ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిద్దాం
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిద్దాం
Published Mon, Mar 6 2017 11:47 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
- అదనపు క్లస్టర్లను గుర్తించండి
- రాయలసీమ కన్సల్టెంటు సుబ్బారావు సూచన
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే ఖరీప్ సీజన్‌లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి వ్యవసాయం రాయలసీమ జిల్లాల కన్సల్టెంటు సుబ్బారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని డ్వామా సమావేశ మందిరంలో సీఏలు, సీఆర్‌పీలు, ఆత్మ బీటీఎం, ఏటీఎంలతో ఆయన సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ముందుగా వేసవిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వేసవి దుక్కులను ప్రోత్సహించాలని, ఇందువల్ల పంటలకు హాని చేసే పురుగులను చాలావరకు నివారించుకోవచ్చన్నారు.
వాలుకు అడ్డంగా దున్నుకునేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఇందువల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుందన్నారు. ఖరీప్ సీజన్‌లో గత ఏడాది కంటే మరింత సమర్థవంతంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. ఇంత వరకు జిల్లాలో 11 క్లస్టర్లలోనే ఈ వ్యవసాయాన్ని చేపడుతున్నామని, వచ్చే ఖరీప్‌లో మరిన్ని క్లస్టర్లలో చేపట్టాలని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వాడుతున్నందునా పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, పండిన పంటల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ కారణంగా వ్యవసాయ దిగుబడులకు మార్కెట్‌లో ఆశించిన ధరలు లభించడం లేదని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులకు తావులేదని, కేవలం ద్రవ,ఘన జీవామృతాలు, కషాయాలతో పంటలు పండించడం జరుగుతోందని తెలిపారు. సమావేశంలో ఆత్మపీడీ రవికుమార్, డీడీఏలు మల్లికార్చునరావు, గణపతి, డీపీఎం నాగరాజు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement