బీమా డబ్బులకు లంచమా..!
లేబర్ అధికారితో కార్మికుల వాగ్వాదం
జన్నారం : భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందజేసే బీమా డబ్బులు ఇవ్వడానికి, ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి లేబర్ అధికారి హేమలత డబ్బులు అడుతున్నారని మండలంలోని భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. బుధవారం కార్మికుల సభ్యత్వ నమోదుకు మంచిర్యాలకు చెందిన లేబర్ అధికారులు హేమలత, రవీందర్ మండలానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు ముల్కల్ల ప్రభాకర్‌తో పాటు కార్మికులందరు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు.
మండలంలోని బొంతల లక్ష్మణ్ భార్య నాగవ్వ, భూమయ్య భార్య ఎంకవ్వ, ఒకపల్లి లక్ష్మి కుమారుడు చిన్నయ్య, మురిమడుగుకు చెందిన సుజాత భర్త ఇందూర్, నెమలికొండ లింగవ్వ భర్త లింగవ్వ సాధరణ మరణం పొందగా, వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కోసం లేబర్ అధికారి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. కానీ ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి, ప్రభుత్వ ఆర్థిక సహాయం వచ్చేందుకు లేబర్ అధికారి ఒకరికి రూ.వెయ్యి అడుగుతున్నారని వారు ఆరోపించారు.
అలాగే మురిమడుగుకు చెందిన వినోద, జమునకు ప్రసూతి డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే కూడా డబ్బులు అడిగినట్లు వారు పేర్కొన్నారు. అయితే లేబర్ అధికారులు వచ్చినట్లు తెలుసుకున్న వారు వారి ఉన్న గది ముందు నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ అందించే ఆర్థిక సహాయం వచ్చేలా చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న లేబర్ అధికారిపై చర్యలు తీసుకుని, అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా చూడాలని కోరారు.
డబ్బులు అడగలేదు
బీమా డబ్బులు ఇవ్వడానికి, ఫైల్ ఆదిలాబాద్ పంపడానికి తానేమి డబ్బులు డిమాండ్ చేయడం లేదు. దరఖాస్తులో వివరాలు సరిగ్గా లేనందునే ఆలస్యం జరుగుతోంది. - హేమలత, లేబర్ అధికారి