నిందితుడు బాలకోటయ్య
హైదరాబాద్: ఆస్తి మొత్తం తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని, తనను దూరం పెడుతూ ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని భార్యపై కోపం పెంచుకుని ఆమెను బండరాయితో మోది హత్య చేసిన కేసులో నిందితుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం ఎల్‌బీనగర్ డీసీపీ డీసీపీ సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. అబ్దులాపూర్‌మెట్ మండలం, మునగనూర్‌కు చెందిన బాల కోటయ్యకు 2008 లో శాలినితో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కుమారులు. కొద్ది రోజులుగా వారు ఇంజాపూర్ గ్రామం, అంజనాపురికాలనీ నివాసం ఉంటున్నారు. కాగా గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇరువర్గాల పెద్దలు పంచాయతీ చేసి వారికి సర్ది చెప్పారు. అయితే బాలకోటయ్య ఎప్పుడు భార్య శాలినిని శారీరకంగా వేధించేవాడు. దీంతో ఆమె గత జూలై నెలలో ఇద్దరు కుమారులతో కలిసి వనస్థలిపురం శతవాహననగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి అక్కడే ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది.
తనను దూరం పెట్టి, పిల్లలను తన వద్దకు రానివ్వడం లేదని, ఆస్తులు ఆమె పేరునే రిజిస్ట్రేషన్ చేసుకున్నదని భార్యపై కోపం పెంచుకున్న బాలకోటయ్య ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం శాలిని తల్లిదండ్రులు వారి సొంతూరికి వెళ్లడంతో అదే అదనుగా భావించిన ఈ నెల 6న సాయంత్రం శాలిని స్కూటీపై వస్తుండగా విజయపురి కాలనీలోని సాయిబాబా గుడి సమీపంలో బాలకోటయ్య ఆమెను అడ్డుకుని దాడి చేశాడు.
అమె బైక్ పైనుంచి కింద పడగానే పక్కనే ఉన్న బండ రాయితో ఆమె తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన వనస్థలిపురం పోలీసులు ఆదివారం సూర్యపేట టౌన్ బస్ స్టాప్‌లో నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్ధలిపురం సీఐ జలేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment