నిందితుడు సెబి డిసిల్వా
హైదరాబాద్: తాను బ్రెజిల్‌కు చెందినవాడినని, హైదరాబాద్ పర్యటనకు రాగా తన పర్సుతో పాటు ల్యాప్‌టాప్ కూడా చోరీ అయిందని ఈ నెల 7వ తేదీన అచ్చు విదేశీ యువకుడిలాగా ఉన్న ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. జూబ్లీహిల్స్ డీఐ వీరశేఖర్ సదరు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు సరైనదేనని నమ్మి పర్సు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆ ప్రాంతానికి వెళ్లి రోజంతా సీసీ ఫుటేజీలు వెతికారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. తనకు తినడానికి కూడా డబ్బులు లేవని ఆ యువకుడు చెప్పగా రూ.500 ఇచ్చి పంపించారు.
ఆ మరుసటి రోజు భువనగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అదే యువకుడు తన పర్సు పోయిందని, తాను అమెరికా నుంచి వచ్చానని అక్కడ పోలీసులకు చెప్పగా రోజంతా వారు కూడా సీసీ ఫుటేజీలు వడపోశారు. ఖర్చులకు డబ్బులు లేవని చెప్పగా రూ.1500 ఇచ్చి పంపారు. తాజాగా ఈ నెల 9న అదే యువకుడు మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన పర్సు పోయిందని ఫిర్యాదు చేశాడు. తిండికి డబ్బులు లేవని చెప్పడంతో జాలిపడ్డ అక్కడి పోలీసులు రూ.1000 ఇచ్చి పంపించారు.
తీరా ఈ యువకుడి గురించి ఆరా తీస్తే గోవాకు చెందిన సెబీ డిసిల్వాగా గుర్తించారు. సదరు యువకుడు అచ్చం విదేశీ పోలికలతో ఉండటంతో పోలీసులు కూడా విదేశీయుడనే భ్రమపడి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టేవారు. ఖర్చుల కోసం అడిగితే డబ్బులు కూడా ఇచ్చారు. తీరా సదరు యువకుడి గురించి లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు గోవాకు చెందిన వాడని, ఇలాగే రాజస్థాన్, బీహార్, గోవాలలో మోసాలకు పాల్పడి రిమాండ్ అయినట్లు తేలింది.
రోజువారి ఖర్చుల కోసం ఇలాగే పర్సు పోయిందని ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తూ ఎంతో కొంత పోలీసుల నుంచే తీసుకొని రోజులు గడిపేస్తున్నట్లుగా తేలింది. ఈ సరికొత్త వసూళ్ల పథకం గురించి తెలుసుకున్న పోలీసులు నోరెళ్లబెడుతున్నారు. పోలీసులకు టోకరా వేస్తున్న వైనం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ముందు ఈ యువకుడు పర్సు పోయిందని, ల్యాప్‌ట్యాప్ పోయిందని ఫిర్యాదు చేస్తే నమ్మవద్దని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment