
సాక్షి, విశాఖపట్నం: మయన్మార్ తీరానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
మరోవైపు వాయవ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్రతీర ప్రాంతాల వరకు, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్ అంతర్భాగంగా తూర్పు–పడమర ద్రోణి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది.
దీని ఫలితంగా రానున్న మూడురోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి వరకు విజయనగరం, కోనసీమ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి.
ఇది కూడా చదవండి: టమాటా రైతుకు బాసట..