
న్యూఢిల్లీ: తగిన వర్షపాతంతో భారీ పంట దిగుబడులు, వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీరేట్ల పెంపు ద్వారానే తీవ్ర ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమని ఆర్థికవేత్తలు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై తదుపరి మరింత ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కేంద్రం కసరత్తు చేయాలని కూడా ఆయా వర్గాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 7.79 శాతం (95 నెలల గరిష్ట స్థాయి), 7.04 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో 15.88 శాతంగా నమోదయ్యింది. మే, జూన్ నెలల్లో ఇప్పటికే ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును రెండు దఫాలుగా (0.4 శాతం, 0.5 శాతం) చొప్పున పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. ఈ రేటు మరో 80 బేసిస్ పాయింట్ల మేర ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఎకనమిస్ట్ విశ్రుత్ రాణా అభిప్రాయపడ్డారు. సరఫరాల సమస్య తొలిగితే ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్ రుంకీ మజుందార్ వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఎకానమీకి తీవ్ర సవాళ్లు పొంచిఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సునిల్ సిన్హా పేర్కొన్నారు. యుద్ధం ముగిస్తే, కమోడిటీ ధరల స్థిరత్వంపై కొంతమేర ఒక అభిప్రాయానికి రావచ్చని అన్నారు.
చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా! అయితే ఇలా చేయండి!
Comments
Please login to add a commentAdd a comment