భవన నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులు
సాక్షి, ఎర్రగుంట్ల : రెండేళ్లు గడిచినా భవన నిర్మాణ కార్మికులకు బీమా పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. బడ్జెట్‌లో నిధుల నిల్వ ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మొండిచేయి చూపిస్తోంది. భవన నిర్మాణ కార్మిక రంగానికి అధిక ప్రాధాన్యత, కార్మికుల కష్టాన్ని వమ్ము చేయమని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం వారి బాగోగులను పట్టించుకోవటం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో తాపీ, పెయింటర్లు, రాడ్ బిల్డింగ్, ఆగర్లు, కార్పెంటర్లతోపాటు 31 విభాగాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు పొందిన వారు సుమారు 20 వేల మంది ఉన్నారు. గుర్తింపు పొందని వారు వేలల్లో ఉన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు, యూనియన్లు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి వివాహ కానుక, ప్రమాద బీమా, ప్రసూతి ఆనారోగ్యానికి సంబంధించి పథకాలను అమలు చేయించుకోగలిగారు. వివాహం కానుకగా రూ.10వేలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు, ప్రసూతి నిమిత్తం రూ.5వేలు, ఆనార్యోగం సంభవిస్తే రూ.9వేలు భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాలి. ప్రస్తుతం నియోజకవర్గంలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు బీమా పరిహారానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న కోట్లాది రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంది. ఆ నిధి నుంచి టీడీపీ ప్రభుత్వం దోమతెరలు, చలివేంద్రాలు, చంద్రన్న బీమా కార్యక్రమాలకు మళ్లించిందని కార్మికులు, యూనియన్లు ఆరోపిస్తున్నారు.
ఆదరణ పథకం గాలిలోనే
భవన నిర్మాణ కార్మికులకు ఆదరణ పథకం ద్వారా లబ్ధి అంతంత మాత్రంగా ఉంది. కార్మికుల ఉపాధి,భవన నిర్మాణ సామగ్రి కోసం ఆదరణ పథకం ఏర్పాటు చేశారు. అయితే ఈ పథ«కం కింద ఇంటర్వ్యూలకు వెళ్లినా ఇంత వరకు వారికి సామగ్రి ఇవ్వలేదు. ఎంపికైన వారి నుంచి రూ.2వేలు కట్టించుకున్నారని కార్మికులు చెబుతున్నారు.
ప్రతిబంధకంగా నిబంధనలు
గతంలో భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లయితే దరఖాస్తుకు ఫోటో జతపరిస్తే సరిపోయేది. ప్రస్తుతం గ్రామ కార్యదర్శి సంతకం ఉండటమే కాకుండా మగపెళ్లి వారు గ్రామ కార్యదర్శి సంతకం, ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత వ్యక్తులు కావాలన్న నిబంధన విధించారు. దీంతో అనేక మంది బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేయటానికి వెనకాడుతున్నారు. ప్రభుత్వం స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు బీమా సదుపాయం మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.
కార్మికుల నడ్డివిరగకొట్టడమే
అనునిత్యం కాయాకష్టం చేస్తున్న కార్మికులకు వర్తించే సంక్షేమ నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. ఈ చర్య కార్మికులు, వారి కుటుంబ సభ్యుల జీవన విధానానికి అడ్డుతగలడమే. ఈ విధానంతో కార్మికులు నడ్డివిరగకొడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భనవ నిర్మాణ కార్మికులకు బీమా, పరిహారం అందజేయాలి.
– ఎస్.రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎర్రగుంట్ల
Comments
Please login to add a commentAdd a comment