పోలీస్ అధికారులకు సూచనలిస్తున్న సీపీ సందీప్ శాండిల్య
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల క్రతువును ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి నగర పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, పక్షపాతానికి తావు లేకుండా కొత్వాల్ సందీప్ శాండిల్య చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కీలక ఎలక్షన్ డ్యూటీల్లో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించారు.
ఎన్నికల విధుల కోసం ఇప్పటి వరకు నగరానికి 11 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు వచ్చాయి. వీటికి నేతృత్వం వహించే కమాండింగ్ ఆఫీసర్లతో సందీప్ శాండిల్య సోమవారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కీలక సమీక్షలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ సైతం పాల్గొన్నారు.
నగరంలో ఉన్న కీలక పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై కేంద్ర బలగాల అధికారులకు అవగాహన కల్పించారు. వీరిని నిఘా, తనిఖీలతో పాటు చెక్‌పోస్టుల్లోనూ వినియోగించాలని నిర్ణయించిన కొత్వాల్ శాండిల్య ఆ అంశాలను వారికి వివరించారు.
ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు, బాధ్యతలను వారికి తెలియజేశారు. ఈ బలగాలకు అవసరమైన సదుపాయాలు, బస ఏర్పాటు చేసే బాధ్యతలను స్థానిక ఏసీపీలకు అప్పగించారు. విధి నిర్వహణ, తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. మరోపక్క ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ జిల్లాను యూనిట్‌గా నిర్ణయించారు.
దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నగర కమిషనరేట్ నుంచి ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. అనేక ఠాణాలకు కొత్త ఇన్‌స్పెక్టర్లు రాగా వీరిలో చాలామంది నగరానికి, ఏరియాకు పూర్తి కొత్త. అత్యంత కీలక పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన ఇన్‌స్పెక్టర్లకు తమ పరిధిలోని ప్రాంతాలపై పట్టు వచ్చేలా చేయాలని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య నిర్ణయించారు.
ఇందులో భాగంగానే ఫ్లాగ్ మార్చ్‌లుగా పిలిచే పాదయాత్రలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంలో కమిషనరేట్‌లో ఉన్న పోలింగ్ బూత్ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు.వీటిలో పోలింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటారు.
మరోపక్క పోలింగ్ స్వేచ్ఛగా జరుగుతుందని ప్రజల్లో స్థైర్యాన్ని నింపడంతో పాటు అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికీ భారీ కసరత్తులు చేస్తారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్‌మార్చ్‌లుగా పిలిచే కవాతులను పోలింగ్ ముగిసే వరకు నిర్వహించనున్నారు. కేంద్ర బలగాలతో కలిసి చేసే ఈ కవాతులు చేయాలని అధికారులకు కొత్వాల్ స్పష్టం చేశారు.
తమ పరిధిలో ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? ఎటు నుంచి అసాంఘికశక్తులు విరుచుకుపడే అవకాశం ఉంది? అనే అంశాలపై ఇన్‌స్పెక్టర్లకు పట్టుండాల్సిందేనని కొత్వాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment