తన భార్యను దూరం చేశాడని.. తమ్ముడిని కిరాతకంగా! | Hyderabad: Man Kills His Brother With A Knife Over A Personal Grudge In Film Nagar - Sakshi
Sakshi News home page

తన భార్యను దూరం చేశాడని.. తమ్ముడిని కిరాతకంగా!

Published Fri, Oct 6 2023 7:02 AM | Last Updated on Fri, Oct 6 2023 11:54 AM

- - Sakshi

హైదరాబాద్‌: తన భార్యను వేధింపులకు గురి చేయడమే కాకుండా తనకు దూరం చేశాడని అక్కసుతో తమ్ముడిని హత్య చేసిన అన్నను ఫిలింనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌లోని బసవతారకం నగర్‌ బస్తీలో నివసించే ఎం.డి.సజ్జి అహ్మద్‌(38) వెల్డర్‌గా పని చేస్తుంటాడు. అహ్మద్‌ మద్యానికి బానిసై భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఆరు నెలల క్రితం ఆమె పిల్లలతో సహా భర్తను వదిలేసి వెళ్లపోయింది.

భార్య వెళ్లిపోయిన తర్వాత తన అన్న షబ్బీర్‌ అహ్మద్‌తోనే ఉంటున్నాడు. అప్పటి నుంచి షబ్బీర్‌ అహ్మద్‌ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒకే గదిలో భర్త, మరిది, మామతో కలిసి ఉండటం ఇష్టం లేని ఆమె రెండు నెలల క్రితం భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు ఇంటికి రావాలని భర్త షబ్బీర్‌ విజ్ఞప్తి చేసినా ఆమె మీ తమ్ముడి వేధింపులు భరించలేకపోతున్నానని ఆ ఇంట్లో ఉండలేనని కరాఖండిగా చెప్పేసింది.

తన భార్య తన వద్దకు రాకపోవడానికి తమ్ముడే కారణమని షబ్బీర్‌ కక్షపెంచుకున్నాడు. ఎలాగైనా అంతం చేయాలని గత కొద్ది రోజుల నుంచి పథకం వేశాడు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి తమ్ముడు సజ్జి అహ్మద్‌కు పీకలదాకా మద్యం తాగించాడు. మద్యం మత్తులో నిద్రపోతున్న తమ్ముడిని బుధవారం తెల్లవారుజామున ఓ బల్లపై పడుకోబెట్టి కూరగాయల కత్తితో మెడను కోశాడు. ఇంకా ఊపిరి ఉందని భావించి బోర్లా పడుకోబెట్టి వెనుక నుంచి మెడపై మరోసారి కత్తితో కొశాడు.

రక్తపు మడుగులో సజ్జీ అహ్మద్‌ విలవిల్లాడుతూ అక్కడికక్కడే కన్నుమూశాడు. తన తమ్ముడిని కూరగాయల కత్తితో మెడకోసి హత్య చేశానని నిందితుడు షబ్బీర్‌ పోలీసులకు గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఫోన్‌ చేసి చెప్పాడు. ఫిలింనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు వచ్చిన తర్వాత మద్యం మత్తులో ఉన్న షబ్బీర్‌ గురకపెట్టి నిద్రపోతుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement