సాక్షి, కడప: పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబం వెన్నంటేనని నాలుగు దశాబ్దాలుగా నిరూపిస్తున్నారు. 1955 నుంచి ఇప్పటి వరకూ 16సార్లు ఎన్నికలు నిర్వహిస్తే, 12మార్లు వైఎస్ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 2014 వరకూ వైస్ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. 2009 ఉప ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అత్యధిక మెజార్టీ సైతం ఆ కుటుంబం ఖాతాలోనే ఉండిపోయింది.
పులివెందుల నియోజకవర్గానికి 1955 నుంచి ఇప్పటి వరకూ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 13సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి చవ్వా బాలిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డిపై విజయం సాధించారు. 2009 ఉప ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతి తక్కువ మెజార్టీ సాధించిన నేతగా చవ్వా బాలిరెడ్డి నిలవగా, అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి నిలిచారు. 1962లో చవ్వా బాలిరెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డిపై 5008 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ వైఎస్ పురుషోత్తమరెడ్డి టీడీపీ అభ్యర్థి అన్నారెడ్డి బాలస్వామిరెడ్డిపై 97,448 ఓట్లు మెజార్టీ సాధించి, అత్యధిక మెజార్టీ జాబితాలో నిలిచారు. కాగా 1955, 1967, 1972లలో పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత 1978 నుంచి అన్ని ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఓటమి ఎరుగని నేతగా ఖ్యాతి గడించిన వైఎస్..
1978లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటమి ఎరుగని నాయకునిగా చరిత్ర సృష్టించారు. పులివెందుల నుంచి 6సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో తొలిసారిగా 20,496 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయన తర్వాత వెనకడుగు వేసింది లేదు. ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం 1983లో టీడీపీ అభ్యర్థి ఎద్దుల బాలిరెడ్డిపై 13,367 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో 30,842ఓట్ల మెజార్టీతోనూ, 1999లో 30,009 ఓట్ల మెజార్టీతోనూ విజయం సాధించారు. 2004లో 40,777 ఓట్ల ఆధిక్యం, 2009లో 68,681 ఓట్ల మెజార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతమైంది. పులివెందుల అసెంబ్లీకి ఆరుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కడప పార్లమెంటు సభ్యునిగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు.
1989, 1990, 1994, 1996 సంవత్సరాల్లో నాలుగు పర్యాయాలు గెలుపొంది తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజానీకం అండదండలతో వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ఓటమి ఎరుగని నేతగా కీర్తి గడించారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మూడు సార్లు మంత్రిగా, రెండు మార్లు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడుగా సైతం పనిచేశారు.
కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ...
కాంగ్రెస్ అంటేనే పులివెందుల, పులివెందుల అంటేనే కాంగ్రెస్ పార్టీగా పేరుండేది. అయితే వైఎస్ కుటుంబం పార్టీ వీడడంతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. 16 సార్లు పులివెందులలో ఎన్నికలు నిర్వహించగా 13 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేధింపుల కారణంగా ఆ కుటుంబం 2010లో కాంగ్రెస్ పార్టీని వీడింది. ఆనాటి నుంచే అక్కడ కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు మొదలయ్యాయి. తర్వాత 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 81,373 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సైతం మరీ బలహీన పడ్డారు.
1991లో ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి బాలస్వామిరెడ్డికి 11,870 ఓట్లు లభించగా, 2011 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బిటెక్ రవీంద్రనాథరెడ్డికి 11,230 ఓట్లు మాత్రమే దక్కాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చవిచూసింది. 1983 నుంచి ఇప్పటి వరకూ 10సార్లు టీడీపీ పోటీ చేస్తే ఎప్పుడూ ఓటమినే బహుమానంగా పులివెందుల ప్రజలు అప్పగించారు. పులివెందులలో టీడీపీ నామమాత్రపు పోటీగానే ఉంటోంది. కాగా 1999 నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఇప్పటికి నాలుగు పర్యాయాలు ఓటమి చెందారు. మరోమారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో నిలవనున్నారు.
రికార్డుల మోత..
పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యధికంగా 68,681 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి 1994లో 71,580 ఓట్ల మెజార్టీ సాధించి తన ఖాతాలో జమచేసుకున్నారు. 2011 ఉప ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ 81,373 ఓట్లు మెజార్టీ సాధించారు. 1991లో ఆ కుటుంబానికి చెందిన వైఎస్ పురుషోత్తమరెడ్డి 97,448 ఓట్లు మెజార్టీ సాధించారు.
ఆయన మెజార్టీనే ఇక్కడ అత్యధిక రికార్డు కావడం విశేషం. 2014లో తొలిసారి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీచేసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 75,243 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా> ప్రాతినిధ్యం వహించారు. 2019లో మరోమారు పులివెందుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు ఒకరిని మించి మరొకరు ప్రజాభిమానాన్ని చూరగొని రికార్డు స్థాయి మెజార్టీలను సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment