ఈ రూట్‌ల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో.. | - | Sakshi
Sakshi News home page

ఈ రూట్‌ల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో ట్రైన్ క‌స‌ర‌త్తు!

Published Fri, Dec 15 2023 4:48 AM | Last Updated on Fri, Dec 15 2023 12:51 PM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో అలైన్‌మెంట్‌లపై అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును నిలిపివేస్తూ కొత్తగా ఎల్‌బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు రెండు రూట్‌లను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ కొత్త మార్గాలపై కసరత్తుకు సన్నద్ధమైంది. ఈ రెండు రూట్‌లలో మెట్రో నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైల్‌ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అవసరమైన భూసేకరణ, అలైన్‌మెంట్‌ మార్గం, అంచనా వ్యయం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.

తక్కువ భూసేకరణతో..
ఎల్‌బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పి–7 రోడ్‌ రూట్‌లో, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా, బార్కాస్‌, పహాడీషరీఫ్‌ రూట్‌లో మెట్రో నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఎల్‌బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 20 కిలోమీటర్‌లకు పైగా దూరం ఉంటుంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 12 కి.మీ ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం– శంషాబాద్‌ రూట్‌ 31 కి.మీ ఉంటుంది.

ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రూట్‌లలో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం రూట్‌ కంటే తక్కువ ఖర్చవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరం తక్కువగా ఉండడంతో పాటు పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే ఎయిర్‌పోర్టు రూట్‌ను పొడిగించి ఫార్మాసిటీ స్థానంలో ప్రతిపాదించిన మెగా టౌన్‌షిప్‌ వరకు భవిష్యత్‌లో పెద్దగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.

నిర్మాణంపై ముందుకు సాగేదెలా..?
రాయదుర్గం– శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గాన్ని గత ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌ మెట్రోగా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్‌ రూట్‌లను ఎల్‌అండ్‌టీ సంస్థ పీపీపీ మోడల్‌లో నిర్మించగా ఎయిర్‌పోర్టు మెట్రోను సుమారు రూ.6,250 కోట్లతో సొంతంగా చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

ప్రస్తుత ప్రభుత్వం పాత అలైన్‌మెంట్‌ను నిలిపివేసి కొత్త అలైన్‌మెంట్‌లను ప్రతిపాదించిన నేపథ్యంలో సొంతంగా నిర్మిస్తుందా? లేక ఏదైనా నిర్మాణ సంస్థకు పీపీపీ తరహాలోనే అప్పగిస్తుందా? అనే అంశం స్పష్టం కావాల్సి ఉంది. 31 కి.మీ రాయదుర్గం– శంషాబాద్‌ రూట్‌ను రూ.5,888 కోట్లతో నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే తక్కువ నిధులతోనే ఎల్‌బీనగర్‌– ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత ఎల్‌అండ్‌టీపై ఉంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు కేవలం 12 కి.మీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్‌బీనగర్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించినా రాయదుర్గం రూట్‌ కంటే తక్కువ ఖర్చే అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్‌లలోనే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపడితే నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓల్డ్‌సిటీ మెట్రో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలి. ఈ రెండు రూట్‌లు పూర్తయితే గానీ ఎయిర్‌పోర్టు వరకు విస్తరణ సాధ్యం కాదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో చేపట్టినా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా.

రియల్‌ ఎస్టేట్‌ డీలా పడే ప్రమాదం..
రాయదుర్గం– శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ను నిలిపివేయడం పట్ల ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిరోజూ ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగిస్తారు.

ఈ రూట్‌లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి రానుండడంతోనే ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ భూముల ధరలు పెరిగాయి. కోకాపేట్‌, బుద్వేల్‌ తదితర ప్రాంతాల్లో అనూహ్యమైన రియల్‌ భూమ్‌ కనిపించింది. తాజాగా ఈ రూట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ డీలా పడుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement