సాక్షి, సిటీబ్యూరో: సీఎల్పీ నేతగా ఎన్నికై న రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు విభాగం పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్టేడియం కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిపై ఉండే ప్రముఖుల వివరాల ఆధారంగా బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం స్టేడియంలోకి వెళ్లిన సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, మాజీ కొత్వాల్ సీవీ ఆనంద్ సహా ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచే బందోబస్తు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. దీనికోసం పోలీసు విభాగం దాదాపు 2 వేల మందిని వినియోగిస్తోంది. బుధవారం మధ్యాహ్నం స్టేడియం వద్దకు వచ్చిన బలగాలు రిహార్సల్స్ సైతం పూర్తి చేశాయి.
ఏర్పాట్లు ఇలా..
జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మార్గాలను ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేయిస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించనున్నారు. రూఫ్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
ఎల్బీ స్టేడియంలో కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి అమలులో ఉండనున్నాయి. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 90102 03626లో సంప్రదించాలని ట్రాఫిక్ చీఫ్ సూచించారు. వీఐపీలు, ఆహుతులతో పాటు సాధారణ ప్రజల కోసం ఆరు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు.
► నిర్ణీత సమయాల్లో సాధారణ వాహన చోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్‌్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment