Tourisam Department
-
MahaKumbh 2025: టూర్ గైడ్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వెండర్లు, సెయిలర్లకు శిక్షణ
2025, జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేళాకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా జనం తరలిరానున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకశాఖ అధికారులు(Tourism officials) ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రయాగ్‌రాజ్ చారిత్రక వైశిష్ట్యాన్ని తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ టూర్ గైడ్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వెండర్లు, సెయిలర్లకు శిక్షణ అందిస్తున్నారు. వీరు కుంభమేళాకు తరలివచ్చే పర్యాటకులకు సహకారం అందించనున్నారు.లక్నోలోని కాన్షీరామ్ టూరిజం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్తో పాటు మరో సంస్థతో టూరిజం శాఖ ఎంవోయూ కుదుర్చుకుని ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నదని ప్రాంతీయ పర్యాటక అధికారి అపరాజిత సింగ్ చెప్పారు. పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకే ఈ శిక్షణా కార్యక్రమాన్ని నాలుగు కేటగిరీలుగా విభజించి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గైడ్ శిక్షణ కార్యక్రమం ఐదు రోజుల పాటు ఉంటుందని ట్రైనింగ్ డైరెక్టర్ ప్రఖర్ తివారీ తెలిపారు. ఈ గైడ్లకు ప్రథమ చికిత్స(First aid)పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణతో పాటు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తున్నారు. పర్యాటకులతో ఎలా ప్రవర్తించాలనేదానిపై కూడా పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత(Plastic-free) కుంభమేళాపై పర్యాటకులకు వివరించాలని అధికారులు శిక్షణార్థులకు తెలియజేస్తున్నారు. కాగా వివిధ విభాగాల్లో మొత్తం 4,200 మందికి శిక్షణ ఇవ్వాలని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 360 మంది సెయిలర్లు, 451 మంది ట్యాక్సీ డ్రైవర్లు, 871 మంది గైడ్లు ఇప్పటికే శిక్షణ పొందారు.ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న వారికి ప్రజారోగ్యం, పరిశుభ్రత, సీపీఆర్‌పై కూడా శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ పుష్కర్ త్రిపాఠి తెలిపారు. మరోవైపు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. భరద్వాజ ఆశ్రమం కారిడార్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే ఆలోప్ శంకరి ఆలయం, పాండేశ్వర్ మహాదేవ్, మంకమేశ్వర్ ఆలయం, దశాశ్వమేధ ఆలయాలలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచారు.ఇది కూడా చదవండి: New Year Celebration: రాజధాని సిద్ధం.. వేడుకలకు జనం సన్నద్ధం -
భారత్ ఎఫెక్ట్.. మాల్దీవుల ప్రభుత్వానికి మరో షాక్!
మాలే: మాల్దీవుల ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. మాల్దీవుల మంత్రులు, నేతలు.. భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా భారతీయులు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా, మాల్దీవుల పర్యాటకం కోసం వెళ్లే భారతీయులు సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వివరాల ప్రకారం.. భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు మరోసారి షాక్ తగిలింది. భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. దీంతో, మాల్దీవుల పర్యాటక మార్కెట్లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను ప్రధాని మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పర్యాటకులు లక్షద్వీప్‌లో పర్యటించాలని కోరారు. ఇక, ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు భారత్ ఆతిథ్యంపై అక్కసు వెళ్లగక్కారు. దీంతో, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతీసే స్థాయికి చేరింది. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
బొర్రా గుహలకు మెట్రో గేటు
అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రం, సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు సరికొత్తగా సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నాయి. ఇక్కడికి దేశ విదేశాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తుంటారు. వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పర్యాటక శాఖ అధునాతన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆన్లైన్ ఈ–పోస్ టికెట్ల ద్వారా గుహలు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీ పెరిగే కొద్దీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో గుహలు ముఖద్వారం వద్ద కొత్తగా మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు మూడు, బయటకు వచ్చేటప్పుడు మూడు గేట్లు చొప్పున అమర్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రూ. 12 లక్షల వరకు వెచ్చిస్తోంది. తాజాగా టెక్నీషియన్లు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ప్లాట్‌ఫాం నిర్మించిన వెంటనే మెట్రో గేట్లను ఏర్పాటు చేస్తారు. గుహలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల్లో పెద్దలకు రూ. 70, చిన్నపిల్లలకు రూ. 50 చెల్లిస్తే మాగ్నెటిక్స్ కాయిన్స్ ఇస్తారు. వీటిని చూపించగానే గేటు తెరుచుకుంటుంది. గుహలను తిలకించి తిరిగి బయటకు వచ్చేందుకు మరోసారి చూపించాలి. త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పాత టికెట్ల ధరలు అమలులో ఉన్నట్లు పర్యాటక శాఖ సిబ్బంది తెలిపారు. (చదవండి: విశాఖ పోర్టుకు రికార్డు స్థాయిలో క్రూడాయిల్) -
టూరిజం శాఖ ఆదాయం పెంచుతా..!!
-
కాళేశ్వరంలో పడవ ప్రయాణం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అధునాతమైన బోటు అందుబాటులోకి రానుంది. ఈ బోట్‌ను రూ.2 కోట్ల వ్యయంతో సిద్ధం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మహదేవపూర్ మండలం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ నుంచి కాలేశ్వరం వరకు 22 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ నిల్వ ఉంటోంది. దీంతో ఇక్కడ గోదావరి సముద్రాన్ని తలపిస్తోంది. ఆ నీటి ఉధృతిలో అతిపెద్ద బోటు ఏర్పాటు చేస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చనే ఉద్దేశంతో పర్యాటక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల్లో అందుబాటులోకి.. ఫిబ్రవరి మొదటి వారం నుంచి కాళేశ్వరంలోని గోదావరి తీరంవద్దే 300 మంది కూలీలతో బోటును తయారు చేయించనున్నారు. ఇందుకోసం ఏపీ నుంచి కార్మికులను రప్పించే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు సమాచారం. అధునాతన పరిజ్ఞానంతో సిద్ధం చేయించనున్న ఈ బోట్లో ఏసీ, నాన్ ఏసీ గదులు ఉంటాయని తెలిసింది. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉండడంతో పర్యాటక శాఖ ఆ వైపుగా దృష్టి సారించింది. బోట్ సిదమయ్యాక కాళేశ్వరం నుంచి లక్ష్మీ బ్యారేజ్ వరకు ప్రయాణం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాదారం. మూడు నెలల్లో బోట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టూరిజం శాఖ ఉద్యోగులు తెలిపారు. చిన్నచిన్న వేడుకలతో పాటు విందులు చేసుకునేలా 200 మంది ప్రాణం చేసేందుకు వీలుగా బోట్ ఉంటుంది. బోటు కాళేశ్వరంలో తిరగడం ఆరంభిస్తే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. -
వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి 12 ప్రాంతాలలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి డిపీఆర్‌లు సిద్దం చేసినట్లు పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస రావు తెలిపారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పస్తామన్నారు. కోవిడ్ కారణంగా గత ఆరు నెలలలో రాష్ట్ర పర్యాటక శాఖ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రం సూచనల మేరకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్క్ లు, మ్యూజియంలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. ఉడాకి పూర్వ వైభవం తీసుకువస్తామని, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగిస్తామని తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోపు ఎన్ఎడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. (చదవండి: పర్యాటకానికి మరింత ఊతం) రుషికొండలో బోటింగ్ పాయింట్‌ను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో విశాఖ జిల్లాల్లోని అయిదు చోట్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విదేశీ పర్యాటకులని ఆకర్షించే విధంగా బౌద్దారామాలనుని అభివృద్ది చేసి, పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేగాక ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, బీచ్ టూరిజంలపై కూడా దృష్టి సారించామన్నారు. పర్యాటక కొత్త పాలసీ ప్రకారం టూరిజం ఆపరేటర్లు ప్రభుత్వం దగ్గర లైసెన్స్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. -
టూరిజం బోటింగ్ పునఃప్రారంభం
సాక్షి, విశాఖ: టూరిజం బోటింగ్ పున:ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ, హార్బర్ వద్ద నిర్వహిస్తున్న టూరిజం బోటింగ్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం రుషికొండ బీచ్ వద్ద బోటింగ్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గధామమైన విశాఖలోని రిషికొండలో నాలుగు పర్యాటక బోట్లను మంత్రి ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పర్యాటక బోట్ల నిర్వాహకులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. స్పీడ్, జెట్ స్కీ బోట్లు, లైఫ్ గార్డుల శిక్షణ, పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు, బీమా సౌకర్యంతో జల విహారాన్ని ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు నేటి నుంచి జల విహారం అందుబాటులోకి వచ్చింది. కాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు పడవ ప్రమాదం తర్వాత బోట్ల రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. -
రాయల్ వశిష్టకు అనుమతి లేదు...
-
రాయల్ వశిష్టకు అనుమతి లేదు...
సాక్షి, అమరావతి: గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్ వశిష్ట బోటును ప్రయివేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప్పుతున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగింది. సహాయక చర్యలకు రంగంలోకి దిగిన హెలికాఫ్టర్ ఇందుకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లను సంఘటనా స్థలానికి పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం మంత్రి అవంతి ...విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఉదయభాస్కర్, ఝాన్సీరాణి అనే బోట్లు ప్రమాదానికి గురై అనేకమంత్రి ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలకు హోంమంత్రి ఆదేశం అలాగే బోటు ప్రమాదంపై హోంమంత్రి సుచరిత ఆరా తీశారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గల్లంతు అయినవారి కోసం గాలించి సరక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా లాంచీ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ ముత్యాల రాజుతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో పాపికొండలకు విహార యాత్రకు వెళుతున్న పర్యాటక బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 61మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 27మంది సురక్షితంగా బయటపడగా, పలువురు గల్లంతు అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బ్రేకింగ్ : గోదావరిలో పడవ మునక -
సహాయక చర్యలకు హోంమంత్రి ఆదేశం
-
వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి
సాక్షి, వైజాగ్: ఉత్తరాంధ్రకు గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం ఓ రికార్డ్ అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. శుక్రవారం అరకులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమెతో పాటు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. రాజకీయ చరిత్రలో మొదటిసారిగా ఓ గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలనుందని తెలిపారు. గిరిజనులు అమాయకులనీ, ప్రకృతిని కాపాడుతూ అందరూ జీవించేలా చేస్తున్నారని అభినందించారు. బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన కొనియాడారు. మరోవైపు పర్యాటక శాఖలో 75 శాతం ఉద్యోగాలను గిరిజనులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పాడేరు ఎమ్మేల్యే భాగ్యలక్ష్మిమాటల్లో.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పాడేరులో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన సీఎంకు గిరిజనులు ఎప్పటికీ రుణపడి ఉంటారననారు. గిరిజులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అనంతరం డిప్యూటీ సీఎం విద్యార్థులకు లాప్‌టాప్‌లు, డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. -
పర్యాటకం.. పచ్చి బూటకం..
సాక్షి, కొవ్వూరు: గోదావరి అందాలతో మనసు పులకిస్తుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యాలు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన పాపికొండలు చూపరులకు కనువిందు చేస్తాయి. గోదారిపై నిర్మించిన వంతెనలు గోదారమ్మకు మణిహారాలను తలపిస్తాయి. ఏటా ఈ ప్రాంతంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు. గోదావరి తీరాన్ని పర్యాటక హబ్‌గా మార్చుతామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు గుప్పించారు. కొవ్వూరు–రాజమండ్రి మధ్య ఉన్న పాతరైలు వంతెనని పాదచారుల వంతెనగా మార్చుతామన్న హామీ నేటికీ అమలుకి నోచుకోలేదు. దొంగరావిపాలెం, పెద్దమల్లంలో రిసార్ట్స్ వద్ద సౌకర్యాలు లేమి వెంటాడుతోంది. కొవ్వూరులో చేపట్టిన రిసార్ట్స్ నిర్మాణం అసంపూర్తిగా మిగిలి మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న పాపికొండల టూరిజం పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. అందని బిల్లులు... అసంపూర్తిగా పనులు కొవ్వూరులో పాత రైలు వంతెన సమీపంలో గోదావరి ఒడ్డున పర్యాటక శాఖ చేపట్టిన రిసార్ట్స్, రెస్ట్ రూములు, హోటల్ తదితర నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 9.90 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.7.75 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. ఏడాది క్రితమే పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థకి ఇంత వరకు బిల్లులు అందలేదు. సుమారు రూ. 2.80 కోట్లు విలువైన పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో ఆరు నెలల క్రితమే పనులు నిలిచిపోయాయి. పనులు అసంపూర్తిగా ఉండడంతో నేడు మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. లక్షల వ్యయం... నిర్వహణపై నిర్లక్ష్యం గోదావరి పుష్కరాల సమయంలో పర్యాటక శాఖ కొవ్వూరులో రూ.84 లక్షలు వెచ్చించి నిర్మించిన పర్యాటకుల విశ్రాంతి భవనాలు నిరుపయోగంగా మారాయి. ఐదేళ్లుగా ఈ భవనాల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో లక్షల వ్యయంతో నిర్మించిన విశ్రాంతి గదులు, భవనం అక్కరకు రాకుండా పోయాయి. కేవలం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి విచ్చేస్తుంటారు. ఈ భవనం గోష్పాద క్షేత్రంలో నిర్మించి ఉంటే అక్కరకు వచ్చేది. అనాలోచితంగా సుబ్రమణ్య స్నానఘట్టం వద్ద ఈ భవనం నిర్మాణం చేశారు. దీని నిర్వహణ పట్ల పర్యాటక శాఖ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. గోదావరి టూరిజానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ చంద్రబాబు ప్రకటనలు గుప్పించడం తప్ప ఇటువంటి భవనం వినియోగంలోకి తీసుకురావడం పట్ల శ్రద్ధ చూపడం లేదు. దీంతో కింది అంతస్తుని జాలర్లు పడవలు, వలలు భద్రపరుచుకోవడానికి వాడుకుంటు న్నారు. పై అంతస్తు ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ సామాన్లు అన్నీ అపహరణకు గురయ్యాయి. రూములకు, టాయిలెట్స్‌కు ఏర్పాటు చేసిన తలుపులు సైతం అపహరించుకుని పోయారు. టాయిలెట్స్‌లో సింక్‌లను ఆకతాయిలు ధ్వంసం చేశారు. దీంతో రూ.84 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పర్యాటకుల విశాంత్రి భవనం అక్కరకు రావడం లేదు. పాపికొండల విహారంపై నిర్లక్ష్యం జిల్లాలో ప్రధానంగా గోదావరి పాపికొండల అభయారణ్యం విహారయాత్రకు మంచి ప్రదేశం. గోదారిలో సుమారు యాభై బోట్లు నిత్యం పర్యాటకులను పాపికొండలకు తీసుకెళ్తున్నాయి. భద్రాచలం–పాపికొండల అభయారణ్యం ప్యాకేజీలో భాగంగా గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు రాజమండ్రి నుంచి రావాల్సి వస్తుంది. ఇక్కడి బోటు టూరిజం, రవాణా, హోటళ్లు, లాడ్జీలు వంటి ద్వారా నెలకి రూ.కోట్లలోనే ఆదాయం వస్తుంది. సుమారు రెండు వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది. పోలవరం, పట్టిసీమ ప్రాంతాల్లో పర్యాటకులకు అన్నీ సదుపాయాలు సమకూర్చితే ఇక్కడి స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేవలం గత పుష్కరాల సమయంలో పట్టిసీమలో ఒక్క విశాంత్రి భవనం మాత్రమే ప్రభుత్వం నిర్మాణం చేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి పోలవరం ప్రాజెక్టు, పాపికొండల వరకు గోదావరి తీరాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఐదేళ్లలో చేసింది మాత్రం శూన్యం. పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో, ఆచంట మండలం పెద్దమల్లంలో రూ.80 లక్షలతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్స్ నిర్మాణం చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం, బోట్ షికార్ వంటివి సమకూర్చక పోవడంతో అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. పెద్దమల్లం వెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అంతంత మాత్రంగానే వినియోగిస్తున్నారు. కొవ్వూరులో బోట్ టూరిజం ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఆదరణ ఉన్న గోదావరి టూరిజాన్ని చంద్రబాబు సర్కారు పూర్తి నిర్లక్ష్యం చేసింది. అటకెక్కిన పాదచారుల వంతెన హామీ హేవలాక్ వంతెన (పాతరైలు వంతెన)ని పాదచారుల వంతెనగా మార్చి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ఎంపీ మాగంటి మురళీమోహన్ హామీ కార్యరూపం దాల్చలేదు. మూడేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలతోనే కాలక్షేపం చేస్తున్నారు. గత ఏడాది ఈ రైలు వంతెనని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్టు ఎంపీ ప్రకటించారు. త్వరలోనే పనులకు శ్రీకారం చుడతారని, నిధులు కుడా మంజూరైనట్లు చెప్పుకొచ్చారు. ఇంత వరకు ఆ ప్రక్రియకి అతీగతీ లేదు. 1997 మార్చి 12 నుంచి ఈ వంతెనపై రాక పోకలు నిలిపివేశారు. వంతెనపై ఉన్న ఇనుముని రైల్వే శాఖ తుక్కుగా విక్రయించాలని ప్రయత్నించింది. దీనిపై ఉభయ గోదావరి జిల్లా వాసులు ఎన్నో ఉద్యమాలు చేయడంతో అప్పట్లో రైల్వే శాఖ తమ ప్రయత్నాన్ని విరమించుకుంది. దీన్ని పాదచారుల వంతెనగా మార్చాలని డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు. గోదావరి మధ్యలో ఇసుక తిన్నెలపై తాత్కాలిక రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వంతెనపై చిరు వ్యాపారుల హాకర్స్ జోన్‌గా ఏర్పాటు చేయాలని భావించారు. గోదావరి తీరాన్ని పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు హామీ అమలుకి నోచుకోలేదు. గోష్పాదక్షేత్రంతో పాటు రోడ్డు కం రైలు వంతెన, ఆర్చ్ రైలు వంతెన, పాతరైలు వంతెన, నాలుగో రోడ్డు వంతెన, ధవళేశ్వరం ఆనకట్ట వంటి నిర్మాణాలు ఈ ప్రాంతాన్ని కనువిందు చేస్తాయి. బోట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్న ప్రకటన అమలుకి నోచుకోలేదు. చంవ్రబాబు, ఎంపీ మురళీమోహన్ ప్రకటనలు కార్యరూపు దాల్చక పోవడంతో నేడు మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. -
భలే భలే భాగ్యనగరం
సమ్మర్లో విదేశాలకో..ఇతర రాష్ట్రాలకో టూర్ వెళ్దామనుకున్నా కుదరలేదా...అయితేనేం చింతించకండి. మన భాగ్యనగరంలోనూ చూడాల్సిన ప్రదేశాలు...తెలుసుకోవాల్సిన విశేషాలెన్నో ఉన్నాయి. ఈ వేసవిలో మన నగరంలో కుటుంబ సమేతంగా వెళ్లి చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ గురించి ప్రత్యేక కథనం... సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప నగరం.. ఈ పేరు వింటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది చార్మినార్.. ఇదొక్కటేనా ఇంకేమీ లేవా అంటే బోలెడు..! వీటిలో మీరెన్ని చూశారు అని ఎవరైనా అడిగితే నోరెళ్లబెడతాం. నగరంలో కాలంతోపాటు పరుగెత్తుతూ సిటీ అందాలను, చారిత్రక నేపథ్యాన్ని మరచిపోయాం. కనీసం ఈ వేసవిలో అయినా భాగ్యనగరం అందాలను చూసొద్దాం గోల్కొండ కోట గోల్కొండ కోట అందాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక అమితాబ్ బచ్చన్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో సాగే సౌండ్స్ అండ్ లైట్ షో చూడటం గుర్తుండిపోతుంది. గోల్కొండ కోటకు వెళ్లే దారిలో నగీనా గార్డెన్, రామదాసు బందీఖానా, కోటపై దర్బార్ హాల్ కూడా ఉన్నాయి. సాగర్‌లో షికార్ హుసేన్సాగర్ సిటీకే తలమానికం.. ట్యాంక్‌బండ్‌పై నడుచుకుంటూ వెళితే ఆ అనుభూతే వేరు.. ఇక బోటు షికారు చేస్తే ఆనందమే.. ఆనందం.. అందుకోసం అధికారులు బోట్లను ఏర్పాటు చేసింది. వాటిలో సాగర్ చుట్టూ తిరిగి రావచ్చు. స్పీడ్ బోట్లో అలలపై అలవోకగా తేలియాడొచ్చు. భారీ బుద్ధుడి విగ్రహాన్ని వీక్షించవచ్చు. ఖిల్వత్ ప్యాలెస్ .. చౌమహల్లా నగరంలోనే కాక దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రఖ్యాతి గాంచింది చౌమహల్లా ప్యాలెస్. 12 ఎకరాల్లో ఈ మహల్ విస్తరించి ఉంది. ప్యాలెస్‌లోని ఉద్యానవనం, వాటర్ ఫౌంటేన్లు సందర్శకులను కట్టిపడేస్తాయి. పురానీ హవేలీ రాచరికపు వైభావానికి ప్రతీకగా కుతుబ్‌షాహీల ప్రధాన మంత్రి నివాస గృహంగా గుర్తింపు పొందిన పురానీ హవేలీ సాలార్జంగ్ మ్యూజియం సమీపంలో ఉంది. యూ ఆకారంలో ఉన్న ఈ రాజ భవనంలో అనేక విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక భాగాన్ని మ్యూజియంగా రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత నిజాం వార్డ్రోబ్ మ్యాన్యువల్ లిఫ్ట్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. 30 నిమిషాల పాటు ప్రదర్శనలో విశేషాలు వీక్షించే అవకాశం ఉంది. చార్మినార్ దీన్ని 1591లో నిర్మించారు. ఈ కట్టడ నిర్మాణానికి సున్నం మాత్రమే ఉపయోగించారు. దీని ఎత్తు 180 అడుగులు. లక్కగాజులు అమ్మే లాడ్ బజార్ ఇక్కడికి దగ్గర్లో ఉంది. ముత్యాల వ్యాపారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. తారామతి బారాదారి తారామతి బారాదారి నాడు కులీకుతుబ్‌షాహీ సంస్థానంలో ఓ గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఆ చారిత్రక కట్టడాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేసింది. పర్యాటకులకు అందుబాటులో ఏసీ రూమ్‌లు, ఫొటోషూట్, సినిమా ఘటింగ్లు, హోటల్ రూమ్‌లు, బుకింగ్‌లు, ఆడిటోరియం అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌మ్యాన్ కలెక్షన్ మ్యూజియంగా ప్రసిద్ధిగాంచిన ప్రదర్శనశాలను సుమారు గంట పది నిమిషాల సేపు సందర్శించవచ్చు. జలవిహార్ జలకాలాటలకు కేరాఫ్ జలవిహార్. వాటర్ గేమ్స్, డీజే రెయిన్ డ్యాన్స్, వేవ్ పూలు, క్రేజిన్ కైట్, డ్వస్టర్ లైట్, మ్యాట్రైడ్, సింగిల్ డ్యూట్, డబుల్ డ్యూట్ రైడ్ తదితర ఇక్కడి ప్రత్యేకత. ఎన్టీఆర్ గార్డెన్ ట్రీహౌస్, థీమ్ పార్కు, టాయ్ ట్రైన్, డౌన్ టౌన్ గేమ్స్, బోటింగ్, మచ్ అండ్ ట్రీ టవర్ ఇక్కడి ప్రత్యేకతలు. ఎటు చూసినా పచ్చందాలు కనిపిస్తాయి. లుంబినీ పార్క్ లుంబినీ పార్కులో విహారం మైమరిపిస్తుంది. వాటర్ గేమ్, లేజర్ షో, టాయ్ ట్రైన్, మ్యూజికల్ నైట్, మ్యూజికల్ ఫౌంటెయిన్ ఇక్కడి ప్రత్యేకతలు. బిర్లామందిర్ సిటీకి నడిబొడ్డున ఉంది. ఎత్తైన కొండపై ఆహ్లాదకర వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. బిర్లా టెంపుల్‌ను దర్శిస్తే సగం హైదరాబాద్‌ను కనుచూపు మేరలో చూడొచ్చు. శిల్పారామం 50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న శిల్పరామం ఆకట్టుకుంటోంది. సాంప్రదాయకంగా తయారుచేసిన హస్తకళలను ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా తయారైన కళారూపాయలు ఇక్కడ విక్రయిస్తారు.ముఖ్యంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉపయోగించే వస్తాలు, ఇతర అలంకరణ సామగ్రి లభ్యమవుతుంది. -
నేలపై.. నీటిలో..
విశాఖ సిటీ, తగరపువలస (భీమిలి): దేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖ రామకృష్ణ బీచ్‌లో వచ్చే నెల నుంచి హోవర్‌క్రాఫ్ట్‌లు పర్యాటకులను అలరించనున్నాయి. ఇప్పటికే హోవర్ డాక్ సంస్థ ప్రతినిధులు బీచ్‌లో హోవర్‌క్రాఫ్ట్‌లు తిరగడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి ప్రభుత్వపరమైన అనుమతులు పొంది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యా నుంచి రెండు హోవర్‌క్రాఫ్ట్‌లను దిగుమతి చేసుకున్న నిర్వాహకులు భోగాపురం మండలం రెడ్డి కంచేరు తీరంలో ఉంచి రష్యాకు చెందిన నిపుణులతోనే శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేలపైన, నీటిలోనూ తిరగగలిగే హోవర్‌క్రాఫ్ట్‌లు ఇప్పటి వరకు యూరప్ దేశాలు, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలోనే అందుబాటులో ఉన్నాయి. పర్యాటక నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖకు ఏడాదికేడాది పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వేసవిలో విశాఖకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి విశేషంగా పర్యాటకులు వస్తుంటారు. విశాఖలో ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే వీటిని అయిదు వరకు పెంచనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయిదుగురు ప్రయాణించగల హోవర్‌క్రాఫ్ట్ రూ.1.10 కోట్లు, ఏడుగురు ప్రయాణించగల వాహనాన్ని రూ.1.70 కోట్లకు నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఇప్పటికే విశాఖ తీరంలో సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం, కైలాసగిరి నుంచి అప్పుఘర్‌కు రోప్ వే వంటివి పర్యాటకులను అలరిస్తుండగా ఇటీవల హెలీ టూరిజమ్ పేరుతో ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో నగర సందర్శన పర్యాటకులను ఆకర్షించలేకపోయింది. నేలపై నుంచి నేరుగా నీటిలోకి దూసుకుపోయే హోవర్‌క్రాఫ్ట్‌లను నేవీలో వినియోగిస్తుంటారు. విశాఖలో హోవర్‌క్రాఫ్ట్ తయారీ పరిశ్రమ.. నగరంలో హోవర్‌క్రాఫ్ట్ సేవలు పర్యాటకులను ఆకర్షించగలిగితే ఇక్కడే హోవర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలతో తయారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. రష్యాలోని క్రిస్టి హోవర్‌క్రాఫ్ట్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. ఇవి కేవలం పర్యాటకులను ఆకర్షించడానికే కాకుండా తుఫానులు, వరదల సమయంలో వీటిలో బాధితులను జాగ్రత్తగా ఒడ్డుకు చేరవేయవచ్చు. మామూలు పడవలు ఎక్కువ లోతు గల నీటిలోనే ప్రయాణించగలవు. హోవర్‌క్రాఫ్ట్‌లు నీటిమట్టంతో సంబంధం లేకుండా నేలమీద కూడా ప్రయాణించగలవు కాబట్టి వీటిని సముద్రాలలోనే కాకుండా సరస్సులపై కూడా వినియోగించవచ్చు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఎదురయ్యే విషసర్పాలు, తేళ్లు, మొసళ్ల బారి నుంచి కూడా హోవర్‌క్రాఫ్ట్‌లు రక్షణగా ఉపయోగపడతాయి. పర్యాటకులు సముద్రంపై దీనిలో ప్రయాణించడానికి పది నిముషాలకు రూ.300 నుంచి 500 వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. -
ప్రయత్నం.. మిశ్రమ ఫలితం
అమ్మల చెంత కిక్కిరిసి జనం మొక్కులు చెల్లించి తరించారు.. ఈ భక్తప్రవా హానికి తగిన ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర టూరిజం, ఎకో టూరిజం, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు అందరిని ఆకట్టుకున్నాయి. వాటిలో సేదతీరిన వీఐపీ భక్తులు టూరిజం శాఖ సేవలు భేష్ అని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మిశ్రమ స్పందనను వెలిబుచ్చారు. ములుగు: మేడారం మహా జాతరకు రెండురోజుల ముందు నుంచి టూరిజం శాఖ ఆన్లైన్ పద్ధతిన అటవీశాఖ ఏకోటూరిజం సెల్‌ఫోన్ నంబర్ ద్వార బుకింగ్ ఆహ్వానించారు. తెలంగాణ టూరిజం తరఫున ఏర్పాటు చేసిన లగ్జరీ గుడారాలకు సౌకర్యాల విషయంలో మంచి స్పందన వచ్చింది. ఏకో టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాలతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. మొత్తానికి టూరిజం శాఖ భళా..అనిపించుకోగా, ఏకో టూరిజం శాఖ తరఫున ఏర్పాటు చేసిన గుడారాలు ఢీలా పడ్డాయి. ప్రత్యేక ఆకర్షణగా టూరిజం గుడారాలు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల, గిరిజన ఆదివాసీ మ్యూజియంల మధ్యలో ఈ జాతరలో భాగంగా 47 గుడారాలను ఏర్పాటు చేశారు. ఇందులో 20 లగ్జరీ గుడారాలు, 10 వీఐపీ, మరో 10 వీవీఐపీ గుడారాలు ఉన్నాయి. బుధవారం– 27, గురువారం –32, శుక్రవారం –44, శనివారం–45 గుడారాలు బుకింగ్ అ య్యా యి. ఇందులో రెండు లగ్జరీ గుడారాలను ఇంటర్నేషనల్ ప్రిలాన్స్ మీడియాకు కేంద్రం తరుపున బుకింగ్ చేయించారు. గుడారాల్లో ఏర్పాటు చేసిన బెడ్లు, ఫ్యాన్, కూలర్ల సౌకర్యాలు బాగున్నాయని వీవీఐపీ భక్తులు తెలిపారు. ఈ గుడారాలు మేడారం సమ్మక్క–సారమ్మల గద్దెలకు దగ్గరగా ఉండడంతో వీఐపీల దర్శనం సులువుగా మారింది. పైగా బుకింగ్ చేసుకున్న భక్తుల వాహనాలను నేరుగా గుడారాల వద్దకు పార్కింగ్ చేసుకునే విధంగా టూరిజంశాఖ తగిన ఏర్పాట్లు చేసింది. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో సఫలమయింది. అటవీశాఖకు ఆదరణ కరువు అటవీశాఖ ఏకోటూరిజం ఆధ్వర్యంలో జంపన్నవాగు వెనుక భాగంలో 100 గుడారాలను ఏర్పాటు చేశారు. 12 గంటల సమయానికి రూ.800, 24 గంటల పాటు ఉండడానికి రూ.1500లను కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా బుకింగ్‌కు ఆహ్వానించారు. గుడారాలను ఏర్పాటు చేసిన రెండోరోజు నుంచి బుకింగ్ ప్రారంభమైనా భక్తుల నుంచి ఆదరణ కరువైంది. కేవలం ఫోన్‌నెంబర్ల ఆధారంగా మాత్రమే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండడంతో అధికారుల ప్రయత్నం విఫలమైనట్లు తెలిసింది. జాతర జరిగిన బుధవారం–27, గురువారం–,80 శుక్రవారం–60 శనివారం– 30 గుడారాలు మాత్రమే బుకింగ్ అయినట్లు సంబంధిత శాఖ సిబ్బంది తెలిపారు. గుడారాల్లో రాత్రి పూట పడుకునే సమయంలో పొలాల్లోని మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డామని, ఆలయానికి సుదూరంగా గుడారాలను ఏర్పాటు చేయడంతో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని భక్తులు వాపోతున్నారు. పైగా జంపన్నవాగు సమీపంలో ఏర్పాటు చేయడంతో దర్శనానికి సాధారణ భక్తులతో పాటు కిలో మీటరుకు పైగా కాలినడకన వెళ్లాల్సి వచ్చిందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఫొటో షూట్ చేసి అంతర్జాతీయ మీడియాకు అందిస్తున్నాం. మేడారంలో జాతర జరుగుతుందని తెలిసి అంతర్జాతీయ మీడియా తరుపున గత నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. టూరిజం శాఖ తరుపున కేటాయించిన లగ్జరీ గుడారాలు బాగున్నాయి. రెండు బెడ్లు, ఫ్యాన్, కూలర్లు సౌకర్యంగా ఉన్నాయి. మరుగుదొడ్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. టూరిజం గుడారాలు ఏర్పాట్లు పూర్తిగా నచ్చాయి. – క్రిస్టియానా, జూలియట్ (బ్రెజిల్, జర్మనీ వాసులు) ఇబ్బందులు పడ్డాం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడారాల్లో 12 గంటల పాటు ఉండడానికి రూ.1000 చెల్లించి బుకింగ్ చేసుకున్నాం. వీఐపీ భక్తులుగా బుక్ చేసుకున్నా వాహనాలు కన్నెపల్లి పార్కింగ్ ప్రాంతంలోనే నిలిపివేశారు. అక్కడి నుంచి గుడారాలకు సామగ్రిని మోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డాం. టూరిజం శాఖ తరుపున బుకింగ్ చేసుకున్న వారికి గుడారాల వరకు అనుమతి ఇచ్చిన అధికారులు, ఏకో టూరిజం గుడారాలను బుకింగ్ చేసుకున్న మాకు అనుమతి ఇవ్వలేదు. – జీవన్ కుమార్, వరంగల్ పరుపులు లేక ఇబ్బంది పడ్డాం అటవీశాఖ తరుపున గుడారాలను ఏర్పాటు చేశారని తెలిసి 24గంటల పాటు ఉండడానికి రూ.1500 చెల్లించి ప్రకటించిన ఫోన్ నెంబర్ అధారంగా గుడారాన్ని బుకింగ్ చేసుకున్నాం. గుడారంలో ఎనిమిదిమంది పడుకునే విధంగా సౌకర్యం ఉంది. కాకపోతే పడుకోవడానికి వీలుగా గుడారంలో పరుపులు ఏర్పాటు చేస్తే బాగుండేది. పొలాల్లో గుడారాలు ఉండడంతో మట్టిపెళ్లలు గుచ్చుకొని ఇబ్బందులు పడ్డాం. – గడ్డం శ్రీనివాస్,కొత్తగూడెం -
పాపికొండల విహారయాత్రకు బ్రేక్
సాక్షి, రాజమండ్రి: పాపికొండలు విహారయాత్రకు అధికారులు బ్రేక్ వేశారు. యాత్రకు వెళ్లే పలు బోట్లను అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా మరో రెండు బోట్లను సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలో మూడు రోజుల క్రితం బోటు బోల్తా పడి 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఆయా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే బోట్లను రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను తనిఖీ చేసి పలు బోట్లను నిలిపివేశారు. అందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న రెండు బోట్లను అధికారులు సీజ్ చేశారు. -
3 జలపాతాలకు ముచ్చటైన వసతులు
జలపాతాల వద్ద పర్యాటకానికి ప్రాణం పోసేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. మంచిర్యాల జిల్లా కుంటాల, దానికి చేరువగా ఉన్న పొచ్చెర, భూపాలపల్లి జిల్లాలోని బొగత జలపాతాల వద్ద రోడ్లు, హోటల్, బస వసతులు కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధిపై నిర్ణయం తీసుకోనుంది. – సాక్షి, హైదరాబాద్ పదుల సంఖ్యలో ఉన్నా.. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని జలపాతాల కూటమి సప్తాహం, ఇచ్చోడ సమీపంలోని గాయత్రి జలపాతం, నిర్మల్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న సహస్త్రకుండ్, గూడూరు సమీపంలోని భీమునిపాదం, నిర్మల్ సమీపంలోని కనకాయి.. ఇలా ఎన్నో జలపాతాలున్నా 2 నెలలకు మించి కనువిందు చేయటం లేదు. దీంతో ప్రస్తుతానికి వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4 నుంచి 6 నెలలు నీటి ప్రవాహం ఉండే కుంటాల, పొచ్చెర, బొగత వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుమతులకు అటవీ శాఖ ససేమిరా.. జలపాతాల వద్దకు పర్యాటకులు వచ్చేందుకు వీలుగా వసతులు కల్పిస్తే జీవ వైవిద్యానికి ఇబ్బందిగా పరిణమిస్తుందని అటవీ శాఖ చెబుతోంది. అనుమతులిచ్చేందుకు ససేమిరా అంటోంది. ఇప్పటికే బొగత, కుంటాల వద్ద రోడ్లు నిర్మించగా.. బొగత వద్ద వసతి గదుల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. దీన్ని అటవీ శాఖ వ్యతిరేకిస్తోంది. ‘దట్టమైన అడవుల్లో ఈ జలపాతాలుంటున్నాయి. జంతుజాలం, గిరిజన గూడేలకు కేంద్రాలవి. రోడ్లు, ఇతర వసతులు కల్పిస్తే జంతుజాలం, గిరిజన జీవనానికి ఇబ్బందవుతుంది. పర్యావరణానికి హాని చేసే చర్యలు సరికాదన్న అభిప్రాయం నేపథ్యంలో వసతుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది’ అని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు పేర్కొన్నారు. అది ఆదిమానవుల నెలవు భూపాలపల్లి జిల్లా గద్దలచెర గుట్ట వద్ద మరో జలపాతం ఉంది. వందల అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతున్న తీరు అద్భుతంగా ఉంది. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆదిమానవులకు నెలవని తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అక్కడ వారు వాడిన పనిముట్లు, నీళ్లు నిలిచేందుకు చేసుకున్న ఏర్పాట్ల ఆనవాళ్లు కనిపించాయి. – సత్యనారాయణ, ఔత్సాహిక పరిశోధకుడు -
పర్యాటక కేంద్రంగా ఘంటసాల
ఘంటసాల: ఘంటసాలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ చెప్పారు. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బాబు.ఎతో కలిసి శ్రీకాంత్ బౌద్ధారామం, పురావస్తు ప్రదర్శనశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ప్రాంతం ప్రసిద్ధి బౌద్ధక్షేత్రంగా విరసిల్లిందన్నారు. నాటి వైభవాన్ని తీసుకొచ్చేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత విశిష్టతపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ జీవీ రామకృష్ణతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో వసతుల కల్పించాలి : కలెక్టర్ ఘంటసాలలో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాలను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వసతిగృహంలో కళాశాలను ఏర్పాటుచేయగా విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే ఉత్తమ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కళాశాలను పరిశీలించిన వారిలో డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పలువురు అధికారులు కూడా ఉన్నారు. -
వంట..నోరూరెనంట
విజయవాడ (మొగల్రాజపురం) : మన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార రుచులను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పర్యాటక శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్పీ కుజారియా అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాయత్రీనగర్‌లోని మెట్రోపాలిటన్ హోటల్లో వంటల పోటీలు జరిగాయి. విజేతలకు కుజారియా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, మన ఆహారానికి మంచి పేరు ఉందన్నారు. దీనిద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అపారంగా ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. టూరిజం శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.సుధాకుమార్‡మాట్లాడుతూ వంటల పోటీలను తమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించామన్నారు. పోటీలను నిర్వహించిన వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కె.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల విద్యార్థులతో పాటు స్టార్స్ హోటల్స్ చెఫ్‌లు, గృహిణులు పాల్గొన్నారన్నారు.