ్యాస్, పెట్రోల్ చివరికి టాయిలెట్ పేపర్ దిగుమతి చేసుకోలేని పరిస్థితుల్లోకి దేశం వెళ్లిపోయిందని యూఎన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment