వృద్ధులందరికీ పింఛన్ ఇస్తున్నామని ఓ వైపు టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. మరోవైపు అన్ని రకాల అర్హతలుండీ పింఛన్‌రాక అవస్థలు పడుతున్న వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం.. పాలకుల నిర్లక్ష్యం.. రాజకీయ కోణం.. వెరసి అనేకమంది వృద్ధుల పాలిట శాపంగా మారింది. ఓట్ల కోసం హడావుడిగా పింఛన్‌ను రూ.2వేలకు పెంచిన ప్రభుత్వం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పండుటాకుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బతుకు బరువై.. పాలకుల ఆదరణ కరువై దీనంగా కాలం వెల్లదీస్తున్న వయో వృద్ధులను చూసి అయ్యో.. ‘దేశం’ పాలనలో ఎంత కష్టం అంటూ
ప్రతి ఒక్కరూ బాబూ నిన్ను నమ్మం అంటున్నారు.
సాక్షి కడప : రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే పండుటాకుల పింఛన్ విషయంలో అనేక ఆంక్షలు విధించడంతో వారికి కష్టాలు వెంటాడుతున్నాయి. 60 ఏళ్లు నిండినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొని పింఛన్లకు అర్హత పొందడం గగనంగా మారింది. ఎప్పుడూ లేని తరహాలో అత్యధికంగా పింఛన్ సొమ్ము ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే మరో పక్క నిబంధనలను అడ్డం పెట్టి అందరికీ అందకుండా చేశారు.
జన్మభూమి కమిటీలతో అష్టకష్టాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. అందులోనూ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిన వారికి పెత్తనం అప్పజెప్పారు. అంతో ఇంతో సమర్పించుకుంటేగానీ కమిటీలు ఆమోదముద్ర వేయకపోగా.. పైగా గ్రామాల్లో పార్టీల పేరుతో సైతం పేదల దరఖాస్తులను పక్కన పడేశారు. ఇలా ఒకటేమిటి? అనేక రకాలుగా జన్మభూమి కమిటీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అర్హతలున్నా పింఛన్ ఏదీ
ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు చీమల ఓబులమ్మ. వయసు 70 సంవత్సరాలు. జమ్మలమడుగు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో నివాసం ఉంటోంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డు లేదంటూ పింఛన్ ఇవ్వలేదని వాపోతోంది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
జిల్లాలో సుమారు 3,04,754 మంది పింఛన్‌దారులకు ప్రస్తుతం రూ. 2 వేలకు పింఛన్ పెంచారు. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తరబడి మంజూరు కాకపోవడంతో కార్యాలయాల చుట్టూ పదేపదే తిరుగుతూ దరఖాస్తు గురించి వాకబు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది అష్టకష్టాలు పడితేగానీ పింఛన్ మంజూరు కావడం లేదు.
ఎన్నికలకు ముందు క్లియర్
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుందని గ్రహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 12వ తేదీ నాటికి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఓట్లే లక్ష్యంగా క్లియర్ చేశారనే విమర్శలున్నాయి. సుమారు 20,148 జన్మభూమి సభల ద్వారా వచ్చిన పింఛన్ దరఖాస్తులకు ఆమోదముద్ర వేయగా, ఫిబ్రవరి నెలలో కూడా 1926 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత పింఛన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను క్లోజ్ చేశారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది.
అర్హులకు పింఛన్ ఇవ్వరా?
ఈమె పేరు షేక్ మహబూబ్‌బీ. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాస్‌నగర్ 14వ వార్డులో నివాసం ఉంటోంది. 65 ఏళ్లు పూర్తి కావడంతో పింఛన్ కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. మళ్లీ జన్మభూమి గ్రామసభల్లో పింఛన్‌కు దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు. పింఛన్ తీసుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నా తనకు పింఛన్ ఎందుకు ఇవ్వరని ఆమె ప్రశ్నిస్తోంది.
79 ఏళ్లు ఉన్నా..
ప్రొద్దుటూరు పట్టణం సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఇతని పేరు గోపిరెడ్డి పుల్లారెడ్డి. చాలా సార్లు పింఛన్ కోసం దరఖాస్తు చేశాడు. ప్రభుత్వం ఇప్పటి వరకు పింఛన్ మంజూరు చేయలేదు. 79 ఏళ్లు వయసు ఉన్నా పింఛన్ రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. పింఛన్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా తనకు పింఛన్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment