Building Construction workers
-
కరీంనగర్ రాయితో నూతన హైకోర్టు నిర్మాణం
కరీంనగర్ క్రైం: రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణంలో కరీంనగర్ నుంచి తెప్పించిన బండను వాడుతున్నామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర కలదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన కోర్టు భవనాల సముదాయానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే సీతారాంపూర్ రోడ్డు లో జడ్జీల నూతన నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కో ర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు. అందుకు న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కేసుల విచారణలో అనవసర వాయిదాల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు పరిపాలనా జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వినోద్‌కుమార్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణకుమార్ మాట్లాడారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి.నవీన్రావుతోపాటు వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పి.గోపాలకృష్ణ, కె.మాధవరావు, జి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వరరావు, జి.హనుమంతరావును చీఫ్ జస్టిస్ సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, న్యాయమూర్తులు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ఆర్డీవో మహేశ్వర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యే ముందు చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులంతా మంకమ్మతోటలోని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. -
ఎలివేషన్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా.. ఘోర ప్రమాదం!
హైదరాబాద్: కూకట్పల్లి సర్కిల్ అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం ఎలివేషన్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఆరో అంతస్తుపై ఉన్న పిట్టగోడ కూలిపోయింది. దీంతో భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన గోవా కర్రలు విరిగిపోయాయి. ఈ ఘటనలో కర్రలపై నిల్చుని ప నిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఎలివేషన్ కోసం సెంట్రింగ్ పనుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. సెంట్రింగ్ తొలగిస్తున్న సమయంలో పిట్టగోడ కూలి సానియా బట్నాయక్ (19), సామ బట్నాయక్ (23), సానియా చలాన్ (20)లు మృతి చెందారు. వీరితో పాటు పని చేస్తున్న ముదాబత్ నాయక్, బలరాం, సుప్రా బట్నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సామ బట్నాయక్, సానియా చలాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, సానియా బట్నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవనం పిట్టగోడ కూలిన విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో గురువారం పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ భవనం దాసరి సంతోష్, దాసరి సాయిరాం పేరుపై 2022 డిసెంబర్ 2వ తేదీన జీ 5 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. అదనంగా మరో ఫ్లోర్ అక్రమ నిర్మాణం చేపట్టారు. ఆ అంతస్తులోనే పని చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నాణ్యత లేకపోవడంతోనే.. ఆరో అంతస్తుపై పిట్టగోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకోకపోవటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, గోవా కర్రలు తడిచిపోయాయి. పిట్టగోడ కోసం నిర్మించిన సిమెంట్ పెళ్లలు గోవా కర్రలపై పడిపోగా అవి విరిగి వాటిపై నిల్చుని పని చేస్తున్న కార్మికులు కింద పడిపోయారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా అంతస్తులు నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముందుగానే అక్రమ అంతస్తులను అధికారులు అడ్డుకొని ఉంటే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావంటున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురి కార్మికుల మృతికి కారణమైన భవన యజమానులు, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా నిర్మించిన మరో ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తామని పేర్కొన్నారు. గతంలోనే రెండుసార్లు భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ.. ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందడం, ముగ్గురు కార్మికులకు గాయాలు కావటం దురదృష్టకరమని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. భవన యజమాని, బిల్డర్, సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. -
సిమెంటు మంట!
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి): కేవలం నెల రోజుల వ్యవధిలోనే సిమెంటు ధర చుక్కలనంటింది. పెరిగిన ధరలు భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధర కారణంగా నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. సామాన్యుడి సొంత ఇంటి కలపై పిడుగు పడినట్లైంది. ఇప్పటికే పనులు ప్రారంభించిన వారు నిర్మాణ వ్యయం అంచనాలను దాటిపోతుండటంతో అప్పులు చేస్తున్నారు. కొందరు బిల్డర్లు అయితే వడ్డీ భారం పెరుగుతుందనే కారణంతో అప్పు చేసి మరీ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే సిమెంటు ధర మాత్రం రూ.330 నుంచి రూ.370 వరకు పలుకుతోంది. ధర పెరగుతుండటంతో భవనాలతోపాటు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. చుక్కలనంటుతున్న ధర సాధారణంగా భవన నిర్మాణ పనులకు జనవరి నుంచి జూన్ వరకు సీజన్‌గా చెబుతారు. ఈ వ్యవధిలోనే ఎక్కువగా నిర్మాణాలు జరుగుతుంటాయి. అయితే ఈ సీజన్లో మాత్రం కొంత వరకు ధరలు పెరుగుతుంటాయి. అయితే ఈ సారి మాత్రం పెరిగిన ధరలు నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భవన నిర్మాణంలో కీలకమైన సిమెంటు ధర భారీగా పెరిగింది. నెల రోజుల క్రితం వరకు బస్తా సిమెంటు ధర రూ. 330 వరకు ఉండగా ప్రస్తుతం ఆయా కంపెనీలను బట్టి రూ. 330 నుంచి రూ. 370 వరకు ధర పలుకుతోంది. దాదాపు రూ. 100కు పైగా ధర పెరగడం సామాన్యవర్గాలకు మింగుడు పడటంలేదు. ఇక ఇనుము సైతం రెండు నెలల వ్యవధిలోనే టన్నుకు రూ. 6 వేలు వరకు ధర పెరిగింది. ఇసుక ధర సైతం అదే బాట పట్టడంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నిలిచిన ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ఎవరైనా ఇంటి నిర్మాణం మొదలు పెడితే కళ్లు తిరగడం ఖాయం. కొద్ది నెలలుగా పెరుగుతున్న గృహనిర్మాణ సామగ్రి ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలనే కాకుండా కాస్త ఉన్న వాళ్లను సైతం కలవరానికి గురి చేస్తున్నాయి. గతేడాదికి, ఇప్పటికి దాదాపు ఐరన్, సిమెంటు, ఇసుక ధరలు భారీ మొత్తంలో పెరిగాయి. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తలపెట్టిన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపివేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి సుమారు 20 వేల వరకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని బిల్డర్లు పేర్కొంటున్నారు. గృహనిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో దాదాపు 10 వేలకు పైగా పక్కా గృహ నిర్మాణాలు నిలిచిపోయాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో కునారిల్లుతున్నాయి. ధరలు తగ్గే అవకాశం లేకపోవడంతో మొదలు పెట్టిన ఇళ్లు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. మరోవైపు జిల్లాలోని సుమారు 100కుపైగా అపార్టుమెంట్లు సగంలోనే నిలిచాయి. ఇదిలా ఉంటే కూలీల రేట్లు సైతం అమాతం పెంచేశారు. రోజుకు రూ.600 పలుకుతుండటంతో భారం మరింత పెరుగుతోంది. సాధారణంగా వేసవిలోనే నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఐరన్, ఇసుక, సిమెంటు ధరలు పెంచడం సహజం. అయితే ఈ సారి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు పెరిగాయని నిర్మాణదారులు గగ్గోలు పెడుతున్నారు. కష్టతరంగా మారింది పెరుగుతున్న గృహనిర్మాణ సామగ్రి ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సిమెంటు ధర పెరిగింది. పెరిగిన ధరలతో నిర్మాణాలు నిలిపివేస్తున్నాం. ఇదే సమయంలో కూలీల కొరత వేధిస్తోంది. కూలీ ధరలు సైతం విపరీతంగా పెంచేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. –పి.రవిశంకర్, బిల్డర్, తణుకు -
బీమా.. ఏదీ ధీమా?
సాక్షి, ఎర్రగుంట్ల : రెండేళ్లు గడిచినా భవన నిర్మాణ కార్మికులకు బీమా పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. బడ్జెట్లో నిధుల నిల్వ ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మొండిచేయి చూపిస్తోంది. భవన నిర్మాణ కార్మిక రంగానికి అధిక ప్రాధాన్యత, కార్మికుల కష్టాన్ని వమ్ము చేయమని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం వారి బాగోగులను పట్టించుకోవటం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో తాపీ, పెయింటర్లు, రాడ్ బిల్డింగ్, ఆగర్లు, కార్పెంటర్లతోపాటు 31 విభాగాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు పొందిన వారు సుమారు 20 వేల మంది ఉన్నారు. గుర్తింపు పొందని వారు వేలల్లో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు, యూనియన్లు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి వివాహ కానుక, ప్రమాద బీమా, ప్రసూతి ఆనారోగ్యానికి సంబంధించి పథకాలను అమలు చేయించుకోగలిగారు. వివాహం కానుకగా రూ.10వేలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు, ప్రసూతి నిమిత్తం రూ.5వేలు, ఆనార్యోగం సంభవిస్తే రూ.9వేలు భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాలి. ప్రస్తుతం నియోజకవర్గంలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు బీమా పరిహారానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న కోట్లాది రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంది. ఆ నిధి నుంచి టీడీపీ ప్రభుత్వం దోమతెరలు, చలివేంద్రాలు, చంద్రన్న బీమా కార్యక్రమాలకు మళ్లించిందని కార్మికులు, యూనియన్లు ఆరోపిస్తున్నారు. ఆదరణ పథకం గాలిలోనే భవన నిర్మాణ కార్మికులకు ఆదరణ పథకం ద్వారా లబ్ధి అంతంత మాత్రంగా ఉంది. కార్మికుల ఉపాధి,భవన నిర్మాణ సామగ్రి కోసం ఆదరణ పథకం ఏర్పాటు చేశారు. అయితే ఈ పథ«కం కింద ఇంటర్వ్యూలకు వెళ్లినా ఇంత వరకు వారికి సామగ్రి ఇవ్వలేదు. ఎంపికైన వారి నుంచి రూ.2వేలు కట్టించుకున్నారని కార్మికులు చెబుతున్నారు. ప్రతిబంధకంగా నిబంధనలు గతంలో భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లయితే దరఖాస్తుకు ఫోటో జతపరిస్తే సరిపోయేది. ప్రస్తుతం గ్రామ కార్యదర్శి సంతకం ఉండటమే కాకుండా మగపెళ్లి వారు గ్రామ కార్యదర్శి సంతకం, ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత వ్యక్తులు కావాలన్న నిబంధన విధించారు. దీంతో అనేక మంది బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేయటానికి వెనకాడుతున్నారు. ప్రభుత్వం స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు బీమా సదుపాయం మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. కార్మికుల నడ్డివిరగకొట్టడమే అనునిత్యం కాయాకష్టం చేస్తున్న కార్మికులకు వర్తించే సంక్షేమ నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. ఈ చర్య కార్మికులు, వారి కుటుంబ సభ్యుల జీవన విధానానికి అడ్డుతగలడమే. ఈ విధానంతో కార్మికులు నడ్డివిరగకొడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భనవ నిర్మాణ కార్మికులకు బీమా, పరిహారం అందజేయాలి. – ఎస్.రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎర్రగుంట్ల -
బీమా డబ్బులకు లంచమా..!
లేబర్ అధికారితో కార్మికుల వాగ్వాదం జన్నారం : భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందజేసే బీమా డబ్బులు ఇవ్వడానికి, ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి లేబర్ అధికారి హేమలత డబ్బులు అడుతున్నారని మండలంలోని భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. బుధవారం కార్మికుల సభ్యత్వ నమోదుకు మంచిర్యాలకు చెందిన లేబర్ అధికారులు హేమలత, రవీందర్ మండలానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ముల్కల్ల ప్రభాకర్‌తో పాటు కార్మికులందరు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. మండలంలోని బొంతల లక్ష్మణ్ భార్య నాగవ్వ, భూమయ్య భార్య ఎంకవ్వ, ఒకపల్లి లక్ష్మి కుమారుడు చిన్నయ్య, మురిమడుగుకు చెందిన సుజాత భర్త ఇందూర్, నెమలికొండ లింగవ్వ భర్త లింగవ్వ సాధరణ మరణం పొందగా, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కోసం లేబర్ అధికారి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. కానీ ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి, ప్రభుత్వ ఆర్థిక సహాయం వచ్చేందుకు లేబర్ అధికారి ఒకరికి రూ.వెయ్యి అడుగుతున్నారని వారు ఆరోపించారు. అలాగే మురిమడుగుకు చెందిన వినోద, జమునకు ప్రసూతి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే కూడా డబ్బులు అడిగినట్లు వారు పేర్కొన్నారు. అయితే లేబర్ అధికారులు వచ్చినట్లు తెలుసుకున్న వారు వారి ఉన్న గది ముందు నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ అందించే ఆర్థిక సహాయం వచ్చేలా చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న లేబర్ అధికారిపై చర్యలు తీసుకుని, అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు. డబ్బులు అడగలేదు బీమా డబ్బులు ఇవ్వడానికి, ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి తానేమి డబ్బులు డిమాండ్ చేయడం లేదు. దరఖాస్తులో వివరాలు సరిగ్గా లేనందునే ఆలస్యం జరుగుతోంది. - హేమలత, లేబర్ అధికారి