మీర్‌పేట: ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కష్టపడి చదివి పోలీసు కానిస్టేబుల్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయింది.. త్వరలో ప్రకటించే తుది జాబితాలో కుమారుడు ఎలాగైనా ఉద్యోగం సాధించి ఆసరాగా ఉంటాడనుకున్న ఆ తల్లిదండ్రులకు చివరికి శోకమే మిగిలింది. రోజంతా కళ్లముందే ఉన్న కొడుకు బయటకు వెళ్లిన కాసే పటికే తిరిగిరాని లోకాలకు చేరడంతో వారి వేదనకు అంతులేకుండా పోయింది.
ఏం జరిగిందంటే..
మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి సర్వోదయనగర్ కాల నీకి చెందిన కృష్ణ, నాగమణి దంపతులు. కృష్ణ ప్లంబర్‌గా, నాగమణి ఓ పాఠ శాలలో ఆయాగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు సాయి వరప్రసాద్ (22) గత సంవత్సరం డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కొడుకు సాయి నితిన్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. సాయి వరప్రసాద్ ఇటీవల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు.
ఆదివా రం రాత్రి 12 గంటలకు తన స్నేహితుడైన సాయి యాదవ్‌తో కలిసి మద్యం తెచ్చుకునేందుకు నందనవనం వైపు వెళ్లి తిరిగి వస్తుండగా జిల్లెలగూడ స్వాగత్‌గ్రాండ్ వద్ద ఉన్న నితీష్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, మనోహర్, కిరణ్‌తో పాటు మరికొందరు అడ్డగించారు. బీర్ బాటిళ్లు తమకు ఇవ్వాలని వారించడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నితీష్‌గౌడ్ తన వద్ద ఉన్న కత్తితో వరప్రసాద్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా..
మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహి తులు మంగళవారం సాయంత్రం జిల్లెలగూడ స్వాగత్‌గ్రాండ్ చౌరస్తా వద్దకు చేరుకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. వరప్రసాద్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పోలీసులు, స్థానిక నాయకులు నచ్చజెప్పినా బంధువులు భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితారెడ్డి బంధువులతో ఫోన్‌లో మాట్లాడి మృతికి కారకులైన వారికి శిక్ష పడేలా చుస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘటనకు సంబంధించి నితీష్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, మనోహర్, కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment