హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సీఎంగా గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం ఉంది. పుట్టి పెరిగింది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో అయినా.. తనకంటూ రాజకీయ గుర్తింపు తెచ్చుకుంది మాత్రం నగరంలోనే. బర్కత్‌పుర రెడ్డి కళాశాల పక్కవీధిలో నివసించడంతో పాటు ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించారు.
1991 నారాయణగూడలో ఉన్న జాగృతి వార పత్రికలో లే అవుట్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. 1992లో దోమలగూడ ఏవీ కాలేజీలో బీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన ఏబీవీపీలో చురుగ్గా పని చేశారు. జైపాల్‌రెడ్డి సోదరుడి కుమార్తెతో ప్రేమ పెళ్లికి కూడా నగరమే వేదికై ంది. అప్పటి వరకు బర్కత్‌పురలో నివసించిన రేవంత్ ఆ తర్వాత జూబ్లీహిల్స్‌కు మారారు. ఆయన సతీమణి స్వగ్రామం కూడా రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలమే కావడం విశేషం.
అంచెలంచెలుగా..
1999లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి పాలక మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ తరపున సీఎం అవుతున్న రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌తోనే మొదలైంది. 2006లో సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి.. అంచెలంచెలుగా ఎదిగారు. కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించి.. అది దక్కకపోవడంతో పార్టీని వీడి 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2009లో కొడంగల్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏకంగా హైదరాబాద్ నగరంతో అవినాభావ సంబంధం ఉన్న వ్యక్తే సీఎం కాబోతుండటంతో ఈ గ్రేటర్‌కు ఢోకా లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment