Metro tunnel route
-
ఈ రూట్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రో అలైన్మెంట్లపై అధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్‌పోర్టును నిలిపివేస్తూ కొత్తగా ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు రెండు రూట్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కొత్త మార్గాలపై కసరత్తుకు సన్నద్ధమైంది. ఈ రెండు రూట్లలో మెట్రో నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైల్ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అవసరమైన భూసేకరణ, అలైన్మెంట్ మార్గం, అంచనా వ్యయం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. తక్కువ భూసేకరణతో.. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పి–7 రోడ్ రూట్లో, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా, బార్కాస్, పహాడీషరీఫ్ రూట్లో మెట్రో నిర్మాణాన్ని పరిశీలించాలని సీఎం చెప్పారు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 20 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 12 కి.మీ ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం– శంషాబాద్ రూట్ 31 కి.మీ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన రూట్లలో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దూరం తక్కువగా ఉండడంతో పాటు పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు మార్గంలోనే మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. అలాగే ఎయిర్‌పోర్టు రూట్‌ను పొడిగించి ఫార్మాసిటీ స్థానంలో ప్రతిపాదించిన మెగా టౌన్షిప్ వరకు భవిష్యత్‌లో పెద్దగా భూసేకరణ జరపాల్సిన అవసరం లేకుండా మెట్రో నిర్మాణం చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. నిర్మాణంపై ముందుకు సాగేదెలా..? రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాన్ని గత ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ మెట్రోగా నిర్మించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ రూట్లను ఎల్అండ్టీ సంస్థ పీపీపీ మోడల్లో నిర్మించగా ఎయిర్‌పోర్టు మెట్రోను సుమారు రూ.6,250 కోట్లతో సొంతంగా చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాత అలైన్‌మెంట్‌ను నిలిపివేసి కొత్త అలైన్మెంట్లను ప్రతిపాదించిన నేపథ్యంలో సొంతంగా నిర్మిస్తుందా? లేక ఏదైనా నిర్మాణ సంస్థకు పీపీపీ తరహాలోనే అప్పగిస్తుందా? అనే అంశం స్పష్టం కావాల్సి ఉంది. 31 కి.మీ రాయదుర్గం– శంషాబాద్ రూట్‌ను రూ.5,888 కోట్లతో నిర్మించేందుకు ఎల్అండ్టీ, ఎన్సీసీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతకంటే తక్కువ నిధులతోనే ఎల్బీనగర్– ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో నిర్మించాల్సిన బాధ్యత ఎల్‌అండ్‌టీపై ఉంది. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు కేవలం 12 కి.మీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు విస్తరించినా రాయదుర్గం రూట్ కంటే తక్కువ ఖర్చే అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన రూట్లలోనే ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణం చేపడితే నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓల్డ్‌సిటీ మెట్రో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలి. ఈ రెండు రూట్లు పూర్తయితే గానీ ఎయిర్‌పోర్టు వరకు విస్తరణ సాధ్యం కాదు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను సకాలంలో చేపట్టినా ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని అంచనా. రియల్ ఎస్టేట్ డీలా పడే ప్రమాదం.. రాయదుర్గం– శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్‌ను నిలిపివేయడం పట్ల ఐటీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐటీ నిపుణులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రతిరోజూ ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో అందుబాటులోకి రానుండడంతోనే ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ భూముల ధరలు పెరిగాయి. కోకాపేట్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో అనూహ్యమైన రియల్ భూమ్ కనిపించింది. తాజాగా ఈ రూట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డీలా పడుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆత్మహత్యాయత్నం.. మెట్రో సేవలకు బ్రేక్
కోల్‌కతా: ఓ వ్యక్తి మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో.. మెట్రో సేవలకు అరగంటసేపు అంతరాయం కల్గింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది. ఓ మధ్యవయస్కుడు సోమవారం ఉదయం 9.28 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని గీతాంజలి రైల్వే స్టేషన్లో ఎదురుగా వస్తోన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతడిని బయటకు లాగారు. ఈ నేపథ్యంలో ఓ అరగంటపాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత యధావిధిగా కొనసాగాయి. ఇంతకు ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరు.. ఏ కారణం చేత ఆత్మహత్యాయత్నం చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది. -
3 నిమిషాలకో.. మెట్రో!
సాక్షి, హైదరాబాద్: సిటీ జనానికి మెట్రో మరింత అందుబాటులోకి వచ్చింది.. ఇకపై ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్‌పోస్ట్–హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో పీక్ అవర్స్‌లో 3 నిమిషాలు, నాన్‌పీక్ అవర్స్‌లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా మెట్రో సర్వీసులకు గ్రేటర్ సిటీజన్ల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సరాసరిన ప్రతివారం ప్రయాణికుల సంఖ్యలో 5–6 వేల మేర పెరుగుదల నమోదవుతోంది. బుధవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య 3.06 లక్షలకు చేరుకోవడం విశేషం. ఇక స్టేషన్లలో రద్దీని కలిపితే ప్రయాణికుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.), నాగోల్–హైటెక్ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. గురువారం హైటెక్ సిటీ, అమీర్‌పేట్, ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర స్టేషన్లు సైతం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైటెక్ సిటీ–రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ (1.1 కి.మీ.) మార్గంలో మెట్రో పట్టాలు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, స్టేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరులో ఈ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్ రన్ నిర్వహిస్తామని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. ఎంజీబీఎస్–జేబీఎస్ (10 కి.మీ.) మార్గంలో ఈ ఏడాది డిసెంబర్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో పనులు, స్టేషన్లు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుదీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ బుధవారం 24 వేల మంది ప్రయాణికుల రాకపోకలతో సరికొత్త రికార్డు సృష్టించినట్లు హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. మెట్రో రైళ్ల మధ్య అంతరం.. 8 నిమిషాలు.. ఇప్పటి వరకు ఇలా.. 3 నిమిషాలు.. ఇకపై పీక్ అవర్‌లో.. 5 నిమిషాలు..నాన్ పీక్ అవర్‌లో.. -
డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం పూర్తి
రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి వెల్లడి సాక్షి, బెంగళూరు : కబ్బన్ పార్క్ నుంచి మహాత్మాగాంధీ రోడ్ (ఎం.జీ రోడ్) వరకు నిర్మిస్తున్న మెట్రో సొరంగ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మెట్రో సొరంగ మార్గం నిర్మాణం పూర్తవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. శనివారమిక్కడ మెట్రో రైలు అధికారులతో కలిసి సొరంగ మార్గం నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రో సొరంగ మార్గం నిర్మాణంలో ఇప్పటికే 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ట్రాక్ వేసే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తికానున్నాయని, ఏప్రిల్ లేదా మే నెలలో సొరంగ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ రోడ్ నుంచి బయ్యప్పన హళ్లి, మల్లేశ్వరం నుంచి పీణ్యా మెట్రో రైలు మార్గాలు అందుబాటులోకి రావడంతో వేలాది మంది నగరవాసులకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇక రెండో విడతలోని మెట్రో రైలు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భూ స్వాధీన ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్, ఎమ్మెల్యే హ్యారిస్ తదితరులు పాల్గొన్నారు.