Telangana News: ఎలివేషన్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా.. ఘోర ప్రమాదం!
Sakshi News home page

ఎలివేషన్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా.. ఘోర ప్రమాదం!

Published Fri, Sep 8 2023 6:26 AM | Last Updated on Fri, Sep 8 2023 8:47 AM

- - Sakshi

హైదరాబాద్‌: కూకట్‌పల్లి సర్కిల్‌ అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం ఎలివేషన్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా ఆరో అంతస్తుపై ఉన్న పిట్టగోడ కూలిపోయింది. దీంతో భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన గోవా కర్రలు విరిగిపోయాయి. ఈ ఘటనలో కర్రలపై నిల్చుని ప నిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఎలివేషన్‌ కోసం సెంట్రింగ్‌ పనుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. సెంట్రింగ్‌ తొలగిస్తున్న సమయంలో పిట్టగోడ కూలి సానియా బట్నాయక్‌ (19), సామ బట్నాయక్‌ (23), సానియా చలాన్‌ (20)లు మృతి చెందారు. వీరితో పాటు పని చేస్తున్న ముదాబత్‌ నాయక్‌, బలరాం, సుప్రా బట్నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

సామ బట్నాయక్‌, సానియా చలాన్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, సానియా బట్నాయక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవనం పిట్టగోడ కూలిన విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో గురువారం పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ భవనం దాసరి సంతోష్‌, దాసరి సాయిరాం పేరుపై 2022 డిసెంబర్‌ 2వ తేదీన జీ 5 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. అదనంగా మరో ఫ్లోర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారు. ఆ అంతస్తులోనే పని చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

నాణ్యత లేకపోవడంతోనే..
ఆరో అంతస్తుపై పిట్టగోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకోకపోవటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, గోవా కర్రలు తడిచిపోయాయి. పిట్టగోడ కోసం నిర్మించిన సిమెంట్‌ పెళ్లలు గోవా కర్రలపై పడిపోగా అవి విరిగి వాటిపై నిల్చుని పని చేస్తున్న కార్మికులు కింద పడిపోయారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా అంతస్తులు నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముందుగానే అక్రమ అంతస్తులను అధికారులు అడ్డుకొని ఉంటే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావంటున్నారు.

క్రిమినల్‌ కేసులు పెడతాం..
ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి డిప్యూటీ కమిషనర్‌ హరికృష్ణ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురి కార్మికుల మృతికి కారణమైన భవన యజమానులు, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా నిర్మించిన మరో ఫ్లోర్‌ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తామని పేర్కొన్నారు. గతంలోనే రెండుసార్లు భవన యజమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశామని తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ..
ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందడం, ముగ్గురు కార్మికులకు గాయాలు కావటం దురదృష్టకరమని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. భవన యజమాని, బిల్డర్‌, సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement