హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వెల్లడి
జిల్లా కోర్టు ఆవరణలో 12 కోర్టు భవనాల నిర్మాణానికి భూమిపూజ
జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని సూచన
కరీంనగర్ క్రైం: రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణంలో కరీంనగర్ నుంచి తెప్పించిన బండను వాడుతున్నామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర కలదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన కోర్టు భవనాల సముదాయానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే సీతారాంపూర్ రోడ్డు లో జడ్జీల నూతన నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కో ర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు. అందుకు న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కేసుల విచారణలో అనవసర వాయిదాల ను నివారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు పరిపాలనా జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వినోద్‌కుమార్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణకుమార్ మాట్లాడారు.
అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి.నవీన్‌రావుతోపాటు వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పి.గోపాలకృష్ణ, కె.మాధవరావు, జి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వరరావు, జి.హనుమంతరావును చీఫ్ జస్టిస్ సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, న్యాయమూర్తులు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ఆర్డీవో మహేశ్వర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యే ముందు చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులంతా మంకమ్మతోటలోని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment