రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు
రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశం.. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర కోస్తాకూ విస్తరణ
దూకుడుగా రుతుపవనాలు
మూడ్రోజులు విస్తారంగా వర్షాలు
విశాఖ, పల్నాడు జిల్లాల్లో పిడుగుపాట్లకు నలుగురు మృతి
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/యడ్లపాడు/: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించాయి. ఇవి శనివారం రాత్రి రాయలసీమను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అవి రాష్ట్రమంతా శరవేగంగా విస్తరించే అవకాశమున్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా రుతు పవనాలు ఐదో తేదీ తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందుగానే ప్రవేశించాయి. దీంతో రాయలసీమలోని అనంతపురం, అనంతరం నెల్లూరు జిల్లాను తాకడంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఇవి ఒకట్రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లోకి విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు దూకుడుగా ఉన్నందున రెండు మూడ్రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అలాగే, పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లోకి కూడా ఇవి వ్యాపించనున్నట్లు తెలిపింది. ఈ రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు.. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా సిద్దవటంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, అన్నమయ్య జిల్లాల్లోని రాయచోటి, రాజంపేట, కోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు–గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. ఆదివారం సా.5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత..
ఆదివారం కురిసిన వర్షాల్లో పిడుగులు పడి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో పడవలో ఉన్న దుమ్ము పోలిరాజు అనే యువకుడు పిడుగు పడి అక్కడికక్కడే మరణించగా.. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో బోటు తనిఖీకి వెళ్లిన కంబాల ముత్యాలు అనే మరో మత్స్యకారుడు కూడా పిడుగుపడి చనిపోయాడు. ఆదివారం ఉదయం ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటకు పైగా ఉరుములు, మెరుపులు, పిడుగులు జనాన్ని భయకంపితులను చేశాయి.
మరోవైపు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఇద్దరు రైతులు కూడా పిడుగులకు బలయ్యారు. పొలాల్ని సాగుకు సిద్ధంచేసుకోవాలని వెళ్లిన పెద్ది చినవీరయ్య (58), చిరుతల శ్రీనివాసరావు (51) పిడుగుపాటుకు గురై మృతిచెందారు. ఉ.5.30 గంటల ప్రాంతంలో పొలానికి వెళ్లిన వీరు అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దీంతో సమీపంలోని వేప చెట్టు కిందకు వెళ్లగా అప్పుడే పెద్ద శబ్దంతో అదే చెట్టుపై పిడుగు పడింది. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment