ఫేకర్‌లో పోలీసు బందోబస్తు మధ్య యంత్రాలతో పనులు
సాక్షి, గరివిడి (చీపురుపల్లి): జిల్లాలో పారిశ్రామిక రంగానికే వన్నె తెచ్చిన గరివిడి ఫేకర్‌లో కార్మికులు, యాజమాన్యం మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కార్మికులను తప్పించి యంత్రాలతో పని చేయించేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
హైకోర్టు తీర్పు బేఖాతరు
ఫేకర్ పరిశ్రమలో వేగన్, లారీ లోడింగ్ కార్మికులు 114 మంది, అన్‌లోడింగ్ కార్మికులు 132 మంది, స్టోరేజ్ కార్మికులు 23 మంది మొత్తం 269 మంది కొన్నేళ్లుగా (తాత, తండ్రుల కాలం నుంచి వంశపారంపర్యంగా) ఫేకర్‌ను నమ్ముకుని పనిచేస్తున్నారు. వారిని తొలగించి యంత్రాలతో పనిచేసే ప్రయత్నం యాజమాన్యం గతంలో చేసింది. దీంతో కార్మికులు ఏకమై హైకోర్టులో కేసు వేయగా వారికి అనుకూలంగా 2012 డిసెంబర్ 31న తీర్పు వచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
ఆ వెంటనే యాజమాన్యం కూడా వారిపై కేసులు వేసింది. ఈ తంతు జరుగుతుండగా కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఫేకర్ యాజమాన్యం 2014 ఫిబ్రవరిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్థంతరంగా ఫ్యాక్టరీని నిలిపి వేసింది. అప్పటి నుంచి సుమారు 43 నెలలు (ఏడాదిన్నర పాటు) లాకౌట్‌లో ఉంది. 2014 డిసెంబరు 9న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారిని విధుల్లోకి తీసుకోక తప్పలేదు. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరించి 43 నెలలు మూసివేసింది. మళ్లీ 2016 సెప్టెంబర్ 16న పరిశ్రమను తెరిచినా కార్మికులను పనుల్లోకి మాత్రం తీసుకోలేదు.
144వ సెక్షన్ విధింపు
తమ సమస్యను కార్మిక శాఖమంత్రి, నారా లోకేష్, జిల్లా మంత్రి రంగారావు, ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, కలెక్టర్, కార్మిక శాఖాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీసం తమ గోడును వినిపించుకోవడానికి సైతం వీల్లేకుండా గరివిడి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకమై 144వ సెక్షన్ విధించారని కార్మికులు వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసు పహరాలో ఫేకర్‌లో యంత్రాలతో పనులు జరుగుతున్నాయి.
269 మంది కార్మికులకు గండం
వేగన్, లారీ లోడింగ్ అన్‌లోడింగ్ కార్మికులను ఫేకర్ నుంచి బయటికి పంపించి వారి స్థానంలో యంత్రాలతో పని చేసుకునేందుకు ఫేకర్ యాజమాన్యం మళ్లీ సిద్ధపడింది. ఇప్పటికే యంత్రాలతో పనులు చేయిస్తోంది. కార్మికులు అడ్డుకుంటారన్న సందేహంతో పోలీస్ రక్షణలో యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారు. ఫేకర్ యాజమాన్యం నిర్ణయం వల్ల 269 మంది వేగన్, లారీ లోడింగ్ అన్‌లోడింగ్ కార్మికులు రోడ్డున పడనున్నారు.
మంత్రికి చెప్పినా శూన్యం
ఫేకర్‌లో పనిచేస్తున్న వేగన్, లారీలోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులు సమస్యలను కార్మిక సంఘాల నేతలు జిల్లా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు విన్నవించారు. 144వ సెక్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని అదే రోజు మంత్రి ఆదేశించినా అమలు కాలేదు.
– రాజాన రమణ, కార్మిక సంఘాధ్యక్షుడు
వెనక్కి తగ్గేది లేదు
ఫేకర్ యాజమాన్యం సమస్యను నిర్వీర్యం చేసేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు సమస్య తీసుకెళ్లాం. నిరసనలు, దీక్షలు ఆపేందుకు యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించి కార్మికుల హక్కులను కాపాడుకుంటాం. యాజమాన్యం బెదిరింపులకు భయపడం.
– గంటా పాపారావు, వర్కింగ్ ప్రెసిడెంట్, కార్మిక సంఘం
Comments
Please login to add a commentAdd a comment