దుర్భిక్షం సాగు! | The severe drought in 390 zones | Sakshi
Sakshi News home page

దుర్భిక్షం సాగు!

Published Mon, Oct 8 2018 2:38 AM | Last Updated on Mon, Oct 8 2018 2:38 AM

The severe drought in 390 zones - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాల పరిస్థితి నాలుగేళ్లుగా సరిగా లేకపోవడంతో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోతోంది. రుతుపవనాల రాకలో జాప్యం, వానలు లేక పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయి. చక్రవడ్డీలతో రైతులు రుణఊబిలో కూరుకుపోతున్నారు.

సీమలో తీవ్ర వర్షాభావం...
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సగటున 19.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమలో సాధారణం కంటే 36 శాతానికిపైగా తక్కువ వర్షం కురిసింది. వైఎస్సార్‌ జిల్లాలో కురవాల్సిన సాధారణ వర్షంతో పోల్చితే సగమే కురిసింది. రాయలసీమలో 390 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం 296 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి 94 మండలాలకు తీవ్ర  అన్యాయం చేసింది.

2016 ఖరీఫ్‌లో కూడా 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉండగా ప్రభుత్వం 301 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 2017 ఖరీఫ్‌లో ఆగస్టు మూడో వారం వరకూ 241 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఆగస్టు, సెప్టెంబరులో అల్పపీడనాలవల్ల వర్షం కురవడంతో లోటు వర్షపాత మండలాల సంఖ్య 93కి తగ్గింది. అయితే ప్రభుత్వం ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకుండా రైతులకు ద్రోహం చేసింది.

ఏడు జిల్లాల్లో దుర్భిక్షం
ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు) పది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌) గణాంకాల ప్రకారం ఏడు జిల్లాల్లో సాధారణం సగటు కంటే 19 శాతానికి పైగా తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా 390 మండలాల్లో సాధారణ వర్షం కంటే తక్కువ వాన కురిసింది. రాయలసీమలో వేరుసెనగ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎండుతున్న వేరుసెనగ సెప్టెంబరు చివరలో కురిసిన వర్షాలతో పచ్చబడ్డా అప్పటికే పంటకాలం దాదాపు పూర్తి కావటంతో కాయలు రాలేదు.

పడిపోయిన పంటల సాగు
ఖరీఫ్‌లో ఐదేళ్లుగా పంటల సాగు తగ్గడం దుర్భిక్షం పెరుగుదలను సూచిస్తోంది. 2014 ఖరీఫ్‌లో 40.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది ఇదే సీజన్‌లో 35.75 లక్షల హెక్టార్లకు పడిపోవడం గమనార్హం. 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది మూడు లక్షల హెక్టార్లలో  సాగు తగ్గినా కరువు మండలాలను మాత్రం కుదించడం గమనార్హం.

ఖరీఫ్‌లో సాగు విసీర్ణం (లక్షల హెక్టార్లలో)
సంవత్సరం  సాగువిస్తీర్ణం     కరువు మండలాలు
2014            40.96            238
2015            36.34            359
2016            38.62            301
2017            35.92            0
2018            35.75            296

పడిపోయిన పంటల సాగు
ఖరీఫ్‌లో ఐదేళ్లుగా పంటల సాగు తగ్గడం దుర్భిక్షం పెరుగుదలను సూచిస్తోంది. 2014 ఖరీఫ్‌లో 40.96 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది ఇదే సీజన్‌లో 35.75 లక్షల హెక్టార్లకు పడిపోవడం గమనార్హం. 2016లో 38.62 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా 301 మండలాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రకటించగా ఈ ఏడాది మూడు లక్షల హెక్టార్లలో  సాగు తగ్గినా కరువు మండలాలను మాత్రం కుదించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement